166 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు

ABN , First Publish Date - 2021-12-01T07:08:35+05:30 IST

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన ధాన్యం సేకరణపై యంత్రాంగం దృష్టి సారించింది.

166 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు
ధాన్యాన్ని గోతాలకు నింపుతున్న కూలీలు (ఫైల్‌)

ఏర్పాట్లు చేస్తున్న అధికారులు 

మిల్లర్ల ప్రమేయం ఉండొద్దని ప్రభుత్వ ఆదేశం

ఈ సీజన్‌లో మార్క్‌ఫెడ్‌కు అవకాశం లేనట్లే!

ఒంగోలు (జడ్పీ), నవంబరు 30 : జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన ధాన్యం సేకరణపై యంత్రాంగం దృష్టి సారించింది. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 166 కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే  గుర్తించింది. ఇవన్నీ ఆర్‌బీకేలకు అనుసంధానంగానే ఏర్పాటు కానున్నాయి. అవసరాన్ని బట్టి వీటి సంఖ్యను పెంచుతామని అధికారులు చెప్తున్నారు. కొనుగోళ్లలో మిల్లర్లు అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ప్రతి సీజన్‌లో వస్తుండడంతో ధాన్యం సేకరణలో వారి ప్రమేయం ఉండకూడదని ప్రభుత్వం ఆదేశించింది. రైతులంతా ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధరకు ధాన్యాన్ని అమ్ముకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. విధిగా ఈక్రాప్‌తోపాటు ఈకేవైసీ కూడా చేయించుకోవాలని సూచించారు. రైతులకు  21రోజుల్లోపు నగదు చెల్లింపులు జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. 


రబీ  కొనుగోళ్ల నాటికి రంగంలోకి మార్క్‌ఫెడ్‌

ధాన్యం కొనుగోళ్లలో పౌరసరఫరాలశాఖతోపాటు మార్క్‌ఫెడ్‌ను కూడా రంగంలోకి దించాలని తొలుత ప్రభుత్వం భావించింది. కానీ ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను దగ్గరగా పరిశీలించాలని ఆ సంస్థను ప్రభుత్వం ఆదేశించింది. పూర్తి అవగాహన వచ్చిన తర్వాత రబీ సీజన్‌ నుంచి మార్క్‌ఫెడ్‌ ద్వారా కూడా ధాన్యం కొనుగోళ్లను చేపట్టనుంది.


ఖరీఫ్‌లో  75,000 ఎకరాల్లో వరిసాగు

ఖరీఫ్‌ సీజన్‌లో 75వేల ఎకరాల్లో వరిసాగు చేసినట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. దాదాపు 65వేల టన్నుల ధాన్యాన్ని ఈ సీజన్‌లో కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్దేశించుకుంది. మండలాల వారీగా పంటనూర్పిళ్ల ఆధారంగా కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు తెరిచేది నిర్ణయిస్తామని యంత్రాంగం చెబుతోంది.


మిగిలిందన్నా కొనండి

మొక్కజొన్న రైతు వేడుకోలు

 అకాల వర్షాలు మొక్కజొన్న రైతును నిలువునా ముంచాయి. సరిగ్గా పంట చేతికొచ్చే సమయానికే వాయుగుండం వచ్చిపడటంతో ఖరీఫ్‌ సాగు విస్తీర్ణంలో 85శాతం తుడిచిపెట్టుకుపోయింది. కండెల మీద మొలకలు వచ్చి పనికిరాకుండా పోయాయి. జిల్లావ్యాప్తంగా 4వేల ఎకరాల్లో ఖరీఫ్‌ సీజన్‌కు గాను మొక్కజొన్న సాగు చేశారు. అధికారిక లెక్కల ప్రకారమే 3,005.45 ఎకరాల్లో పంట దెబ్బతిందని తేలింది. ప్రధానంగా బేస్తవారపేట, చీమకుర్తి, ముండ్లమూరు, ఇంకొల్లు, కారంచేడు ప్రాంతాల్లోని రైతాంగానికి తీవ్రనష్టం వాటిల్లింది. అంతోఇంతో చేతికొచ్చిన పంటను అమ్ముకోవాలన్నా కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దిగుబడిలో 85శాతం మేర పంట వర్షార్పణమైంది. మిగిలిన 15శాతం పంటను కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమ్ముకోలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.1870 ఉండగా, బహిరంగ మార్కెట్‌లో రూ.1,600 కన్నా తక్కువగానే ఉంటోందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాల ద్వారా మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.


Updated Date - 2021-12-01T07:08:35+05:30 IST