Sep 29 2021 @ 01:35AM

పైడి జైరాజ్‌ జీవితం నేటితరాలకు స్ఫూర్తి

‘‘పైడి జైరాజ్‌ తెలంగాణ వ్యక్తి, నటుడు. అప్పట్లో సినిమాల్లో రాణించాలని అందరూ మద్రాసు వెళితే, ఆయన ముంబై వెళ్లారు. హిందీ చిత్రసీమలో హీరోగా ఎదిగారు. ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకోవడం తెలుగువారికి గర్వకారణం. ఆయన జీవితం నేటితరాలకు స్ఫూర్తి’’ అని తెలంగాణ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. తొలితరం హిందీ హీరోల్లో పైడి జైరాజ్‌ ఒకరు. మంగళవారం ఆయన జయంతి. ఫిల్మ్‌ఛాంబర్‌లో నటుడు జైహింద్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో జైరాజ్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. ‘‘మూకీ యుగంలో జైరాజ్‌ హీరోగా ఎదిగారు. తెలుగు పరిశ్రమ ఆయన గురించి మర్చిపోయిందని, ఆయన జయంతి వేడుకలు నిర్వహించడం లేదని తెలిసి 2010 నుంచి నేనే నిర్వహిస్తున్నా. ఫిల్మ్‌ఛాంబర్‌ లేదా ఫిల్మ్‌నగర్‌లో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని మంత్రిగారికి విన్నవిస్తున్నా’’ అన్నారు జైహింద్‌ గౌడ్‌. ‘‘జైరాజ్‌ జ్ఞాపకార్థం ఆయన పేరు మీద రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వం ఓ హాలును ఏర్పాటు చేసింది. ఫిల్మ్‌నగర్‌ లేదా ఛాంబర్‌లో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది’’ అని శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో ‘దెయ్యాలున్నాయా?’ చిత్రదర్శకుడు శ్రీనివా్‌సరెడ్డి, నాయిక ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.