కోతల జోరు.. కొనుగోలు కేంద్రాలు లేక అన్నదాత బేజారు

ABN , First Publish Date - 2021-10-19T04:41:39+05:30 IST

మెదక్‌ జిల్లాలో వరి కోతలు ఊపందుకున్నాయి. సీజన్‌ ప్రారంభంలో నాట్లు వేసుకున్న పొలాల్లో పంట చేతికి వచ్చింది. ఇప్పటికే కోతలు పూర్తిచేసిన రైతులు కల్లాల దగ్గర ధాన్యం ఆరబోస్తున్నారు. కోతల ప్రక్రియ పూర్తిచేసిన రైతులు కొనుగోలు కేంద్రాల దగ్గరకు ధాన్యం తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయంపై స్పష్టత రాలేదు. అధికారులు

కోతల జోరు.. కొనుగోలు కేంద్రాలు లేక అన్నదాత బేజారు
కొల్చారంలో వరి కోస్తున్న హార్వెస్టర్‌

తెరుచుకోని కొనుగోలు కేంద్రాలు

ఆందోళన కలిగిస్తున్న అకాల వర్షాలు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, అక్టోబరు 18 : మెదక్‌ జిల్లాలో వరి కోతలు ఊపందుకున్నాయి. సీజన్‌ ప్రారంభంలో నాట్లు వేసుకున్న పొలాల్లో పంట చేతికి వచ్చింది. ఇప్పటికే కోతలు పూర్తిచేసిన రైతులు కల్లాల దగ్గర ధాన్యం ఆరబోస్తున్నారు. కోతల ప్రక్రియ పూర్తిచేసిన రైతులు కొనుగోలు కేంద్రాల దగ్గరకు ధాన్యం తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయంపై స్పష్టత రాలేదు. అధికారులు ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించలేదు. 


పెరిగిన వరి సాగు

నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో ఈసారి జిల్లాలో వరి సాగు భారీగా పెరిగింది. జిల్లాలో మొత్తం 2.25 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. వాతావరణం అనుకూలించడంతో దిగుబడులు కూడా పెరిగే అవకాశం ఉన్నది. 5.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత యాసంగిలో జిల్లాలో 2.12 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 4.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. రూ. 800 కోట్లు వెచ్చించి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసింది. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో ధాన్యం దిగుబడి ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నా అధికార యంత్రాంగం మాత్రం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయడం లేదు. ధాన్యం కొనుగోలు కోసం రెవెన్యూ, సివిల్‌సప్లయ్‌, మార్కెటింగ్‌, కోఆపరేటివ్‌, ట్రాన్స్‌పోర్టు శాఖల అధికారులు సమీక్షా సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఆయా శాఖ అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.


కలవరపెడుతున్న వర్షాలు

పంట చేతికి వచ్చిన సమయంలో కురుస్తున్న వర్షాలు రైతన్నను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే కోతలు పూర్తిచేసిన రైతులు ధాన్యాన్ని రోడ్లపై, కల్లాల దగ్గర ఆరబోస్తున్నారు. ఈ సమయంలో వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం తడుస్తున్నది. తుఫాను కారణంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో వెయ్యి ఎకరాల్లో పంట నీట మునిగింది. వరి కుప్పలు తడవడంతో ధాన్యాన్ని రైతులు రోడ్లపై ఆరబోస్తున్నారు. 

Updated Date - 2021-10-19T04:41:39+05:30 IST