Abn logo
Aug 2 2020 @ 00:30AM

పద్మాలయా తొలి మల్టీస్టారర్‌

మహానటుడు ఎన్టీఆర్‌, సూపర్‌స్టార్‌ కృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో చిత్రం ‘దేవుడు చేసిన మనుషులు’. పద్మాలయా పిక్చర్స్‌ బేనరుపై  రూపుదిద్దుకొన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, కృష్ణ, ఎస్వీ రంగారావు, జగ్గయ్య, కాంతారావు, సత్యనారాయణ, జయలలిత, విజయనిర్మల, కాంచన వంటి ప్రముఖ తారలు నటించడంతో మల్టీస్టారర్‌ చిత్రాలకు నిజమైన నిర్వచనంలా నిలిచింది. పద్మాలయా సంస్థ నిర్మించిన తొలి మల్టీస్టారర్‌ మూవీ ఇది. విగ్రహాల దొంగ రవాణా, విమానం హైజాకింగ్‌ వంటి క్రైమ్‌ అంశాలను ఫ్యామిలీ డ్రామాతో ముడిపెట్టి జనరంజకంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు దర్శకుడు 

వి.రామచంద్రరావు.


ఎన్టీఆర్‌ హఠాత్తుగా ఈ సినిమాకు డేట్స్‌ ఇవ్వడంతో  ఆ సమయానికి  హీరో కృష్ణ డేట్స్‌ ఖాళీగా లేవు. వేరే నిర్మాతలకు కాల్షీట్లు ఇచ్చేయ్యడంతో ఆయన డేట్స్‌ అడ్జె్‌స్టమెంట్‌ కష్టమైంది. ఆ రోజుల్లో చెన్నైలో పవర్‌ ప్రాబ్లమ్‌ ఉండేది. ఇప్పటిలా ఆ రోజుల్లో జనరేటర్స్‌ ఉండేవి కావు. విద్యుత్‌ మీదే ఆధారపడి స్టూడియోల్లో షూటింగ్స్‌ జరిగేవి. బెంగళూరులో కరెంట్‌ సమస్య లేదని తెలుసుకొని అక్కడే ‘దేవుడు చేసిన మనుషులు’ షూటింగ్‌ చేశారు. 1973 మార్చి 17న చాముండేశ్వరి స్టూడియోలో షూటింగ్‌ ప్రారంభించారు. ప్రతిరోజూ ఏడు గంటలకు సెట్‌లో మేక్‌పతో అడుగుపెట్టేవారు ఎన్టీఆర్‌. తొమ్మిది గంటల వరకూ ఆయనతో షూటింగ్‌లో పాల్గొని, ఆ తర్వాత ఫ్లెయిట్‌లో చెన్నై వెళ్లేవారు కృష్ణ. సాయంత్రం వరకూ అక్కడ షూటింగ్‌లో పాల్గొని మళ్లీ రాత్రి బెంగళూరుకు చేరుకొనేవారు. డేట్స్‌ లేవు కనుక ఇలా అడ్జె్‌స్టమెంట్స్‌తో కృష్ణ ఆ సినిమా పూర్తి చేశారు. ‘దేవుడు చేసిన మనుషులు’ షూటింగ్‌ 40 రోజుల పాటు బెంగళూరులో జరిగితే దాదాపు అన్ని రోజులూ అక్కడే ఉన్నారు ఎన్టీఆర్‌. ఆయన కోసం అశోకా హోటల్‌లో రెండు సూట్లు బుక్‌ చేశారు. తన అభిమాన నటుడితో తొలిసారిగా సినిమా తీస్తుండడంతో ఆయన గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొన్నారు కృష్ణ.


ఇందులో ఎన్టీఆర్‌ పక్కన మొదట హీరోయిన్‌గా జమునను అనుకొన్నారు. అయితే ఆవిడ  డేట్స్‌ అడ్జెస్ట్‌ కాలేదు. అందుకే జయలలితను తీసుకొన్నారు.అయితే ‘ ఇంత పెద్ద సినిమాలో నేను లేకపోతే బాగోదు’ అని  ఫీలయి, ‘తొలిసారి నిన్ను చూశాను నేను’ పాటలోని ఓ బిట్‌లో కృష్ణతో పాటు పాల్గొన్నారు జమున. ఆ సమయంలోనే కృష్ణ సరసన  ‘మాయదారి మల్లిగాడు’ చిత్రంలో నటిస్తున్న మంజుల కూడా ఈ పాటలో కనిపిస్తారు.  అలాగే నాగభూషణం కాల్షీట్లు దొరకకపోతే సత్యనారాయణని బుక్‌ చేసి, ఆయనతో కామెడీ వేషం వేయించారు. అది ఆయన కెరీర్‌కు బాగా ప్లస్‌ అయింది. ఇలా ఎవరు ఖాళీగా దొరికితే వాళ్లని బుక్‌ చేశారు. ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా చిన్న వేషానికి కూడా పెద్ద తారలనే తీసుకున్నారు.


సినిమాలోని పతాక సన్నివేశాలను మచిలీపట్నంలో తీయాలని చిత్ర నిర్మాతల్లో ఒకరైన హనుమంతరావు ప్లాన్‌ చేశారు. కానీ ఔట్‌డోర్‌లో వర్క్‌ చేయడానికి ఎన్టీఆర్‌ అంతగా ఇష్టపడేవారు కాదు. అందుకే హనుమంతరావు అడగగానే రెండు రోజులు ఆలోచించి, తర్వాత అంగీకారం తెలిపారు ఎన్టీఆర్‌. పక్కనే ఉన్న నిమ్మకూరులోని సొంత ఇంట్లో ఉంటూ మచిలీపట్నం  వచ్చి షూటింగ్‌లో పాల్గొనేవారు ఎన్టీఆర్‌. దాదాపు 15 రోజుల పాటు అక్కడ షూటింగ్‌ జరిగింది.


రూ 18 లక్షల రూపాయల వ్యయంతో 50 రోజుల్లో  ‘దేవుడు చేసిన మనుషులు’  చిత్రం  పూర్తయింది. 1973 ఆగస్టు 9న విడుదలైన ఈ చిత్రం  ఘన విజయం సాధించింది.


Advertisement
Advertisement
Advertisement