తెలుగు వెలుగులకు పద్మాలు

ABN , First Publish Date - 2022-01-26T08:53:52+05:30 IST

ఐదో యేటలోనే కూచిపూడి నాట్యంలో ఓనమాలు నేర్చుకొన్న ఆమెకు ఆ నాట్యకళతో ఐదు దశాబ్దాల అనుబంధం ఉంది. కూచిపూడిలో ఎన్నో రకాల ప్రయోగాలు చేసి నాట్యకళకు వన్నెతెచ్చారు. ఆమే ప్రముఖ నర్తకి పద్మజారెడ్డి! ఏపీలోని కష్ణా జిల్లా పాముర్రులో పుట్టారు. ప్రముఖ నర్తకీమణి..

తెలుగు వెలుగులకు పద్మాలు

పద్మజారెడ్డి: కూచిపూడిలో ఘనకీర్తి! 


రవీంద్రభారతి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ఐదో యేటలోనే కూచిపూడి నాట్యంలో ఓనమాలు నేర్చుకొన్న ఆమెకు ఆ నాట్యకళతో ఐదు దశాబ్దాల అనుబంధం ఉంది. కూచిపూడిలో ఎన్నో రకాల ప్రయోగాలు చేసి నాట్యకళకు వన్నెతెచ్చారు. ఆమే ప్రముఖ నర్తకి పద్మజారెడ్డి! ఏపీలోని కష్ణా జిల్లా పాముర్రులో పుట్టారు. ప్రముఖ నర్తకీమణి శోభానాయుడు వద్ద శిక్షణ పొందారు. దేశ, విదేశాల్లో అనేక ప్రదర్శనలిచ్చారు. శివహేల, భ్రూణ హత్యలు, కళ్యాణ శ్రీనివాస చరితం, అన్నమయ్య పద నర్తన శోభ, శ్రీకష్ణపారిజాతం, రాధే శ్రీకష్ణామత్‌, వజ్రభారతి, సీతాస్వయంవరం, సీజన్‌ ఆఫ్‌ ఫ్లవర్స్‌, నమస్తే ఇండియా, రామాయం వంటి ఇతివత్తంగా తీసుకుని కూచిపూడి నత్యప్రదర్శనలిచ్చారు. కూచిపూడి, భరతనాట్యం శైలిలో కాకతీయం పేరిట ప్రయోగాత్మకంగా నత్యరూపకాన్ని ప్రదర్శించారు. పదేళ్ల క్రితం పరిశోధన ప్రారంభించిన ఆమె సరికొత్త శాస్త్రీయ నత్యరూపకాన్ని ప్రేక్షకుల ముందు ప్రదర్శించారు. నాట్య రంగంలో విశేష ప్రతిభకు గాను ఆమెకు  1994లో నాట్య విశారద,  2015లో సంగీత నాటక అకాడమీ పురస్కారాలు దక్కాయి. 2006లో నాటి సీఎం వైఎస్‌ చేతుల మీదుగా కళారత్న అవార్డు, అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా ఏఎన్‌ఆర్‌ గోల్డ్‌మెడల్‌లు అందుకున్నారు. 2005లో శ్రీకష్ణదేవరాయ వర్సిటీ నుంచి డాక్టరేట్‌ అందుకున్నారు. ఆమెకు హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. నగరంలోని ప్రధాన వేదికలు రవీంద్రభారతి, శిల్పకళావేదిక, భారతీయ విద్యాభవన్‌, తెలుగు వర్సిటీ ఆడిటోరియం వంటి వేదికపై అనేక ప్రదర్శనలిచ్చారు.  


మొగిలయ్య: కిన్నెరకు వన్నె! 

సైదాబాద్‌, జనవరి25(ఆంధ్రజ్యోతి): అవాసంగా చిన్న రేకుల ఇల్లు.. అందులో 10 మంది కుటుంబసభ్యులతో తను! పూట గడిచేందుకూ తిప్పలు.. భార్య చనిపోతే దహన సంస్కారానికీ ఇబ్బందులు! ఇన్ని సమస్యలను ఎదుర్కొంటూ అతికష్టమ్మీద తనింటిని ఆయన ఎలా నెట్టుకొస్తున్నారు? 500  ఏళ్ల నాటి అత్యంత అరుదైన కిన్నెర వాయిద్య పరిజ్ఞానాన్ని నమ్ముకొనే! ఇప్పుడదే ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది! ఆయనే దర్శనం మొగిలయ్య! స్వస్థలం నాగర్‌ కర్నూల్‌ జిల్లా లింగాల మండలం అవుసలకుంట. గ్రామంలో బతుకుదెరువు కష్టమవడంతో ఎనిమిదేళ్ల క్రితం ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లతో కలిసి హైదరాబాద్‌కు వచ్చారాయన సింగరేణి కాలనీ గుడిసెల్లో ఓ చిన్న గదిని అద్దెకు తీసుకున్నారు. తాత, ముత్తాల నాటి నుంచి వంశపారంపర్యంగా కొనసాగిస్తున్న  12 మెట్ల కిన్నెర వాయిద్య కళనే మొగిలయ్య నమ్ముకున్నారు. ఊరూరా ప్రదర్శనలిస్తూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. రెండేళ్ల క్రితం  భార్య శంకరమ్మ మృతి చెందగా దహనసంస్కారాలు చేసుకోలేని పరిస్థితితో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండో కుమారుడు నరాల సంబంధిత వ్యాధితో ఇంటికే పరిమితమయ్యారు. అయితే.. కిన్నెర వాయిద్య కళలో పరిజ్ఞానంతో ఆలస్యంగానైనా మొగులయ్యకు గుర్తింపునిచ్చింది.  ఏడేళ్ల క్రితం కొల్లాపూర్‌ నియోజకవర్గం పెద్దమడూరుకు చెందిన డాక్టర్‌ రంగయ్య పీహెచ్‌డీ కోర్సులో భాగంగా మొగిలయ్య జీవితచరిత్రను ప్రచురించారు.  ఫలితంగా అంతరించిపోతున్న కిన్నెర వాయిద్య కళను కాపాడుతున్న ఆయన్ను ప్రభుత్వం గుర్తించింది. ఉగాది పురస్కారంతో సన్మానించింది. అంతేనా.. ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రంలో మొగిలయ్య జీవిత గమనాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. ఇక పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న భీమ్లా నాయక్‌ సినిమాలో టైటిల్‌ సాంగ్‌ను మొగలయ్యతో పాడించారు.  ఈ పాటలో  కిన్నెర వాయిద్యం పుట్టు పూర్వోత్తరాలు చెబుతూ మొగులయ్య ప్రోమోలో కనిపించారు. దీంతో  మొగిలయ్య పేరు తెలుగురాష్ర్టాలలో  ఒక్కసారిగా  మారుమోగింది.  ఆయనకు పవన్‌ కల్యాణ్‌ రూ.2లక్షల సాయాన్ని అందజేశారు. ఎనిమిదేళ్ల వయసులోనే కిన్నెర వాయిద్య సాధనను మొగిలయ్య మొదలు పెట్టారు. ఆయన వయసు 68 ఏళ్లు. అలా.. ఈ వాయిద్య పరికరంతో ఆయనది 60 ఏళ్ల అనుబంధం! 


కృష్ణా, సుచిత్ర: టీకా ప్రదాతలు

కొవిడ్‌ వ్యాక్సిన్ల అభివృద్ధి గురించి వరుస ప్రకటనలు చేస్తున్న అమెరికా, బ్రిటన్‌ల వైపు యావత్‌ ప్రపంచం చూస్తున్న తరుణంలో.. నేనుసైతం అంటూ భారత్‌ గర్జించింది. కరోనాపై కదనానికి ఓ అస్త్రాన్ని సంధించింది. ఆ అచ్చమైన స్వదేశీ అస్త్రమే కొవ్యాక్సిన్‌. అతి తక్కువ కాల వ్యవధిలో దాన్ని తయారుచేసిన హైదరాబాదీ కంపెనీ ‘భారత్‌ బయోటెక్‌’.  ఈ ఆవిష్కరణకు గుర్తింపుగానే భారత్‌ బయోటెక్‌ సారథులైన డాక్టర్‌ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాలను దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో మూడోదైన పద్మభూషణ్‌ వరించింది.  వృత్తిరీత్యా వైద్యుడైన డాక్టర్‌ కృష్ణ ఎల్లా తన భార్య సుచిత్రతో కలిసి అమెరికా నుంచి తిరిగివచ్చి 1996 సంవత్సరంలో హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ను స్థాపించారు. ఈ కంపెనీ హెపటైటి్‌స-బి, రొటా వైరస్‌, టైఫాయిడ్‌ వంటి ప్రాణాంతక వ్యాధులతో పాటు... చికున్‌గున్యా, జైకా వంటి వైరల్‌ వ్యాధులకు కూడా టీకాలు కనుగొంది. 123కుపైగా దేశాల ప్రజలను వ్యాధుల బారి నుంచి కాపాడి ఆరోగ్యవంతంగా జీవనం సాగించగల శక్తిని అందించింది. కంపెనీ ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలకు 300కోట్లకుపైగా వ్యాక్సిన్‌ డోసులు సరఫరా చేసింది. ఇటీవలే పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్‌ను భారత్‌ బయోటెక్‌ కనుగొంది.


రామచంద్రయ్య: కోయ స్వర ఝరి! 

కొత్తగూడెం/మణుగూరు, జనవరి 25: ఆయన నిరక్షరాస్యుడు! అయితేనేం.. ఆదివాసీ యోధులపై ఆయన గొంతెత్తితే ఆశువుగా కథ వస్తోంది. ఆయన డోలు వాయిస్తే అంతకుమించి వీనులకు విందుగా ఉంటుంది!  ఆ డోలు వాయిద్యానికి పద్మశ్రీ పురస్కారమే ఆయన వద్దకు కదిలివచ్చింది. ఆయనే 65 ఏళ్ల సకిని రామచంద్రయ్య.  స్వస్థలం కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం. కోయతెగలోని డోలి ఉపకులానికి చెందినవారాయన. తన మాతృభాషలో కులాచారపు గీతాలు పాడుతూ తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్త్తున్నారు. తెలుగురాష్ట్రాల్లో కోయ తెగల వంశ చరిత్రలను పారాయణం చేసే వారిలో బహుషా రామచంద్రయ్యే చివరి వ్యక్తి అని అంటారు. సమక్క సారక్క చరిత్ర, గరికామారాజు, పగిడిద్దరాజు, ఈరామరాజు, గాడిరాజు, బాపనమ్మ, ముసలమ్మ, నాగులమ్మ, సదలమ్మ తదితర ఆదివాసీ యోధుల కథలను ఆశువుగా గానం చేయడంలో ఆయన దిట్ట. డోలు వాయిస్తూ  దైవకార్యాలు, జాతరలు, ఆదివాసీ పండుగలు, వివాహాదిశుభకార్యాల్లో డోలు వాయిస్తారు. మేడారం సమ్మక్క సారక్క జాతరలో రామచంద్రయ్య వాయిద్య నైపుణ్యమే కిక్కు. జాతర జరిగే ప్రతీసారి ఆయనకు ప్రత్యేక ఆహ్వానం ఉంటుంది. ఆ వనదేవతలకు ఆయన డోలు వాయిద్యం మధ్య పూజలు చేస్తారు. రామచంద్రయ్య.. తన ముత్తాత, తాత, తండ్రుల నుంచి సంక్రమించిన గిరిజన సంప్రదాయ కళను నేర్చుకుని దానినే జీవనాధారంగా మలుచుకున్నారు.  


షేక్‌ హసన్‌: నాద స్వరానికి నీరాజనం

భద్రాచలం, విజయవాడ కల్చరల్‌, జనవరి 25: ‘కౌసల్య సుప్రజా రామా’ అంటూ నిత్యం భద్రాద్రి రామయ్య సన్నిధిలో నాదస్వర సుప్రభాత వాద్యంతో సేవలందించారు ఆయన... దేవస్థానం తొలి నాదస్వర ఆ స్థాన విద్వాంసుడిగా సేవలందించిన ప్రముఖ నాదస్వర విద్వాంసులు షేక్‌ హసన్‌ సాహెబ్‌కు మరణాంతరం కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. కృష్ణాజిల్లా గంపలగూడెం మండలం గోసవీడు గ్రామంలో 1930లో ఆయన జన్మించారు. చిలకలూరిపేట చిన మౌలా సాహెబ్‌ వద్ద సంగీత శిక్షణ పొందారు. భద్రాచలంతోపాటు యాదగిరి గుట్ట దేవస్థానంలోనూ నిలయ విద్వాంసుడిగా పని చేశారు. ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రంలో అనేక కచేరీలు చేశారు. త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలలో నాదస్వరాన్ని వినిపించారు. ఆయనను 1962లో స్వర్ణ కంకణంతో సన్మానం, 2007లో త్యాగరాజ పురస్కారం అందుకున్నారు. 1950లో భద్రాద్రి దేవస్థానం తొలి నాదస్వర విద్వాంసులుగా బాధ్యతలు చేపట్టి 1996 వరకు పని చేశారు. గతేడాది జూన్‌ 23న 93ఏళ్ల వయసులో అనారోగ్యంతో స్వగ్రామంలో కన్నుమూశారు. ఆయన జీవించి ఉన్నప్పుడు  అవార్డు ఇచ్చి ఉంటే మరింత బాగుండేదని ఆయన చిన్న కుమారుడు, భద్రాద్రి దేవస్థానం నాదస్వర బృంద సభ్యుడు షేక్‌ ఖాసీంబాబు పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-26T08:53:52+05:30 IST