కరోనా బాధితులకు భరోసా.. పద్మావతి నిలయం

ABN , First Publish Date - 2020-09-18T16:49:48+05:30 IST

ఉదయం ఆరింటికే గదికి వేడి వేడి కషాయం వస్తుంది. మరో గంటకంతా..

కరోనా బాధితులకు భరోసా.. పద్మావతి నిలయం

మిగిలిన కేంద్రాల తీరుపై విమర్శలు


తిరుపతి(ఆంధ్రజ్యోతి): ఉదయం ఆరింటికే గదికి వేడి వేడి కషాయం వస్తుంది. మరో గంటకంతా కాఫీ రెడీ. ఇంకో గంట లోపలే టిఫిన్‌. ఇడ్లీ, వడతో పాటూ పొంగలి లేదా ఉప్మా,  పదింటికంతా పండ్ల కవర్‌, జామ, చీనీ, అరటి..తిన్నన్ని. మధ్యాహ్నం భోజనంతో పాటూ కోడిగుడ్డు, చపాతీ. సాయంత్రం టీతో పాటూ సున్నుండ సుండల్‌ లేదా ఇంకేవైనా స్నాక్స్‌,. రాత్రి భోజనంలో మళ్ళీ  కోడిగుడ్డు, చపాతీ. పడక ఎక్కేముందు పసుపు, మిరియాలు వేసిన పాలు.. తిరుపతి పద్మావతి నిలయం కొవిడ్‌ కేంద్రంలోని కరోనా బాధితులకు రోజూ అందుతున్న అత్యంత ఆరోగ్యకరమైన ఆహార పట్టిక ఇది. రోజుకోసారి వైద్య పరీక్షలు, ఉదయం,సాయంత్రం యోగ శిక్షణ కూడా ఇక్కడ ఉంటాయి.


గాలీ వెలుతురు ఉండే పరిశుభ్రమైన గదులు, నడకకు వీలున్న కారిడార్లు. ఏ వేళ అయినా పిలిస్తే పలికే సిబ్బంది. రాష్ట్రంలోనే మంచి సేవలందిస్తున్న కొవిడ్‌ కేంద్రంగా పద్మావతి నిలయం పేరు తెచ్చుకుంది. నాలుగు డార్మెటరీలతో కలిపి 936 పడకలున్న పద్మావతి నిలయంలో రోజూ సగటున 150 మంది డిశ్చార్జి అవుతూ, అడ్మిట్‌ అవుతూ ఉంటారు. ఇంత మంది బాధితులున్నా ప్రశంసనీయమైన సేవలందిస్తున్న పద్మావతి నిలయం రాష్ట్రంలోనే కొవిడ్‌ కేంద్రాలకు ఆదర్శంగా నిలిచింది. అయితే అన్ని కొవిడ్‌ కేంద్రాలూ ఈ రకమైన సేవలనే అందిస్తున్నాయా? బాధితులు సంతృప్తి చెందుతున్నారా? తిరుపతిలోని కొవిడ్‌ కేంద్రాల సేవలపై ఆంధ్రజ్యోతి పరిశీలనలో వెల్లడైన అంశాలు ఇవి...


మాధవంలో ఒకే  బెడ్‌పై ఇద్దరు

500 పడకలున్న మాధవంలో వైద్యుల కోసం కొంత కేటాయించారు. ఇక్కడి సేవలకూ, ఇతర బాధితులకు అందించే సేవలకూ తేడా ఉంటుందనే విమర్శలున్నాయి. ఒకే బెడ్‌ను ఇద్దరు బాధితులకు ఇక్కడ కేటాయిస్తున్నారు. అపరిచితులైన వేరు వేరు వ్యక్తులు, అందులోనూ భిన్న స్థాయిల్లో వైరస్‌ ఉండే అవకాశం ఉన్నవారు ఒకే బెడ్‌ మీద ఎలా పడుకోగలరో అర్థం కాదు.  


శ్రీనివాసం- అన్యాయం

తరచూ విమర్శలకు గురవుతున్న కొవిడ్‌ కేంద్రం ఇది. 1,200 పడకలున్న ఈ కేంద్రంలో పారిశుధ్య నిర్వహణ మీద, భోజన నాణ్యత మీద బాధితులు అసంతృప్తి వ్యక్తం చేశాక కొంత మెరుగైంది. అయినా పద్మావతి నిలయంతో పోల్చదగిన నాణ్యత కాదు. బాధితుల కుటుంబ సభ్యులు సంచులతో శ్రీనివాసం చుట్టూ నిలబడి ఉంటారు. ఎనిమిది గేట్లున్న ఈ ప్రాంగణంలోకి ఎవరు వస్తున్నారో, ఎవరు పోతున్నారో అర్థం కాదు. ఇక్కడ ఉండే బాధితులు కొందరు మద్యం సైతం తెప్పించుకుని తాగుతున్నా రనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒంటరి మహిళల మీద లైంగిక వేధింపుల ఆరోపణలనూ ఈ కేంద్రం ఎదుర్కొంటోంది. 


ముఖ్యమంత్రి జిల్లా వారికే నిర్లక్ష్య వైద్యం

తిరుపతిలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిని దాదాపుగా కడప జిల్లా వారికే కేటాయించారు. అక్కడున్న కాల్‌ సెంటర్‌ నెంబరు- 08772242501. దీనికి కాల్‌చేస్తే ఈ నెంబర్‌ ఎవరు ఇచ్చారనే ప్రశ్న మొదట వినిపిస్తుంది. ఎవరు ఫోన్‌ చేసినా ఎత్తరు. ల్యాండ్‌ నెంబరుగా కనిపిస్తున్నా.. సెల్‌లో ఈ నెంబరును వాడుతున్నారు. కడప జిల్లా నుంచి ఇద్దరు ఏవోలు ఫోన్‌ చేసి పేషెంట్లను పంపుతున్నట్టు సమాచారం ఇస్తుంటారు. సీఎం జిల్లా వారిని చేర్చుకుంటున్నా ఇక్కడ తిండి తప్ప మరేదీ సక్రమంగా అందటం లేదనే విమర్శ ఉంది. రోజుకోసారి వైద్యులు వచ్చినా తగిన సూచనలు ఇవ్వడం లేదని బాధితులు వాపోతుంటారు. 


అన్నీ..అంతే!

పద్మావతి నిలయం మినహా మిగిలిన అన్ని కేంద్రాల్లో నిర్వహణ తీరు మీద విమర్శలున్నాయి. మెనూ అన్ని చోట్లా ఒక్కటే అయినా విష్ణునివాసం, శ్రీనివాసం, మాధవం, గోవిందరాజస్వామి సత్రాలు, ఈఎస్‌ఐ ఆస్పత్రిలోని కొవిడ్‌ కేంద్రాల్లో భోజనాల నాణ్యత మీద అసంతృప్తి ఉంది. నిజానికి అన్ని కేంద్రాలకూ అవసరమైన దినుసులను టీటీడీ అందిస్తోంది. ఎక్కడికక్కడ కాంట్రాక్టర్లకు భోజనం వండి పెట్టే బాధ్యతలు అప్పగించారు. పద్మావతి నిలయం నిర్వహణ విషయంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో నాణ్యతకు తిరుగు లేకుండా ఉంది. మిగిలిన కేంద్రాల్లో పర్యవేక్షణ  సరిగా లేదనే విమర్శలున్నాయి. నిజానికి ప్రభుత్వం కేటాయించే నిధులు నిర్వహణకు సరిపోకపోతే, దాతల సహకారంతో మెరుగైన సేవలను ఈ కేంద్రాల్లో అందించే అవకాశం ఉంది. కాకపోతే చొరవ చేసే నాయకులు లేకపోవడమే లోపం. 


పద్మావతి వాట్సాప్‌ 

పద్మావతి నిలయంలోకి అడుగు పెట్టగానే బాధితులకు  అప్పటి దాకా పేరుకుని ఉన్న ఆందోళన మాయమవుతుంది. పద్మావతి నిలయం కోసం ప్రత్యేకంగా పెట్టుకున్న వాట్సాప్‌ గ్రూప్‌లో బాధితుల  నెంబర్లు యాడ్‌ చేస్తారు. ఏ వేళకాడ, ఏ సమస్య గురించి వాట్సాప్‌లో పోస్ట్‌ చేసినా వెంటనే స్పందిస్తారు. టాయ్‌లెట్ల నిర్వహణ, ఆహారం, కరెంటు సమస్య వంటివి ఏవి ఉన్నా ఏ నెంబరుకు ఫోన్‌ చేయాలో ప్రతి గదిలో ఉంటుంది. ఈ ఏర్పాటు వల్ల బాధితులకు కొండంత భరోసా లభిస్తోంది.


ఆదుకుంటున్న ఆక్సిజన్‌ జోన్లు

కొవిడ్‌ సమన్వయ కమిటీ సూచనతో తిరుపతిలోని కొవిడ్‌ కేంద్రాల్లో ఆక్సిజన్‌ జోన్లు ఏర్పాటు చేయడం బాధితులకు బాగా ఉపయోగపడుతోంది. ఆక్సిజన్‌ లెవల్‌ తగ్గగానే అంతకుముందు ఆందోళనపడి రుయాకో, స్విమ్స్‌కో పరుగులు తీయాల్సి వచ్చేది.  ప్రస్తుతం పద్మావతి నిలయంలో ఆక్సిజన్‌ జోన్‌లో 10 పడకలు, శ్రీనివాసంలో 5, విష్ణునివాసంలో 10, మాధవంలో 5 పడకలు ఏర్పాటు చేశారు. ఇవి అత్యవసర సమయంలో ఆదుకుంటున్నాయి. 


కొన్ని సూచనలు

- కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో ఉన్న బాధితులు ఎవరికైనా ఆయాసంగా ఉంటే సీటీ స్కాన్‌ కోసం అంబులెన్స్‌లో బయటకు తరలించాల్సి వస్తోంది. పద్మావతినిలయంలోనూ, శ్రీనివాసంలోనూ సీటీ స్కాన్‌ ఏర్పాటు చేస్తే మంచిది.

- కొవిడ్‌ కేంద్రం నుంచి స్విమ్స్‌కి కానీ, రుయాకి కానీ రెఫర్‌ చేసి తరలించినపుడు అక్కడ బాధితులు గంట నుంచి రెండు గంటలపాటూ ఎదురు చూడాల్సి ఉంటోంది. ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలి.

- పద్మావతి నిలయంలో లాగే అన్ని కేంద్రాల్లోనూ వాట్సాప్‌ గ్రూప్‌లు ఏర్పాటు చేస్తే బాధితులు తమ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. 

- శ్రీనివాసంలో తగిన భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. బాధితులెవరో, బంధువులెవరో తెలియని గందరగోళం కనిపిస్తోంది. బయట నుంచి వచ్చిపోయే సంచుల వల్ల వైరస్‌ వ్యాప్తి పెరుగుతుంది. దీనిని నియంత్రించాలి. ఇక్కడ పోలీస్‌ అవుట్‌పోస్ట్‌ అవసరం.

- పద్మావతి నిలయంలో బాధితుల కోసం కటుంబ సభ్యులు ఏమైనా తెచ్చి ఇస్తే తీసుకోవడానికి రిసెప్షన్‌ కేంద్రం ఉన్న పద్ధతిలోనే శ్రీనివాసం, మాధవం, విష్ణునివాసం కేంద్రాలోనూ ఏర్పాటు చేయడం అవసరం.

Updated Date - 2020-09-18T16:49:48+05:30 IST