పేదల డాక్టర్‌కు పద్మశ్రీ

ABN , First Publish Date - 2022-01-26T06:29:10+05:30 IST

నగరానికి చెందిన ప్రముఖ వైద్యుడు సుంకర వెంకట ఆదినారాయణరావు(83)కు పద్మశ్రీ పురస్కారం లభించింది.

పేదల డాక్టర్‌కు పద్మశ్రీ

సుంకర వెంకట ఆదినారాయణకు కేంద్రం అరుదైన గౌరవం

పోలియో ఆపరేషన్లతో అంతర్జాతీయ ఖ్యాతి


విశాఖపట్నం,  జనవరి 25 (ఆంధ్రజ్యోతి):


నగరానికి చెందిన ప్రముఖ వైద్యుడు సుంకర వెంకట ఆదినారాయణరావు(83)కు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటన చేసింది. పోలియో వ్యాధితో బాధపడే వ్యక్తుల పాలిట ఆత్మబంఽధువుగా పేరు సంపాదించుకున్న ఆదినారాయణ ఇప్పటివరకు మూడు లక్షలకుపైగా శస్త్ర చికిత్సలు చేశారు. దేశవ్యాప్తంగా ఆయన 989 వైద్య శిబిరాలు నిర్వహించారు.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఆదినారాయణ అక్కడే పాఠశాల, ఇంటర్‌ చదువు పూర్తిచేసి...1960లో ఆంధ్ర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌లో చేరారు. అనంతరం 1970లో ఎంఎస్‌ చేశారు. 


గురువు వ్యాఘ్యేశ్వరుడి స్ఫూర్తితో...

అప్పట్లో కేజీహెచ్‌లో ఎముకల వ్యాధి నిపుణుడు వ్యాఘ్రేశఽ్వరుడు పోలియో ఆపరేషన్లు చేయడంలో ఎంతో నైపుణ్యం సంపాదించారు. ఆయన వద్ద ఆదినారాయణ శిష్యుడిగా చేరారు. గురువు సూచనల మేరకు తొలిసారి 1978లో పాలకొల్లులో సత్యనారాయణమూర్తి అనే వైద్యుడి సహాయంతో తొమ్మిది మందికి ఆదినారాయణ పోలియో ఆపరేషన్లు నిర్వహించారు. ఆ తరువాత పుట్టపర్తిలో పోలియో క్యాంపు నిర్వహించినప్పుడు సత్యసాయిబాబా స్వయంగా  పరిశీలించి అభినందించారు. అదేరోజు సాయంత్రం భక్తులనుద్దేశించి సత్యసాయిబాబా మాట్లాడే సమయంలో పోలియో ఆపరేషన్ల గురించి చెప్పడంతో అక్కడున్న గుజరాత్‌కు చెందిన జైన్‌షా అనే భక్తుడు స్ఫూర్తిపొందారు. డాక్టర్‌ ఆదినారాయణను కలిసి గుజరాత్‌ రావాలని కోరడంతో అక్కడ క్యాంపు నిర్వహించి 220 మందికి ఆపరేషన్లు చేశారు. ఆ తరువాత దేశవ్యాప్తంగా వందల క్యాంపులు నిర్వహించి పెద్దఎత్తున ఆపరేషన్లు చేశారు. గుజరాల్‌ సీఎంలుగా పనిచేసిన శంకర్‌సింగ్‌ వాఘేలా, కేశుబాయ్‌పటేల్‌ వంటి వారు స్వయంగా క్యాంపులు ఏర్పాటుచేసి, ఆదినారాయణు ఆహ్వానించారు. గతంలో కేంద్ర మంత్రిగా వున్న మేనకాగాంధీ ఉత్తరప్రదేశ్‌లో క్యాంపు నిర్వహించారు. ఒకపక్క దేశంలో అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూనే డాక్టర్‌ ఆదినారాయణ విశాఖలో ప్రేమ ఆస్పత్రిని ప్రారంభించి పోలియో ఆపరేషన్లు నిర్వహిస్తూ వచ్చారు. కాగా విశాఖపట్నం నుంచి గతంలో డాక్టర్‌ కూటికుప్పల సూర్యరావు, డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌లు పద్మ అవార్డులు అందుకున్నారు. డాక్టర్‌ ఆదినారాయణ మూడోవారు.


చాలా ఆనందంగా ఉంది, యువతకు స్ఫూర్తినిస్తుంది

డాక్టర్‌ వెంకట ఆదినారాయణ

వైద్య రంగంలో సుదీర్ఘకాలంగా వున్న తనకు పద్మశ్రీ పురస్కారం రావడం చాలా ఆనందంగా వుందని డాక్టర్‌ సుంకర ఆదినారాయణ అన్నారు. మంగళవారం రాత్రి బీచ్‌రోడ్డులో గల ఆయన నివాసంలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడుతూ తనకు అవార్డు రావడం సంతోషంగా ఉందని, ఇది వైద్య రంగంలో అనేక రకాలుగా సేవలు అందిస్తున్న యువతకు స్ఫూర్తినిస్తుందన్నారు. తనకు వచ్చిన అవార్డును స్ఫూర్తిగా తీసుకుని వారంతా పోలియో, ఇతర వ్యాధులపై పోరు సాగించాలన్నారు. తనకు అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి, ఆదరించిన విశాఖ ప్రజలకు ఆయన కృతజ్ఞలు తెలిపారు. 1978లో పాలకొల్లులో తొలిసారిగా పోలియో ఆపరేషన్లు నిర్వహించానని, అయితే తరువాత మూడు లక్షల ఆపరేషన్లు చేస్తానని అనుకోలేదన్నారు. ఆపరేషన్లు నిర్వహణలో తనకు సాయపడిన భార్య శశిప్రభ, కుటుంబ సభ్యులు, ప్రేమ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఆపరేషన్లు చేసిన తరువాత ఫిజియో థెరపీ అనంతరం రోగులు నడుచుకుంటూ ఇళ్లకు వెళ్లడం జీవితంలో మరిచిపోలేనన్నారు.

Updated Date - 2022-01-26T06:29:10+05:30 IST