‘పంచాయతీ’ల్లో పైసల్లేవ్‌..

ABN , First Publish Date - 2022-09-29T05:47:42+05:30 IST

బతుకమ్మ, దసరా పండుగలు సర్పంచులకు దడ పుట్టిస్తున్నాయి. పండుగలు సమీపిస్తున్నా కొద్దీ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

‘పంచాయతీ’ల్లో పైసల్లేవ్‌..

 - బతుకమ్మ, దసరా పండుగకు ఏర్పాట్లు చేసేదెలా

- నిధుల లేమితో సతమతమవుతున్న సర్పంచ్‌లు 

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 28: బతుకమ్మ, దసరా పండుగలు సర్పంచులకు దడ పుట్టిస్తున్నాయి. పండుగలు సమీపిస్తున్నా కొద్దీ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో 313 గ్రామపంచాయతీలు ఉండగా 20 శాతం గ్రామపంచాయతీల్లో కొద్దొగొప్పో నిధులు ఉండగా, మిగిలిన పంచాయతీల్లో కనీసం పండుగలకు ఏర్పాట్లు చేసేందుకు కూడా డబ్బులు లేక పోవడంతో పండుగలు ఎలా గడుస్తాయో తెలియడం లేదంటూ పలువురు సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

- ఉద్యోగులు, కార్మికులకు నిలిచిన జీతాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల్లోని జనాభా ఆధారంగా గ్రామపంచాయతీలకు ఇచ్చే స్పెషల్‌ ఫండ్‌ కూడా రెండు నెలలుగా ఇవ్వలేదు. పంచాయతీల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు కూడా ఆగస్టు జీతాలు ఇంకా చెల్లించలేదు. 14, 15వ ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి విద్యుత్‌ చార్జీలు, ట్రాక్టర్ల ఈఎంఐలకు మాత్రమే చెల్లింపులు చేసి మిగిలిన బిల్లులను  ప్రభుత్వం మంజూరు చేయడం లేదు. దీంతో పంచాయతీల ఆర్థికపరిస్థితి అధ్వానంగా మారింది. పల్లెలు ప్రగతికి పట్టుకొమ్మలంటూ చెబుతున్న ప్రభుత్వాలు కనీసం పండుగల సందర్భంలో కూడా ప్రత్యేక నిధులు ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు. రఅత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండుగలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చిల్లిగవ్వ ఇవ్వడం లేదు. దీంతో గ్రామాల్లో పండుగల ఏర్పాట్లు సర్పంచులు, ప్రజాప్రతినిధులకే కాకుండా అధికారులకు సవాల్‌గా మారుతోంది. మేజర్‌ గ్రామపంచాయతీల్లో విద్యుత్‌ చార్జీలు, ట్రాక్టర్‌ ఈఎంఐ చెల్లింపులు పోగా మిగిలిన కొద్దోగొప్పొ నిధులతో పండుగ ఏర్పాట్లకు వీలుపడుతోంది. మైనర్‌ పంచాయతీల్లో పన్నుల ద్వారా పెద్దగా ఆదాయం రాకపోవడం, ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తక్కువగా ఇవ్వడం, అవి కూడా రెండు నెలల నుంచి మంజూరు చేయక పోవడంతో సర్పంచ్‌లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  గతంలో గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు సకాలంలో ఇవ్వడం లేదు. ఇప్పుడు పండుగలకు  అప్పులను ఎక్కడ నుంచి తేవాలంటూ పలువురు సర్పంచులు వాపోతున్నారు. కొంత మంది సర్పంచులు ఈ పరిస్థితి ఇలాగే ఉంటే అప్పుల ఉబిలో కూరుకుపోక తప్పదని, పదవులకు రాజీనామా చేసి ఏదైనా ఇతర పనులు వెతుక్కుంటామని చెబుతున్నారు. ఓవైపు ఆర్థిక చెల్లింపులపై అప్రకటిత ఆంక్షలు... మరోవైపు నిధులను కేటాయించక పోవడంతో ‘పంచాయతీ’ల్లో పండుగలు ప్రజాప్రతినిధులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక చెల్లింపులపై ఆంక్షలను తొలగించి బిల్లులన్నిటిని చెల్లించాలని, పండుగ సందర్భంలో ప్రత్యేక నిధులు కేటాయించాలని సర్పంచులు కోరుతున్నారు. 

- అప్పులు చేసి ఏర్పాట్లు చేస్తే బిల్లులు ఇవ్వడం లేదు..

- ఉప్పుల అంజనీప్రసాద్‌, సర్పంచుల సంఘం రాష్ట్ర  గౌరవ అధ్యక్షుడు

రాష్ట్రవ్యాప్తంగా అనేక గ్రామపంచాయతీల్లో పైసలు లేవు. మౌలిక వసతులు కూడా కల్పించలేని దుస్థితి ఉంది. పండుగలు వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పండుగలను ఘనంగా నిర్వహిస్తామని గొప్పలు చెప్పడమే కానీ గ్రామపంచాయతీలకు ప్రత్యేక నిధులు ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండుగలకు కూడా నిధులు లేవు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు. విద్యుద్దీపాలు ఏర్పాటు చేయడం, పారిశుధ్య పనులు చేయడం, దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయడం, మైదానాలను, నిమజ్జన పాయింట్లలో ఏర్పాట్లు చేయడం కోసం చాలా మంది సర్పంచులు అప్పులు చేసి డబ్బులు తెచ్చి ఖర్చు చేస్తున్నారు. వీటిని కూడా సకాలంలో ఇవ్వడం లేదు. 

Updated Date - 2022-09-29T05:47:42+05:30 IST