టీకా వీరులకు పద్మ భూషణ్‌

ABN , First Publish Date - 2022-01-26T07:21:37+05:30 IST

ముఖ్య నేత గులామ్‌ నబీ ఆజాద్‌ (జమ్మూ కశ్మీర్‌), కమ్యూనిస్టు యోధుడు బుద్ధదేవ్‌ భట్టాచార్జీ (పశ్చిమ బెంగాల్‌) ఉండటం గమనార్హం. ...

టీకా వీరులకు పద్మ భూషణ్‌

కృష్ణా, సుచిత్రా ఎల్లా దంపతులకు 

ఉమ్మడిగా పురస్కారం

‘సీరం’ పూనావాలాకూ ప్రకటన

జనరల్‌ రావత్‌కు పద్మ విభూషణ్‌

ఆజాద్‌, బుద్ధదేవ్‌లకు పద్మ భూషణ్‌

సత్య నాదెళ్ల, సుందర్‌ పిచైలకూ..

128 మందికి ‘పద్మ’ అవార్డులు

10 మంది తెలుగు వారికి

మహా సహస్రావధాని

గరికపాటికి ‘పద్మశ్రీ’

జానపద గాయకుడు 

మొగులయ్య, డోలు వాయిద్య 

కారుడు రామచంద్రయ్య, 

నృత్యకళాకారిణి పద్మజారెడ్డికీ.. 

షావుకారు జానకికి 

తమిళనాడు కోటాలో ‘పద్మ’


ముఖ్య నేత గులామ్‌ నబీ ఆజాద్‌ (జమ్మూ కశ్మీర్‌), కమ్యూనిస్టు యోధుడు బుద్ధదేవ్‌ భట్టాచార్జీ (పశ్చిమ బెంగాల్‌) ఉండటం గమనార్హం.


తెలుగు ‘పద్మా’లు ఇవే..

ఈసారి 10 మంది తెలుగు వారికి పద్మ అవార్డులు లభించాయి. కృష్ణా ఎల్లా, సుచిత్రా ఎల్లా దంపతులతోపాటు మహా సహస్రావధాని-ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు... విలక్షణమైన  ‘12 మెట్ల కిన్నెర’ జానపద గాయకుడు మొగులయ్య, ప్రముఖ నాదస్వర విద్వాంసుడు గోసవీడు షేక్‌ హసన్‌ (మరణానంతరం),  డోలు వాయిద్యకారుడు రామచంద్రయ్య, హైదరాబాద్‌కు చెందిన  ప్రముఖ కూచిపూడి నృత్యకళాకారిణి పద్మజా రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ సుంకర వెంకట ఆదినారాయణ రావులకు పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు. కృష్ణా ఎల్లా, సుచిత్రా ఎల్లా దంపతులు, దర్శనం మొగులయ్య, రామచంద్రయ్య, పద్మాజా రెడ్డిలకు తెలంగాణ నుంచి... గరికపాటి, షేక్‌ హసన్‌, సుంకర వెంకట ఆదినారాయణ రావులను ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎంపిక చేశారు. తెలుగు వాడైన సత్య నాదెళ్ల అమెరికా పౌరుడిగానే ‘పద్మ భూషణ్‌’ అందుకోనున్నారు.


మన వి‘దేశీ’ ప్రముఖులకు..

మైక్రోసాఫ్ట్‌ అధిపతి సత్య నాదేళ్లపాటు మరో ఐటీ దిగ్గజమైన గూగుల్‌ సారథి సుందర్‌ పిచైకి కూడా ‘పద్మభూషణ్‌’ లభించింది. అమెరికాలో స్థిరపడిన భారతీయ పాక శాస్త్ర నిపుణుడు మాథుర్‌ జఫెరీని కూడా ‘పద్మ భూషణ్‌’ వరించింది. మెక్సికోకు చెందిన ప్రవాస భారతీయుడు సంజయ్‌ రాజారాం (సైన్స్‌, ఇంజనీరింగ్‌)కు మరణానంతరం ‘పద్మభూషణ్‌’ ప్రకటించింది. ఇంకా.. విదేశీ ప్రముఖులు మేరియా క్రిస్టఫర్‌ బైర్‌స్కి (పోలాండ్‌), ర్యైకో హిరా (జపాన్‌), రుట్జర్‌ కోర్టెన్‌హార్స్ట్‌ (ఐర్లాండ్‌)లను ‘పద్మశ్రీ’కి ఎంపిక చేసింది. మార్చి లేదా ఏప్రిల్‌లో రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాలను అందజేస్తారు. 


సీజేఐ శుభాకాంక్షలు

’పద్మ’ పురస్కారాలకు ఎంపికైన తెలుగు తేజాలకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ శుభాకాంక్షలు తెలిపారు. పద్మభూషణ్‌ అవార్డు అందుకోనున్న కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా, సత్య నాదెండ్ల, పద్మశ్రీకి ఎంపికైన గరికపాటి నరసింహారావు, దర్శనం మొగిలయ్య, డాక్టర్‌ సుంకర వెంకట ఆదినారాయణరావు, రామచంద్రయ్య, పద్మజారెడ్డి స్వర్గీయ గోసవీడు షేక్‌ హసన్‌లకు పద్మ అవార్డులు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాగా, ఈసారి 12 మందికి మరణానంతరం ‘పద్మ’ అవార్డులు ప్రకటించారు. కృష్ణా ఎల్లా దంపతులకు పద్మ విభూషణ్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన నర్తకీమణులు కమలిని ఆస్థానా, నళిని ఆస్థానాలకు ఉమ్మడిగా ‘పద్మశ్రీ’ లభించింది.  తమిళనాడుకు చెందిన 14 మందికి ‘పద్మ’ అవార్డులు వచ్చాయి. 


ఆరుగురు జవాన్లకు శౌర్యచక్ర

సైన్యంలో ఆరు అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన శౌర్యచక్రకు కేంద్ర ప్రభుత్వం ఆరుగురు జవాన్లను ఎంపిక చేసింది. ఐదుగురికి మరణానంతరం అవార్డు దక్కనుంది. అవార్డుకు ఎంపికైన వారి వివరాలు..


మరుప్రోలు జస్వంత్‌ కుమార్‌ రెడ్డి

గత ఏడాది జూలై 8న జమ్మూకశ్మీర్‌లోని రాజౌరిలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో జస్వంత్‌ అమరుడయ్యారు. ఈయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని గుం టూరు జిల్లా బాపట్ల మండలం ధరివాడ కొత్తపాలెం. ఆరేళ్లుగా మద్రాస్‌ రెజిమెంట్‌ 17వ బెటాలియన్‌లో సేవలందించిన జస్వంత్‌.. తన సోదరి వివాహానికి కూడా హాజరుకాకుండా సరిహద్దు భద్రతలో నిమగ్నమయ్యారు. ఆ తర్వాత నెలరోజులకే అమరుడయ్యారు.


శ్రీజిత్‌

మద్రాస్‌ రెజిమెంట్‌ 17వ బెటాలియన్‌కు చెందిన శ్రీజిత్‌ కూడా జస్వంత్‌తో పాటు కార్డాన్‌ అండ్‌ సెర్చ్‌లో పాల్గొన్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో అమరుడయ్యారు. ఈయన నాయిబ్‌ సుబేదార్‌గా సేవలందించారు.


అనిల్‌కుమార్‌ తోమర్‌

సైన్యంలోని రాజ్‌పూత్‌ రెజిమెంట్‌/44 రాష్ట్రీయ రైఫిల్స్‌ విభాగానికి చెందిన అనిల్‌, 2020 డిసెంబరులో కశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో అమరుడయ్యారు. ఈయన సైన్యంలో హవల్దార్‌గా సేవలందించారు. ఉగ్రవాదుల ఏరివేతలో ప్రత్యేక కోంబాట్‌ టీమ్‌కు నేతృత్వం వహించేవారు.


కాశీరే బమ్మనల్లి

రాష్ట్రీయ రైఫిల్స్‌ 44వ బెటాలియన్‌కు చెందిన కాశీరే.. సైన్యంలో ఇంజనీరుగా సేవలందించారు. గత ఏడాది జూలై 1న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందారు.


పింకూకుమార్‌

సైన్యంలోని జాట్‌ రెజిమెంట్‌/రాష్ట్రీయ  రైఫిల్స్‌ 34వ బెటాలియన్‌కు చెందిన పింకూ గత ఏడాది మార్చి 27న కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. మూడో ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో తలభాగంలో బుల్లెట్‌ దూసుకుపోవడంతో అసువులుబాసారు.


రాకేశ్‌ శర్మ

అసోం రైఫిల్స్‌ 5వ బెటాలియన్‌కు చెందిన రాకేశ్‌ గత ఏడాది మే నెలలో మిలిటెంట్లు జరిపిన గెరిల్లా దాడిలో.. తోటివారిని చాకచక్యంగా కాపాడారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి, తనతోపాటు, తోటి సిబ్బందిని రక్షించారు. ఆయన సాహసాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. శౌర్య పతకాన్ని ప్రకటించింది.



నేను తీసుకోను!

‘పద్మ భూషణ్‌’ పురస్కారాన్ని సీపీఎం అగ్రనేత బుద్ధదేవ్‌ భట్టాచార్జీ తిరస్కరించారు. ‘‘నాకు ఈ అవార్డు ఇస్తున్నట్లు ఎవరూ చెప్పలేదు. ముందే చెప్పి ఉంటే వద్దనే  వాడిని’’ అని బుద్ధదేవ్‌ చెప్పారు. బుద్ధదేవ్‌కు పద్మ విభూషణ్‌ అవార్డు ప్రకటించాలనే నిర్ణయాన్ని ఆయన సతీమణికి ముందే చెప్పామని అధికార వర్గాలు తెలిపాయి. బెంగాల్‌కే చెందిన గాయని సంధ్యా ముఖోపాధ్యాయ్‌కి ‘పద్మశ్రీ’ ప్రకటించాలని భావించినా ఆమె నిరాకరించారు. 


భారతీయతే.. మన వేడుక!

 73వ గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో రాష్ట్రపతి కోవింద్‌

న్యూఢిల్లీ, జనవరి 25: రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ దేశ ప్రజలకు గణతం త్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ పర్వదినం సందర్భంగా మనమంతా ‘భారతీయత’ను వేడుకలా జరుపుకోవాలన్నారు. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. భారతీయత చాలా గొప్పదన్నారు. కరోనాపై పోరులో మనం ఎంతో సమర్థంగా పనిచేశామన్నారు. జాతి ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని, మహానీయుల బాటలో నడవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, దేశ రాజధానిలో బుధవారం జరగనున్న 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు వస్తున్నాయి. ఈ వేడుకలే లక్ష్యంగా ఉగ్రమూకలు దాడులకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు నిఘూ వర్గాలకు సమాచారం అందింది. జమ్మూలోని సాంబా జిల్లా వద్ద రెండు వేర్వేరు ఉగ్రవాద బృందాలు దాడికి సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. ఉగ్రవాదులను అడ్డుకునేందుకు భారత బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. మరోపక్క, గణతంత్ర దినోత్సవ పరేడ్‌ కోసం న్యూఢిల్లీలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 


Updated Date - 2022-01-26T07:21:37+05:30 IST