మహిళా సంఘాలకు ఆర్థిక భరోసా

ABN , First Publish Date - 2021-06-04T04:53:40+05:30 IST

కరోనా వైరస్‌తో మహిళ స్వయం సంఘాల కుటుంబాల్లోని కొంతమంది కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురయ్యారు.

మహిళా సంఘాలకు ఆర్థిక భరోసా
పీపీసీ కేంద్రాల ధాన్యం కొనుగోలు(ఫైల్‌)

రెండేళ్ల ధాన్యం కమీషన్‌కు మోక్షం

కరోనా కష్టకాలంలో చేయూత

264 పీపీసీలకు రూ.4.45కోట్లు జమ

 ఖమ్మం సంక్షేమవిభాగం, జూన్‌3: కరోనా వైరస్‌తో మహిళ స్వయం సంఘాల కుటుంబాల్లోని కొంతమంది కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురయ్యారు. మరికొన్ని కుటుంబాల్లో కరోనా మృత్యుఘంటికలు  మోగాయి. లాక్‌డౌన్‌ కారణంగా కుటుంబ పోషణకు ఇబ్బందిగా మారింది. ఇలా ఇబ్బందులతో సతమతం అవుతున్న మహిళా స్వయం సంఘాలకు(ధాన్యం కొనుగోలు సంఘాలు) జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు ఆర్థిక చేయూత ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న ధాన్యం కొనుగోలు కమిషన్‌ను (ప్యాడి ప్రొక్యూర్‌ మెంట్‌ కేంద్రాలు)పీపీసీల బ్యాంకు ఖాతాలకు అధికారులు జమ చేశారు. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పీపీసీ కేంద్రాల కమిషన్‌ను బ్యాంకు ఖాతాలకు కరోనా కష్టకాలంలో జమ చేశారు. ఐదేళ్లుగా జిల్లాలోని పలు మహిళా స్వయం సంఘాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రెండేళ్లుగా ఆయా కొనుగొలు కేంద్రాలకు రావాల్సిన కమిషన్‌ బ్యాంకు ఖాతాలకు చేరలేదు. ఈ క్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి మెరుగు విద్యాచందన స్పందించారు. కలెక్టర్‌ కర్ణన్‌కు ధాన్యం కొనుగోల కమిషన్‌ విషయాలు తెలియజేశారు. పీపీసీ కేంద్రాలకు చేరాల్సిన రూ.4,45,60,152 బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. 

Updated Date - 2021-06-04T04:53:40+05:30 IST