అడ్డంగా పాగా..!

ABN , First Publish Date - 2021-05-11T05:58:25+05:30 IST

నగరంలోని ఆంధ్రప్రదేశ పాడిపరిశ్రమ సహకార సంస్థ ఆధ్వర్యంలోని డెయిరీలో ఒక ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌ పాగా వేశాడు.

అడ్డంగా పాగా..!
ఏపీ డెయిరీలో గ్రిల్స్‌వేసి, సరుకును నిల్వచేసిన దృశ్యం

ఏపీ డెయిరీని ఆక్రమించిన కాంట్రాక్టర్‌

అధికారిక అనుమతులు శూన్యం

అనుమతి ఇవ్వలేదన్న డెయిరీ డీడీ

డైరెక్టర్‌ చెప్పారంటున్న కాంట్రాక్టర్‌...ఉత్తర్వులు శూన్యం

అనంతపురం అర్బన, మే 10: నగరంలోని ఆంధ్రప్రదేశ పాడిపరిశ్రమ సహకార సంస్థ ఆధ్వర్యంలోని డెయిరీలో ఒక ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌ పాగా వేశాడు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకున్నా తన కార్యకలాపాలను యథేచ్చగా కొనసాగిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.కోట్ల విలువచేసే డెయిరీ ఆవరణలో కాంట్రాక్టర్‌ ప్రత్యేక గ్రిల్స్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. సిబ్బందికి అక్కడే వసతి కల్పించి, రోజువారీ పనులను కొనసాగిస్తున్నాడు. ఇతర రాష్ట్రం నుంచి సరుకును దిగుమతి చేసుకుని, జిల్లావ్యాప్తంగా సరఫరా చేసుకుంటున్నాడు. అనుమతిలేని కార్యకలాపాల విషయంపై డెయిరీ డీడీ శశాంకధరను వివరణ కోరగా.. తాము అనుమతి ఇవ్వలేదని తేల్చిచెబుతున్నారు. పాడిపరిశ్రమ సహకార సంస్థకు చెందిన కార్యాలయాన్ని, ఆస్తులను పరిరక్షిస్తున్న డీడీకి తెలియకుండా ఒక ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌ అక్రమంగా చొరబడి, ఏకంగా గ్రిల్స్‌ను ఏర్పాటుచేసుకుని పాగా వేసుకున్నాడంటే అక్కడి పర్యవేక్షణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎవరి అనుమతితో కార్యకలాపాలు కొనసాస్తున్నారని పాడిరైతులు.. కాంట్రాక్టర్‌ను ప్రశ్నిస్తే.. అమరావతిలోని డైరెక్టర్‌ చెప్పారని సెలవిసున్నాడు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ చేయకపోవడం విశేషం. జిల్లా పరిపాలనాధికారులకు తెలియకుండా ఆ కాంట్రాక్టర్‌పై డైరెక్టర్‌ ఎందుకంత ప్రేమ ఒలకబోస్తున్నాడో అర్థంకావడంలేదని పాడిరైతులు చర్చించుకుంటున్నారు. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.


Updated Date - 2021-05-11T05:58:25+05:30 IST