Abn logo
Jan 26 2021 @ 02:29AM

పద్మవిభూషణ్‌ బాలు

గాయని చిత్రకు పద్మ భూషణ్‌

పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం

మొత్తం ఐదుగురు తెలుగు వారికి పద్మాలు

తెలంగాణ నుంచి గుస్సాడీ నృత్య కళాకారుడు

కనక రాజుకు పద్మశ్రీ.. వందలాది మందికి శిక్షణ

ఏపీ నుంచి రామస్వామి, సుమతి, ప్రకాశ్‌రావుకు

ఎస్పీ బాలుకు తమిళనాడు కోటాలో పురస్కారం

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబెకు పద్మవిభూషణ్‌

పాసవాన్‌, కేశూభాయ్‌ పటేల్‌, తరుణ్‌గొగోయ్‌కు 

మరణానంతరం పద్మభూషణ్‌ ప్రకటించిన కేంద్రం

కూర్చున్న జాగాలో తిండి దొరికితే చాలు: కనకరాజు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

తెలుగు జాతి గర్వించదగ్గ గాన గంధర్వుడు, వివిధ భాషల్లో దాదాపు 40వేల పాటలు ఆలపించిన సంగీతకారుడు.. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యానికి దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారమైన పద్మవిభూషణ్‌ లభించింది. గానకోకిల చిత్రకు పద్మభూషణ్‌ లభించింది. 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. 2021కిగాను పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. విద్య, వైద్యం, సాహిత్యం, కళలు, సామాజిక సేవ.. ఇలా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 120 మంది ప్రముఖులకు 119  పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 120 మందిలో ఏడుగురికి పద్మవిభూషణ్‌.. పది మందికి పద్మభూషణ్‌, 103 మందికి పద్మశ్రీ ప్రకటించింది.


గుజరాత్‌కు చెందిన ఇద్దరు కళాకారులకు కలిపి ఒకటే పద్మశ్రీ పురస్కారం ప్రకటించినందున మొత్తం అవార్డులు 119 అయ్యాయి. కాగా, ఈ జాబితాలో మొత్తం 29 మంది మహిళలు కాగా.. 10 మంది విదేశీయులు/ప్రవాస భారతీయులు/భారత మూలాలున్న వ్యక్తులు/ఓవర్సీస్‌ సిటిజన్‌షి్‌ప ఆఫ్‌ ఇండియా (ఓసీఐ) కేటగిరీవారు. ఒకరు ట్రాన్స్‌జెండర్‌. బాలు, పాసవాన్‌ సహా 16 మందికి మరణానంతర పురస్కారాలు ప్రకటించారు. పద్మవిభూషణ్‌ పురస్కారాలు లభించిన వారిలో బాలుతోపాటు.. జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే, వైద్య రంగంలో సేవలందించిన బెల్లె మోనప్ప హెగ్డే, నరీందర్‌ సింగ్‌ కపనీ (మరణానంతరం), మౌలానా వహీదుద్దీన్‌ ఖాన్‌ (ఆధ్యాత్మికం), బీబీ లాల్‌ (ఆర్కియాలజీ), సుదర్శన్‌ సాహు (ఆర్ట్‌) ఉన్నారు. పద్మభూషణ్‌ లభించిన 10 మందిలో కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్‌, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత చంద్రశేఖర కంబార, అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్‌ (మరణానంతరం), కేంద్ర మాజీ మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ (మరణానంతరం), గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయి పటేల్‌ (మరణానంతరం), మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, ప్రధానమంత్రి కార్యాలయంలో గత ఏడాది వరకూ ప్రిన్సిపల్‌ కార్యదర్శిగా పనిచేసిన నృపేంద్ర మిశ్రా తదితరులు ఉన్నారు. 


తెలుగు పద్మాలు..

పద్మశ్రీ పురస్కారాలు లభించిన 103 మందిలో నలుగురు తెలుగువారున్నారు. వారిలో ఒకరు.. తెలంగాణకు చెందిన ప్రముఖ గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజు కాగా.. మిగతా ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వాయులీన విద్వాంసుడు అన్నవరపు రామస్వామి, మృదంగ కళాకారిణి నిడుమోలు సుమతీ రామమోహనరావు, అనంతపురానికి చెందిన సాహితీవేత్త, విద్యావేత్త ఆశావాది ప్రకాశ్‌రావు. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూరు మండలం మార్లవాయి గ్రామానికి చెందిన గుస్సాడీ కళాకారుడు కనకరాజు(81)కు ఆర్ట్స్‌ విభాగంలో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. మార్లవాయి గ్రామానికి చెందిన కనక రాజు 1940లో జన్మించారు. ఆయన చిన్నప్పటి నుంచి గుస్సాడీ నృత్యంపై మమకారం పెంచుకొని ఆ కళారూపం అంతరించి పోకుండా కాపాడడంలో కీలక పాత్ర పోషించారు.


ఆదివాసీల సంప్రదాయాలను ప్రతిబింబించే ఆ నృత్యాన్ని దివంగత ప్రధాని ఇందిరాగాంధీ సమక్షంలో మొట్టమొదటిసారి ప్రదర్శించారు. ఆ తర్వాత అబ్దుల్‌ కలాం రాష్ట్రపతిగా కొనసాగిన కాలంలో ఎర్రకోటలో జరిగిన గణతంత్ర వేడుకల్లో తన బృందంతో ప్రదర్శన చేసి ప్రపంచానికి ఆదివాసీల నృత్యాన్ని పరిచయం చేశారు. ఆదివాసీ సామాజిక వర్గం నుంచి ఐఏఎస్‌గా పనిచేసిన మడావి తుకారం గుస్సాడీ నృత్యం అంతరించిపోకుండా ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ శిబిరానికి కూడా రాజు ప్రత్యేక శిక్షకుడిగా వ్యవహరించారు. ఈయన శిక్షణలో వందలాది బృందాలు గుస్సాడీ నృత్యరూపకంపై మంచి నైపుణ్యాన్ని పెంపొందించుకున్నాయి. గుస్సాడీ రాజుగా సుపరిచితుడైన కనక రాజుకు థీంసా నృత్యంలోనూ ప్రావీణ్యం ఉంది. 

కూర్చున్న జాగలో తిండి దొరికితే చాలు...

నాకు చానా సంతోషమైతంది. నేను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అబ్దుల్‌ కలాం ముంగడ గుస్సాడీ నృత్యం చేసిన. అప్పుడు వాళ్లు కూడా అభినందించిన్రు. మా తరంతోని కళ ఆగిపోకూడదని, కొంతమందికి గుస్సాడీ నేర్పించినం. మా నాయన రాము వద్ద నేను నేర్చిన. మేమెవరం అవార్డుకు దరఖాస్తు చేయలె. కానీ మమ్మల్ని గుర్తించి, అవార్డు ఇస్తున్నందుకు ధన్యవాదాలు. నాకు బతికినంత కాలం కూర్చున్న జాగలోనే తిండిదొరికేట్టు చూడమని ప్రభుత్వాన్ని కోరుతున్నా.     

 కనక రాజు, గుస్సాడీ నృత్యకారుడు

Advertisement
Advertisement
Advertisement