పాక్‌ సైనికుడికి పద్మశ్రీ

ABN , First Publish Date - 2021-11-15T08:21:21+05:30 IST

ఖాజీ సజ్జాద్‌ అలీ జహీర్‌.. 50 ఏళ్లుగా పాకిస్థాన్‌ ప్రభుత్వం విధించిన మరణ శిక్ష అతని కోసం ఎదురు చూస్తోంది. 1970లలో పాక్‌ సైన్యంలో చేరిన సజ్జాద్‌..

పాక్‌ సైనికుడికి పద్మశ్రీ

న్యూఢిల్లీ, నవంబరు 14: ఖాజీ సజ్జాద్‌ అలీ జహీర్‌.. 50 ఏళ్లుగా పాకిస్థాన్‌ ప్రభుత్వం విధించిన మరణ శిక్ష అతని కోసం ఎదురు చూస్తోంది. 1970లలో పాక్‌ సైన్యంలో చేరిన సజ్జాద్‌.. 1971 యుద్ధంలో పాక్‌పై భారత్‌ ఘన విజయానికి.. బంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి కచ్చితంగా ఒక కారణం..! ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఈ ఏడాది పద్మశ్రీ అవార్డును ప్రకటించి సత్కరించింది.


20 ఏళ్ల వయసులో..

సజ్జాద్‌ తండ్రి అవిభాజ్య భారత్‌లో బ్రిటిష్‌ సైన్యంలో పనిచేశారు. భారత్‌-పాక్‌ విడిపోయిన తర్వాత.. సజ్జాద్‌ కూడా తన తండ్రిలాగా సైన్యాధికారి కావాలనే కోరికతో  పాక్‌ సైన్యంలో చేరారు. తూర్పు పాకిస్థాన్‌(ప్రస్తుతం బంగ్లాదేశ్‌)లో అరాచకాలను చూసి చలించిపోయారు. పాక్‌ ప్రభుత్వం తమ(తూర్పు పాకిస్థాన్‌) పాలిట కబ్రస్థాన్‌(శ్మశాన వాటిక)గా మారిందని లోలోన రగిలిపోయారు. దీంతో భారత్‌ పంచన చేరాలని నిర్ణయించుకున్నారు. అంతే.. పాక్‌ ఆర్మీ రహస్యాలు, మ్యాపులను తన బూట్లలో దాచుకుని, జమ్మూకశ్మీర్‌ సరిహద్దు నుంచి భారత్‌ వైపు పరుగులు తీశారు. దాన్ని గమనించిన పాక్‌ సైనికులు కాల్పులతో అనుసరించారు. పాక్‌ సైన్యం తమపై కాల్పులు జరుపుతోందని భావించిన భారత బలగాలు.. దీటుగా జవాబిచ్చాయి. ఈ క్రమంలో సజ్జాద్‌ ఓ వాగులోకి దూకి దానిగుండా భారత్‌లోకి ప్రవేశించారు. తాను వచ్చిన కారణాన్ని బీఎ్‌సఎఫ్‌ అధికారులకు వివరించారు. అయితే.. తొలుత అతణ్ని పాక్‌ గూఢచారిగా భావించిన అధికారులు.. ఆ తర్వాత ఢిల్లీకి పంపించారు.


ఢిల్లీలో పలు దఫాలుగా అతణ్ని విచారించిన అధికారులు.. చివరికి అతని నిజాయితీని విశ్వసించారు. ఆ తర్వాత జరిగిన భారత్‌-పాక్‌ యుద్ధం(1971)లో సజ్జాద్‌ ఇచ్చిన సమాచారం భారత సైన్యానికి ఎంతగానో ఉపయోగపడింది. తూర్పు పాకిస్థాన్‌ విడిపోయి.. బంగ్లాదేశ్‌ ఆవిర్భవించింది. బంగ్లా సైన్యంలో సజ్జాద్‌ లెఫ్టెనెంట్‌ కల్నల్‌గా సేవలు అందించారు. 


లొంగిపోకుంటే.. వారికి మరణమే: సజ్జాద్‌

సజ్జాద్‌ ఇటీవల రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా సజ్జాద్‌ ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ.. తనకు భారత్‌లో అత్యున్నత పురస్కారాన్ని తీసుకోవడం గర్వంగా ఉందని తెలిపారు. 1971 యుద్ధ సమయంలో 90 వేల మంది పాక్‌ సైనికులు లొంగిపోకపోతే.. వారంతా ముక్తివాహిని బలగాల చేతుల్లో మరణించి ఉండేవారని పేర్కొన్నారు. బంగ్లా విమోచనలో భారత్‌ సహకారం మరవలేనిదని సజ్జాద్‌ గుర్తుచేసుకున్నారు.

Updated Date - 2021-11-15T08:21:21+05:30 IST