కుళ్లిపోయిన వరి

ABN , First Publish Date - 2020-10-30T06:03:14+05:30 IST

ఈ నెల రెండో వారంలో కురిసిన భారీవర్షాలు, శారదా నది వరద ముంపుతో రాంబిల్లి మండలంలోని పలు గ్రామాల్లో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఏడెనిమిది గ్రామాల పరిధిలో దాదాపు రెండు వేల ఎకరాల్లో పంట వారానికిపైగా నీటిలోనే వుండడంతో పూర్తిగా కుళ్లిపోయింది.

కుళ్లిపోయిన వరి
దిమిలిలో వరి పొలంలో మట్టి మేటలు

రాంబిల్లి రైతులకు అపార నష్టం

వారానికిపైగా నీటిలో ఉండడంతో

2 వేల ఎకరాల్లో పూర్తిగా దెబ్బతిన్న పైరు

ఎకరాకు రూ.20-రూ.25 వేల వరకు పెట్టుబడి

రూ.నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల మేర పంట నష్టం

ఎకరాకు రూ.6 వేలు ఇస్తామంటున్న ప్రభుత్వం

ఇన్‌పుట్‌ సబ్సిడీతోపాటు బీమా పరిహారం కూడా అందజేయాలని రైతుల వినతి

రాంబిల్లి, అక్టోబరు 29: ఈ నెల రెండో వారంలో కురిసిన భారీవర్షాలు, శారదా నది వరద ముంపుతో రాంబిల్లి మండలంలోని పలు గ్రామాల్లో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఏడెనిమిది గ్రామాల పరిధిలో దాదాపు రెండు వేల ఎకరాల్లో పంట వారానికిపైగా నీటిలోనే వుండడంతో పూర్తిగా కుళ్లిపోయింది. వరికి ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పెట్టుబడి అవుతోంది. ఈ లెక్కన మండలంలో రూ.నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీగా ఎకరాకు రూ.6 వేలు కాకుండా పూర్తిస్థాయిలో నష్టపరిహారాన్ని అందజేయాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

రాంబిల్లి మండలంలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో సుమారు 9,500 ఎకరాల్లో రైతులు వరి నాట్లు వేశారు. సమయానుకూలంగా వర్షాలు పడుతుండడంతో పంట ఏపుగా పెరుగుతూ అక్టోబరు రెండు వారానికి పొట్ట దశకు చేరుకుంది. ఈ తరుణంలో నాలుగైదు రోజులపాటు భారీవర్షాలు కురవడంతో ఎగువ మండలాల నుంచి వరద నీటితో శారదా నది పోటెత్తి పంట పొలాలను ముంచేసింది. రజాల, రజాల అగ్రహారం, వెల్చూరు, దిమిలి, మర్రిపాలెం, వైలోవ, పెదకలవలాపల్లి, మూలజంప తదితర 11 గ్రామాల పరిధిలో నాలుగు వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. తరువాత వర్షాలు ఆగి, నదిలో వరద తగ్గడంతో సుమారు రెండు వేల ఎకరాల్లో వరి పంట  రెండు, మూడు రోజుల్లో ముంపు నుంచి బయటపడి తేరుకుంది. మరో రెండు వేల ఎకరాల్లో వరి పంట సుమారు పది రోజులపాటు నీటిలోనే వుండడంతో దెబ్బతిని కుళ్లిపోయింది. వ్యవసాయ, రెవెన్యూ సిబ్బంది ఆయా గ్రామాల్లో పర్యటించి, పంట నష్టాన్ని అంచనా వేశారు. నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు అందజేశారు. వరదల వల్ల పంటలు కోల్పోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద ఎకరాకు రూ.6 వేల చొప్పున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాంబిల్లి మండల రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పెట్టుబడులు ఆయ్యాయని, ప్రభుత్వ ఇందులో నాలుగో వంతు మాత్రమే ఇస్తే ఎలా సరిపోతుందని ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. పంటల బీమా పథకం కింద పూర్తిస్థాయిలో పరిహారం అందేలా చూడాలని, రబీ సాగుకు అవసరమైన విత్తనాలను ఉచితంగా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకోవాలి

పప్పల సూరిబాబు, రైతు, దిమిలి

నేను సుమారు 20 ఎకరాల్లో వరి పంట వేశారు. రూ.4 లక్షల వరకు పెట్టుబడి అయ్యింది. ఇటీవల భారీవర్షాలు కురిసి, వరద నీరు పంట పొలాలను ముంచేసింది. మా వరి పొలాలు వారం రోజులపాటు నీటిలో మునిగిపోయాయి. పంట మొత్తం కుళ్లిపోయింది. పెట్టుబడి మొత్తం వరద పాలైంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకోవాలి.

Updated Date - 2020-10-30T06:03:14+05:30 IST