సిరిమాను పండుగకు వేళాయె

ABN , First Publish Date - 2020-10-25T10:38:28+05:30 IST

పైడితల్లమ్మ సిరిమానోత్సవానికి సమయం సమీపిస్తోంది. ఏర్పాట్లలో వేగం పుంజుకుంది.. ఉత్సవానికి సన్నద్ధమవుతూనే మరోవైపు..

సిరిమాను పండుగకు వేళాయె

రేపే తొలేళ్లు

ఊపందుకున్న ఏర్పాట్లు 

అధికారులతో కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ సమీక్ష 

ఇద్దరు ప్రత్యేకాధికారుల నియామకం 


విజయనగరం రూరల్‌, అక్టోబరు 24: పైడితల్లమ్మ సిరిమానోత్సవానికి సమయం సమీపిస్తోంది. ఏర్పాట్లలో వేగం  పుంజుకుంది.. ఉత్సవానికి సన్నద్ధమవుతూనే మరోవైపు కరోనా విజృంభించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు దృష్టి సారించారు. విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నెల 27న జిల్లా కేంద్రంలో పూర్తిగా లాక్‌డౌన్‌ని అమలు చేసేందుకు నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే విస్తృత ప్రచారం చేశారు.


సిరిమానోత్సవం రోజున ఉదయం మాత్రమే భక్తుల దర్శనానికి పాస్‌లను జారీ చేశారు. సిరిమానోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ శనివారం అమ్మవారి దేవస్థానం అధికారులతో పాటు, పోలీసు, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు. అంతకముందు ఆయన హుకుంపేటలోని సిరిమాను తయారు చేసే ప్రాంతానికి వెళ్లారు. పూజారి బంటుపల్లి వెంకటరావుతోనూ మాట్లాడారు. తోలేళ్లు, సిరిమానోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని... అదే క్రమంలో కరోనా నిబంధనలు ప్రతి భక్తుడు పాటించే విధంగా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సకాలంలో సిరిమాను తిరిగేందుకు సహకరించాలన్నారు. ఉత్సవ నిర్వహణకు ఇద్దరు ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది.  


పట్టువస్త్రాలను సమర్పించనున్న మంత్రి బొత్స

పైడిమాంబ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన నేపథ్యంలో ప్రభుత్వం తరపున మంత్రి బొత్స సత్యనారాయణ అమ్మవారికి పట్టువస్త్రాలను అందజేస్తారు. సిరిమానోత్సవం రోజున ఉదయం అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్‌, పాముల పుష్పశ్రీవాణి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావుతో పాటు ఉత్తరాంధ్రలోని ఎంపీలు, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమ్మవారిని దర్శించుకోనున్నారు. 

Updated Date - 2020-10-25T10:38:28+05:30 IST