ధాన్యం కొనుగోలుకు సిద్ధం

ABN , First Publish Date - 2021-04-20T05:45:35+05:30 IST

మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. దీంతో ధాన్యం కొనుగోలుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈసారి వరి సాగు విస్తీర్ణం పెరగడంతో భారీగా ధాన్యం దిగుబడి పెరుగుతుందని అంచనా వేశారు. దీనికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పలుచోట్ల ఇప్పటికే కేంద్రాలను ప్రారంభించారు. ఐదు రోజుల్లో కొనుగోళ్లు కూడా మొదలు కానున్నాయని అధికారులు తెలుపుతున్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో గ్రామాల్లోనే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం సేకరిస్తామని అధికారులు పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోలుకు సిద్ధం

ఇప్పటికే ప్రారంభమైన కొనుగోలు కేంద్రాలు 

దశల వారీగా అన్ని చోట్ల కేంద్రాల ఏర్పాటు

ఈసారి పెరగనున్న ధాన్యం దిగుబడి

కరోనా ఉధృతి దృష్ట్యా  రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు


మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. దీంతో ధాన్యం కొనుగోలుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈసారి వరి సాగు విస్తీర్ణం పెరగడంతో భారీగా ధాన్యం దిగుబడి పెరుగుతుందని అంచనా వేశారు. దీనికి  అనుగుణంగా కొనుగోలు  కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పలుచోట్ల ఇప్పటికే కేంద్రాలను ప్రారంభించారు. ఐదు రోజుల్లో కొనుగోళ్లు కూడా మొదలు కానున్నాయని అధికారులు  తెలుపుతున్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో గ్రామాల్లోనే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా  ధాన్యం సేకరిస్తామని అధికారులు పేర్కొన్నారు.


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, ఏప్రిల్‌ 19 : మెదక్‌ జిల్లాలో ధాన్యం సేకరణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. చాలా గ్రామాల్లో వరి కోతలు మొదలయ్యాయి. కల్లాల దగ్గర రైతులు ధాన్యాన్ని శుద్ధి చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన చోట ధాన్యం కొనుగోలు ఇంకా ప్రారంభించలేదు. ఆదివారం నుంచి ధాన్యం సేకరణను మొదలుపెట్టనున్నారు. పూర్తిస్థాయిలో కొనుగోళ్లు ప్రారంభిస్తే పెద్దఎత్తున కేంద్రాల వద్దకు ధాన్యం వచ్చే అవకాశం ఉంది. 

ఈ యాసంగిలో వరి సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. గతేడాది 1.98 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఈ ఏడాది 2.12 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఈ సీజన్‌లో వెయ్యి కోట్ల విలువ చేసే వరి ధాన్యాన్ని సేకరిస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు నీటి లభ్యత ఎక్కువగా ఉండటమే సాగు విస్తీర్ణం పెరగడానికి కారణం. ఇప్పటికే వరి కోతలు పూర్తి చేసిన రైతులు ధాన్యాన్ని మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధంగా ఉన్నారు.


మెదక్‌ జిల్లాలో 4.75 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణ

యాసంగి సీజన్‌లో 4.75 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దిగుబడులు పెరగడంతో పెద్దమొత్తంలో మార్కెట్‌కు ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా 350 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ప్రారంభించింది 110 కేంద్రాలు మాత్రమే. పీఏసీఎ్‌సల ద్వారా 236, ఐకేపీ ద్వారా 110, ఏఎంసీ ద్వారా 4 కొనుగోలు కేంద్రాలను ఏర్పాట్లు చేసేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. కానీ అన్ని చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇప్పటివరకు ప్రారంభించలేదు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కేంద్రాల ద్వారా కొనుగోళ్లు ప్రారంభించాల్సి ఉంది. చాల గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను తరలించేందుకు ధాన్యం సిద్ధంగా ఉంది. 


అవసరమైన ఏర్పాట్లు పూర్తి

ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్నారు అధికారులు. మెదక్‌ జిల్లాలో 415 ప్యాడీ క్లీనర్లు, 430 తూకం మెషీన్లను అందుబాటులో ఉంచుతున్నారు. అవపరమైన టార్పలిన్లను సిద్ధం చేశారు. 1.25 లక్షల గన్నీ సంచులు అవసరమవుతాయని గుర్తించారు. ఇప్పటికే 60 లక్షల సంచుల సేకరణను పూర్తి చేశారు. ధాన్యం తెచ్చే రైతులు చెత్తా లేకుండా తీసుకురావాలని అధికారులు కోరుతున్నారు. ధాన్యం అమ్మిన 72 గంటల్లోనే ఆ రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేయటం జరుగుతుందన్నారు. 


కొవిడ్‌ జాగ్రత్తలతో కొనుగోళ్లు

కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొని వచ్చే రైతులు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, శానిటైజర్‌ వాడే విధంగా చూడాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రైతులు ఇబ్బందులు పడకుండా ఆయా గ్రామాల పరిధిలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరిస్తామని తెలిపారు.


దశల వారీగా కేంద్రాలను ప్రారంభిస్తాం

మెదక్‌ జిల్లాలో ఇప్పటి వరకు వందకుపైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాం. ఆదివారం నుంచి ధాన్యం సేకరణను కూడా మొదలు పెడతాం. దశల వారీగా పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. కొన్ని చోట్ల పంట ఆలస్యంగా సాగు చేశారు. ఇలాంటి ప్రాంతాల్లో ఇంకా కోతలు మొదలు కాలేదు. రైతులందరి దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం.

- శ్రీనివాస్‌, పౌరసరఫరాల శాఖ అధికారి, మెదక్‌ జిల్లా


సిద్దిపేట జిల్లాలో రూ.1600 కోట్ల విలువైన ధాన్యం

సిద్దిపేట అగ్రికల్చర్‌, ఏప్రిల్‌ 19 : సిద్దిపేట జిల్లా చరిత్రలో  మునుపెన్నడూ లేనివిధంగా ఈ యాసంగిలో సుమారు రూ.1600 కోట్ల విలువైన వరి పంట రానున్నదని అంచనా. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతుల పంటపొలాలకు సాగు జలాలు రావడంతో రికార్డుస్థాయిలో 2.56 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారు. ఈ ఏడాది 5.46 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో దాదాపు అన్ని గ్రామాల్లో 396 ధాన్యం కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఐకేపీ ద్వారా 217, పీఏసీఎస్‌ ద్వారా 168, ఏఎంసీ ద్వారా 7, మెప్మా ద్వారా 4 కేంద్రాలను ప్రారంభించనున్నారు. ఇప్పటికే జిల్లాలో వరి కోతలు ప్రారంభం కావడంతో 90 కేంద్రాలు మొదలయ్యాయి. ఈ ధాన్యం సేకరణకు 1.36 కోట్ల గోనె సంచులు బ్యాగులు అవసరం ఉండగా 53.52 లక్షల గోనే సంచులు అందుబాటులో ఉన్నాయి. మిగతా బ్యాగులను త్వరలోనే కేంద్రాలకు అందించనున్నారు. 641 ప్యాడీ క్లీనర్లు, 565 తేమశాతం లెక్కించే మెషీన్లు, 10,430 టార్పాలిన్‌ కవర్లు అందుబాటులో ఉన్నాయి. 


మద్దతు ధర ఇలా..

ప్రభుత్వం ఏటా పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేస్తుండగా యాసంగి కాలంలో ఏ గ్రేడ్‌ ధాన్యం క్వింటాలుకు రూ.1,888, బీ గ్రేడ్‌ ధాన్యం క్వింటాలుకు రూ.1,868 చెల్లించాలని నిర్ణయించారు. 


ఆన్‌లైన్‌ద్వారానే రైతుల వివరాలు

కొనుగోలు కేంద్రాల్లో రైతుల వివరాలన్ని ఆన్‌లైన్‌లో పొందు పరచనున్నారు. కేంద్రానికి తీసుకొచ్చిన రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయగానే  వారి వివరాలను ట్యాబ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో పొందు పరచనున్నారు. అనంతరం 72 గంటల్లో రైతులకు డబ్బు వారి ఖాతాల్లో నేరుగా జమ కానున్నాయి. రైతులు కొనుగోలు కేంద్రాలకు బ్యాంక్‌ ఖాతా, ఆధార్‌కార్డు, పట్టాదార్‌ పాస్‌ పుస్తకం జిరాక్స్‌తో పాటు ఏఈవో ధ్రువీకరణపత్రాన్ని తీసుకురావాలని అధికారులు తెలిపారు.


సిద్దిపేట జిల్లాలో 396 కేంద్రాలు

రైతులకు ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నాం. జిల్లాలో 396 కొనుగోలు కేంద్రాలను చేస్తున్నాం. 5.46 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని దీనికి అనుగుణంగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్‌ కవర్స్‌, వెయిట్‌ మెషీన్లు  అందుబాటులో ఉన్నాయి.

- హరీశ్‌, పౌరసరఫరాల శాఖ అధికారి, సిద్దిపేట జిల్లా


Updated Date - 2021-04-20T05:45:35+05:30 IST