ధాన్యం కొనుగోల్‌మాల్‌!

ABN , First Publish Date - 2021-04-26T05:15:14+05:30 IST

జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రహసనంగా మారాయి. ఈ కేంద్రాల ముసుగులో మిల్లర్లకు దోచిపెడుతున్నారు. ఇందుకు తాజాగా వెలుగుచూసిన బోగస్‌ కేంద్రాలే నిదర్శనం. కందుకూరు నియోజకవర్గంలో గుడ్లూరు, బసిరెడ్డిపాలెం, చేవూరు, వీరేపల్లి, చాగొల్లు, మోపాడు, పెంట్రాల, చినపవనిలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించారు.

ధాన్యం కొనుగోల్‌మాల్‌!
గుడ్లూరు ధాన్యం కొనుగోలు కేంద్రంలో వరిధాన్యం అమ్ముకోటానికి ఎండబెడుతున్న రైతులు

మిల్లర్ల కనుసన్నల్లో నిర్వహణ

రికార్డుల్లోనే పంట కొనుగోళ్లు 

మరోపక్క ధాన్యం 

కొనేనాథుడు లేక రైతుల పాట్లు 

ఆగమేఘాలపై పెంట్రాల

కేంద్రాన్ని రద్దు చేసిన జేసీ

చినపవనిలోనూ ఇదే తంతు 

జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున బోగస్‌ కేంద్రాల దందా

కందుకూరు, ఏప్రిల్‌ 25 : 

రైతులకు మద్దతు ధర పేరుతో మిల్లర్లకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచిపెట్టే దందా యథేచ్చగా నడుస్తోంది. కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మొక్కుబడిగా రైతుల ధాన్యం కొంటూ వాటికి సమాంతరంగా మిల్లర్లకు ప్రయోజనం చేకూర్చటమే లక్ష్యంగా  పని చేస్తున్నారు. ఆయా కేంద్రాల్లో అసలు ధాన్యం కొనుగోళ్లు ఆనవాళ్లే ఉండవు. కనీసం బోర్డు కూడా పెట్టరు. అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రం ఉందన్న విషయం అధికారులకు, మిల్లర్లకు, ఆ కేంద్రం నిర్వాహకులకు తప్ప మరెవ్వరికీ తెలియదు. అయితే రికార్డులు పరిశీలిస్తే మాత్రం అక్కడ శరవేగంగా కొనుగోళ్లు జరిగినట్లు.. వందల టన్నులు రైతుల వద్ద సేకరించినట్లు కనిపిస్తుంది. మరోపక్క రైతులను మాత్రం తేమశాతం ఎక్కువ ఉందని, తాలు ఉందని సాకులు చెబుతూ ముప్పతిప్పలు పెడుతున్నారు. ఫలితంగా రైతులు విసిగిపోయి దళారులకు తెగనమ్ముకుంటుంటారు. ఇలా కందుకూరు నియోజకవర్గంలో జరుగుతున్న తంతుపై పరిశీలన చేయగా ఈ గోల్‌మాల్‌ జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున జరుగుతున్నట్లు తేటతెల్లమవుతోంది. 

జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రహసనంగా మారాయి. ఈ కేంద్రాల ముసుగులో మిల్లర్లకు దోచిపెడుతున్నారు. ఇందుకు తాజాగా వెలుగుచూసిన బోగస్‌ కేంద్రాలే నిదర్శనం. కందుకూరు నియోజకవర్గంలో గుడ్లూరు,  బసిరెడ్డిపాలెం, చేవూరు, వీరేపల్లి, చాగొల్లు, మోపాడు, పెంట్రాల, చినపవనిలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించారు. వీటిలో చేవూరు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం తప్ప అక్కడ కార్యకలాపాలు సాగలేదు. ఇక మండల కేంద్రమైన గుడ్లూరు, బసిరెడ్డిపాలెంలలో నెలరోజులుగా రైతులు తమ ధాన్యం అమ్ముకోటానికి నానా తంటాలు పడుతుండగా కేవలం 1,100 టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. అలాగే వీరేపల్లిలో 171 టన్నులు, చాగొల్లులో 195 టన్నులు రైతుల వద్ద కొనుగోలు చేశారు. వీటిలో 40శాతం వరకూ రైతుల పేరుతో దళారులు అమ్ముకున్నట్లు సమాచారం. ఆ విషయం ఎలా ఉన్నా లింగసముద్రం మండలంలోని పెంట్రాల, చినపవనిలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నట్లు రైతులు ఎవరికీ తెలియదు. కానీ ఈ రెండు చోట్ల 662 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో నమోదై ఉంది. కానీ ఇక్కడ కనీసం కాటాలు ఏర్పాటు చేయటం కానీ, బోర్డు పెట్టడం కానీ, ఒక్క రైతైనా వచ్చి ధాన్యం అమ్ముకున్న  దాఖలాలు కానీ లేవు.

రైతుకు మద్దతు పేరుతో దోపిడీ 

 రైతులకు మద్దతు ధర పేరుతో ఈ దోపిడీ వ్యవహారం పెద్ద ఎత్తున నడుస్తోంది. బహిరంగ మార్కెట్లో ధాన్యం కొనే దిక్కులేక రైతులు 75 కిలోల బస్తాను రూ.వెయ్యి నుంచి రూ.1,050కి తెగనమ్ముకుంటున్నారు. ఆ ధరకు ఇస్తూ కూడా బస్తాకు 4కిలోల తరుగు ఇస్తున్నారు. అయితే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఉద్దేశం ఏమిటంటే రైతుకి బస్తాకు రూ.1,401 మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని. కానీ ఆ ధర రైతుకి దక్కటం గగనమే అవుతున్నా మిల్లర్లు మాత్రం రూ.కోట్లు గడిస్తున్నారు. కందుకూరు నియోజకవర్గంలో రమారమి 40వేల ఎకరాల్లో ఈ ఏడాది వరిసాగు జరిగింది. సరాసరిన ఎకరానికి 30క్వింటాళ్ల దిగుబడి వేసుకున్నా ఈ ప్రాంతంలో 12లక్షల క్వింటాళ్ల వరి ధాన్యం దిగుబడి వచ్చింది. అంటే లక్షా 20 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి రాగా అందులో 90శాతానికిపైగా ఇప్పటికే నూర్పిళ్లు, అమ్మకాలు కూడా పూర్తయ్యాయి. అయితే ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసింది కేవలం 2వేల మెట్రిక్‌ టన్నులే. అందులో 662మెట్రిక్‌ టన్నులు బోగస్‌ కొనుగోలు కేంద్రాల్లో చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. అంటే రైతుల వద్ద కొనుగోలు చేసింది కేవలం 1,340 మెట్రిక్‌ టన్నులే. లక్షా 20వేల మెట్రిక్‌ టన్నులకు 1,340టన్నులంటే కేవలం ఒక్కశాతం మాత్రమే. అదలా ఉంటే కేవలం కందుకూరు నియోజకవర్గంలోని రెండు బోగస్‌ కేంద్రాల్లో కొనుగోలు చేసిన 662 మెట్రిక్‌ టన్నుల్లో బస్తాకు రూ.300 ధర వ్యత్యాసం వేసుకున్నా 8,826 బస్తాలకు రూ.26,47,800 గోల్‌మాల్‌కి రంగం సిద్ధమైంది. ఈ మొత్తం రైతుల పేరుతో మిల్లర్లు, అధికారుల జేబుల్లోకి చేరుతుందనేది బహిరంగ రహస్యం. 

పెంట్రాల కేంద్రం రద్దు 

పెంట్రాల గ్రామస్థులు ఎమ్మెల్యే మహీధరరెడ్డికి ఇచ్చిన సమాచారంతో ఈ గోల్‌మాల్‌పై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒంగోలుకి చెందిన పొగాకు ఉత్పత్తిదారుల సంఘానికి ఈ కేంద్రం నిర్వహణ  బాధ్యతలు అప్పగించారన్నప్పుడే ఏదో జరుగుతుందని అనుమానించానని, రైతులు ఒక్క గింజ కొనలేదని చెబుతుండగా 49మంది రైతుల పేరుతో 4,432 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో చూపిస్తుండటం గోల్‌మాల్‌ కాక ఇంకేమిటని ఆయన జిల్లా అధికారులను నిలదీశారు. దీంతో ఆగమేఘాలపై కదిలిన అధికారులు కందుకూరు ఏడీఏ ఎం.శేషగిరితో విచారణ  నివేదిక తెప్పించుకోవటమే గాక పెంట్రాల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సాయత్రానికి జాయింట్‌ కలెక్టరు రద్దు చేసేశారు కూడా. 

ఫిర్యాదు వ స్తే రద్దుచేయటంతో సరా?

ఫిర్యాదు వచ్చిన కేంద్రాన్ని రద్దుచేయటంతో ఈ గోల్‌మాల్‌ వ్యవహారం ఆగుతుందా అన్న విమర్శలకు అధికారుల వద్ద సమాధానం లేదు. అదేవిధంగా చినపవనిలో కూడా జరుగుతున్నది ఆ తంతే. అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రం నడుస్తున్నట్లు ఆ గ్రామంలోని రైతులకు కూడా తెలియదు. అయితే రికార్డుల్లో మాత్రం 312 మెట్రిక్‌ టన్నులు అక్కడ ఇప్పటివరకు కొనుగోలు చేసినట్లు ఉంది. కేవలం చినపవని మాత్రమే కాదు జిల్లాలో ఇలాంటి కేంద్రాలు 20శాతంకుపైగా ఉన్నాయని ఆశాఖకు సంబంధించిన  అధికారులు బాహాటంగా చెబుతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. జిల్లాలో 152 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు 11,338 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించామని, అయితే రానున్న రెండు నెలల్లో పెద్దఎత్తున కొనుగోళ్లు చేస్తామని పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజరు నారదముని ఆంధ్రజ్యోతికి తెలిపారు. అంటే 20 శాతం వరకు బోగస్‌ కేంద్రాలు నడుస్తున్నాయంటే ఎంత పెద్దఎత్తున ఈ గోల్‌మాల్‌ నడుస్తుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. మరోపక్క మిల్లర్లు అతి తక్కువ ధరకు రైతుల వద్ద కొనుగోలు చేసి పెట్టుకుని ఉన్న ధాన్యాన్ని ఈ కేంద్రాల్లో కొనుగోలు చేసినట్లు చూయించటం ద్వారా రానున్న రోజుల్లో పెద్ద గోల్‌మాల్‌కి రంగం సిద్ధమైనట్లు అధికారుల మాటల్లో అర్థమవుతోంది. ధాన్యం అంతా రైతులు అమ్ముకోగా, మరో రెండు నెలలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడుస్తాయన్న అధికారుల మాటల ద్వారానే ఈ విషయం రూఢీ అవుతోంది. 




Updated Date - 2021-04-26T05:15:14+05:30 IST