Advertisement
Advertisement
Abn logo
Advertisement

సన్నధాన్యమంతా ఇక్కడికే..

మిర్యాలగూడకు క్యూకడుతున్న ధాన్యం ట్రాక్టర్లు

వడివడిగా పంటనూర్పిడి పనులు 

ఉమ్మడి జిల్లాలో ఐదు వేలకుపైగా హార్వెస్టర్లు

రైస్‌మిల్లుల వద్ద ట్రాక్టర్ల క్యూ

మిల్లులన్నింటినీ నడిపించేలా అధికారుల చర్యలు

రాత్రి సమయంలో వరికోతలు బంద్‌

మిర్యాలగూడ అర్బన్‌, అక్టోబరు 29: వర్షాలు పుష్కలంగా కురిశాయి.. చెరువులు, కుంటలు మత్తడి దుమికాయి.. సాగర్‌ జలాశయం నుంచి గత ఏడాదికంటే పక్షం రోజులకు ముందుగానే సాగునీటిని విడుదల చేశారు. దీంతో ఈ వానాకాలంలో మెట్టపంటలకు ప్రాధాన్యం తగ్గించి వరిసాగువైపు రైతులు దృష్టిసారించారు. ఈ సీజన్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 11,91,360 ఎకరాల్లో వరి సాగు చేయగా, అందులో సుమారు 9.84లక్షల ఎకరాల్లో సన్నరకం సాగుచేశారు. ఆయకట్టు, ఆయకట్టేతర ప్రాంతాల్లోనూ ఒకేసారి వరిసాగు మొదలై ఏకకాలంలో పంట దిగుబడులు చేతికి రావడంతో నూర్పిడి పనులను ముమ్మరంచేశారు. దీంతో ఉత్పత్తి అయిన ధాన్యాన్ని అంతా రైతులు విక్రయించుకునేందుకు ట్రాక్టర్లలో నింపి మిల్లుపాయింట్ల వద్దకు చేరవేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సన్న ధాన్యాన్ని మర ఆడించి నాణ్యమైన బియ్యాన్ని ఉత్పత్తిచేయగల అధునాతన టెక్నాలజీ కలిగిన మిల్లులు ఒక్క మిర్యాలగూడ ప్రాంతంలోనే విస్తరించి ఉండడంతో సన్న ధాన్యమంతా ఈ ప్రాంతంవైపు తరలివస్తోంది. దీంతో మిల్లుపాయింట్ల వద్ద ధాన్యంలోడుతో వచ్చిన వాహనాలు పెద్ద సంఖ్యలో దిగుమతి కోసం క్యూలో వేచి ఉంటున్నాయి.

ఇతర రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో హార్వెస్టర్ల రాక

తమిళనాడు, కర్ణాటక, ఏపీ రాష్ట్రాలకంటే దాదాపు నెలరోజుల ముందుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరిపంట నూర్పిడి పనులు మొదలవుతాయి. దీంతో ఆ రాష్ట్రాల నుంచి హార్వెస్టర్ల(వరికోతయంత్రాలు)ను ఈ ప్రాంత బ్రోకర్లు, ఏజెంట్లు లీజుకు తీసుకొని నడిపిస్తుంటారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,800 హార్వెస్టర్లు ఉండగా, ఇతర ప్రాంతాల నుంచి మరో 2,500 వరకు యంత్రాలు దిగుమతి అయినట్లు సమాచారం. ఒక్కో యంత్రాన్ని రోజంతా నడిపిస్తే దాదాపు నాలుగు నుంచి ఆరు ఎకరాల వరిపైరును నూర్పిడి చేస్తుంది. దీంతో ఒక్కో యంత్రం ద్వారా 135 క్వింటాళ్ల ధాన్యాన్ని శుద్ధిచేసి విక్రయానికి సిద్ధంగా ట్రాక్టర్లలో లోడ్‌ చేస్తుంది. ప్రస్తుతం రైతాంగమంతా యాంత్రికశక్తి ఆధారంగానే పంటనూర్పిడి పనులు పూర్తి చేస్తున్న నేపథ్యంలో వరికోత యంత్రాలకు డిమాండ్‌ పెరిగింది. మరోవైపు సన్నధాన్యం తేమ ఉండగానే నూర్పిడి పూర్తిచేయాల్సి వస్తున్న నేపథ్యంలో రైతులు పోటీపడి వరికోతలు పూర్తిచేస్తున్నారు. దీంతో నిత్యం జిల్లావ్యాప్తంగా దాదాపు 7,155 మెట్రిక్‌ టన్నుల ధాన్యం విక్రయాల కోసం మిల్లుపాయింట్ల వద్దకు చేరుతోంది. అయితే తరలివస్తున్న ధాన్యం దిగుబడులను కొనుగోలు చేసేందుకు మిల్లర్లంతా పోటీపడి ముందుకు రాకపోవడంతో మిల్లుపాయింట్ల వద్ద భారీగా ధాన్యం వాహనాలు నిలిచిపోతున్నాయి.

మిల్లులన్నీ తెరిస్తేనే..

హార్వెస్టర్ల దిగుమతి భారీగా పెరగడంతో నూర్పిడి పనులు శరవేగంగా సాగిపోతున్నాయి. దీంతో ధాన్యం వెల్లువలా విక్రయకేంద్రాల వద్దకు చేరడంతో ప్రధాన రహదారులపై ప్రమాదకరంగా వాహనాలు నిలిచిపోతున్నాయి. అలాగే రైతులు సైతం రోజుల తరబడి మిల్లుల వద్ద నిరీక్షించాల్సి వస్తుండడంతోపాటు ధాన్యం రంగుమారి ధరలో తేడా వస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఏరోజుకారోజు తరలివచ్చే ధాన్యమంతా దిగుమతి కావాలంటే వారంలో రెండు రోజులు, రాత్రి వేళల్లో వరికోతలు నిలిపివేసేందు కు నిర్ణయించింది. అందులో భాగంగా ప్రతీ గ్రామంలో యంత్రాలను నడిపిస్తున్న ఏజెంట్ల వివరాలు సేకరించి వారి వద్ద ఉన్న హార్వెస్టర్ల సంఖ్యను వ్యవసాయ, పోలీ్‌సశాఖలు సేకరించారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రివేళల్లోనూ వరికోతలు నిర్వహించి తేమ, తాలు ఇతర వ్యర్థాలతో కూడిన ధాన్యాన్ని మిల్లుల వద్దకు తరలిస్తున్నారు. హార్వెస్టర్ల ఏజెంట్లు, యాజమాన్యాల నిర్వాకంతో ధా న్యంలో నాణ్యత తగ్గి ధర పడిపోయి రైతుకు నష్టం జరుగుతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు రాత్రివేళల్లో క్రాప్‌ హార్వెస్టింగ్‌ నిలిపివేసేలా అధికారులు అదేశాలు జారీచేశారు. ఇదే దశలో ఉమ్మ డి జిల్లావ్యాప్తంగా విస్తరించి ఉన్న బాయిల్డ్‌ రైస్‌ మిల్లులన్నింటినీ నడిపించేలా చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగం సిద్ధపడుతోంది. ఇప్పటికే పలువురు మిల్లర్లకు మౌఖిక ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది. దీంతో మిర్యాలగూడ, వేములపల్లి ప్రాంతా ల్లో మరో ఐదు మిల్లుల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు. కాగా, వరికోతలకు హాలిడే ప్రకటించగా, ధాన్యం తేమశాతం పడిపోయి తూకంలో తేడావచ్చి రాబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. హాలిడేకు బదులు మిల్లులన్నింటినీ నడిపిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని రైతులు పేర్కొంటున్నారు.

రైతులు సమన్వయంతో వ్యవహరించాలి : వెంకటేశ్వరరావు, మిర్యాలగూడ డీఎస్పీ

వరికోతలు, ధాన్యం విక్రయాలకు రైతులు సంయమనం పాటించాలి. ప్రధానంగా రాత్రివేళల్లో వరికోత పనులు నిర్వహించడంతో తేమశాతం అధికమైన ధాన్యం రంగుమారే ప్రమాదం ఉంది. అలాగే తాలు, పొల్లు బయటకు రాకుండా ధాన్యంలో కలిసి నాసిరకంగా మారడంతో మద్దతు ధర చెల్లించలేకపోతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకే వరికోతలు నిలిపివేయాలి. అధిక సంఖ్యలో మిల్లులను నడిపించి ధాన్యం దిగుమతుల్లో వేగం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

రైలు ర్యాకులు కేటాయించాలి : కె.రమేష్‌, మిల్లర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

ధాన్యం ఎక్కువ మొత్తంలో తరలివస్తుండడంతో మిల్లుల సామర్థ్యానికి మించి దిగుమతి చేసుకోవడం కష్టంగా ఉంది. కొన్ని మిల్లుల సైలోన్‌లో(యంత్రం) సీఎంఆర్‌ రైస్‌ నిల్వ ఉండడంతో ధాన్యం ఖరీదు చేయడం కష్టతరమవుతోంది. ఎఫ్‌సీఐ నుంచి ఐదు ర్యాక్‌లు పంపిస్తే సీఎంఆర్‌ రైస్‌ ఖాళీ అయ్యి ధాన్యం దిగుమతి సామర్ధ్యం పెరుగుతుంది. మిల్లర్లపై ఒత్తిడి తగ్గి రైతుల ధాన్యానికి మద్దతు ధర దక్కుతుంది.

కొనుగోలు చేయని మిల్లులను సీజ్‌చేయాలి : మల్లయ్యయాదవ్‌, రైతు సమన్వయసమితి నేత, వేములపల్లి

ప్రతి సీజన్‌లో రైతుల కష్టాన్ని దోచుకునేందుకు మిల్లర్లు రెడీ అవుతున్నారు. ధాన్యం దిగుబడులు వచ్చే సమయంలోనే మిల్లు మరమ్మతుకు వచ్చిందని, సైలోన్‌ నిండి ఉందన్న సాకులు చెప్పి కొనుగోళ్లకు దూరంగా ఉంటున్నారు. అసోసియేషన్‌లో పలుకుబడి  ఉన్న మిల్లర్లకు ప్రాధాన్యమిచ్చి వారు సరిపడా ధాన్యం సేకరించాక కొందరు మిల్లర్లు ఖరీదు మొదలు పెడుతున్నారు. సీజన్‌ తొలిదశలో ధాన్యం ఖరీదు చేయని మిల్లులను సీజ్‌చేస్తేనే వ్యవస్థ గాడిలో పడుతుంది.

Advertisement
Advertisement