వరి ధాన్యం సేకరణలో 17.73శాతం వృద్ధి

ABN , First Publish Date - 2020-11-23T07:28:58+05:30 IST

దేశంలోని 2020-21 ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌లో కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర(ఎంఎ్‌సపీ)తో వరి ధాన్యం, పత్తి సేకరణ ప్రక్రియను విజయవంతంగా చేపట్టింది...

వరి ధాన్యం సేకరణలో 17.73శాతం వృద్ధి

న్యూఢిల్లీ, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): దేశంలోని 2020-21 ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌లో కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర(ఎంఎ్‌సపీ)తో వరి ధాన్యం, పత్తి సేకరణ ప్రక్రియను విజయవంతంగా చేపట్టింది. ఈనెల 21 వరకు వరి ఽధాన్యం సేకరణలో గత ఏడాది కంటే ఈ ఏడాది 17.73 శాతం వృద్ధిని సాధించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ ఆదివారం ప్రకటించింది. ఆ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. నిరుడు ఈ సీజన్‌లో 252.69 లక్షల మెట్రిక్‌ టన్నుల (ఎల్‌ఎంటీ) వరిధాన్యం సేకరించారు. ఈ సీజన్‌లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఉత్తరాఖండ్‌, తమిళనాడు, చండీగఢ్‌, జమ్మూకశ్మీర్‌, కేరళ, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, మహారాష్ట్ర, హరియాణా రాష్ర్టాల నుంచి ఇప్పటివరకు 297.51 ఎల్‌ఎంటీలవరి ధాన్యాన్ని ఎంఎ్‌సపీతో సేకరించారు, వీటిలో ఒక్క పంజాబ్‌ నుంచే 201.73 ఎల్‌ఎంటీల ధాన్యం సేకరించగలిగారు.


వరిధాన్యం సేకరణ వల్ల 26.15 లక్షల మంది రైతులు రూ.56,168.95 కోట్ల మేరకు లబ్ధి పొందారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, గుజరాత్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, హరియాణా, ఒడిశా, కర్ణాటక నుంచి రూ.6,440.28కోట్ల విలువైన పత్తి బేళ్లను(సీడ్‌ కాటన్‌) కొనుగోలు చేయగా, 4,19,634 మంది రైతులు లబ్ధి పొందారు. తమిళనాడు, మహారాష్ట్ర,  గుజరాత్‌, హరియాణా, రాజస్థాన్‌లో మినపపప్పు, పెసరపప్పు, వేరుసెనగ, చిక్కుడు తదితర పప్పు దినుసులకు సంబంధించి 6,745.66 మెట్రిక్‌ టన్నులను ఎంఎ్‌సపీతో కేంద్రం కొనుగోలు చేసింది. దీని విలువ రూ.362.43కోట్లు.38,892మంది రైతులు లబ్ధిపొందారు.


Updated Date - 2020-11-23T07:28:58+05:30 IST