పాక్‌ విన్యాసాలు!

ABN , First Publish Date - 2021-01-19T09:49:18+05:30 IST

లష్కరే తోయిబా సహా మరో అరడజను విదేశీ ఉగ్రవాద సంస్థల ‘హోదా’ను సవరించవద్దని అమెరికా తీసుకున్న నిర్ణయం పాకిస్థాన్‌కు...

పాక్‌ విన్యాసాలు!

లష్కరే తోయిబా సహా మరో అరడజను విదేశీ ఉగ్రవాద సంస్థల ‘హోదా’ను సవరించవద్దని అమెరికా తీసుకున్న నిర్ణయం పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ. వచ్చేనెల ఫైనాన్షియల్‌ యాక్షన్ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) సమావేశం ఉండటంతో, అమెరికా తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. మొన్నటికి మొన్న లష్కరే తోయిబా ఆపరేషన్స్‌ చీఫ్‌ జకీవుర్‌ రహ్మాన్‌ లఖ్వీకి పదిహేనేళ్ళ జైలు శిక్ష వేసిన ఘట్టం కూడా అమెరికాని ప్రభావితం చేయలేకపోయింది. ఉగ్రవాదులకు నిధులు సమకూరకుండా నిలువరించడంలో పాకిస్థాన్‌ విఫలం చెందిందని ఎఫ్‌ఏటీఎఫ్‌ ఆ దేశాన్ని మూడేళ్ళుగా గ్రే లిస్టులోనే ఉంచింది. మూడునెలల క్రితం జరిపిన సమీక్షలో, పాకిస్థాన్‌ తన హామీలు నెరవేర్చని పక్షంలో బ్లాక్‌లిస్టులోకి పోకతప్పదని ఆ సంస్థ అధ్యక్షుడు తీవ్రంగా హెచ్చరించారు కూడా. తన నడవడికను నిరూపించుకోవాల్సిన గడువు సమీపిస్తున్న నేపథ్యంలో, పాకిస్థాన్‌ ఇలా ఉగ్రవాదులపై విరుచుకుపడుతున్నట్టు కనిపిస్తున్నది.


ఉగ్రవాదులకు ఆర్థికంగా తోడ్పడుతున్నాడన్న ఆరోపణపైన, ఒక్కముక్కలో చెప్పాలంటే ఎఫ్‌ఏటీఎఫ్‌ ఏమి కోరుతున్నదో దానికి అనుగుణంగా లఖ్వీ మీద అభియోగాలు నమోదుకావడం, ఉగ్రవాద కోర్టు శిక్ష వేయడం జరిగాయి. అరెస్టుతో పాటు, వారంలోనే శిక్షలు ఖరారు కావడం కూడా అమితాశ్చర్యం కలిగించే విషయం. ఈ ముంబై దాడుల రూపశిల్పిని అమెరికా, ఐక్యరాజ్యసమితి కూడా పేరొందిన ఉగ్రవాదిగా గుర్తించాయి. భారత్‌నుంచి, అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవడంతో రావల్పిండి జైలులో ఆరేళ్ళు ఉండి బయటకు వచ్చాడు. ఇక, జైషే మహ్మద్‌ అధినేత మసూద్‌ అజర్‌ను కూడా ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిపెడుతున్న అభియోగంమీదే అరెస్టు చేయాలని పాక్‌ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు పంజాబ్‌ పోలీసులను అదేశించిన విషయం తెలిసిందే. అరెస్టువారెంటుకు అనుగుణంగా అతడిని అదుపులోకి తీసుకోని పక్షంలో నేరస్థుడిగా ప్రకటించడానికి అవసరమైన చర్యలు ఆరంభిస్తానని కూడా న్యాయమూర్తి హెచ్చరించారు. అయితే, వీరిద్దరిపైనా పాకిస్థాన్‌ ప్రభుత్వం ఉగ్రవాద ఘటనలకు బాధ్యులుగా కేసులు నమోదు చేయని విషయాన్ని గుర్తించాలి. 


పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు రాజభోగాలు అనుభవిస్తున్నారనీ, ప్రభుత్వమే వారికి భద్రత కల్పిస్తూ ఫైవ్‌స్టార్‌ ట్రీట్‌మెంట్‌ సమకూర్చిపెడుతున్నదని ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో భారత విదేశాంగమంత్రి ఇటీవల విమర్శించారు. మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా ఎంపికైన తరువాత తొలిసారిగా చేసిన ప్రసంగంలో జైశంకర్‌ పాకిస్థాన్‌ను తీవ్రంగా తప్పుబట్టారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించే విషయంలో ద్వంద్వప్రమాణాలకు తావులేదని పాకిస్థాన్‌ మిత్రదేశాలకు సూచించారు. భద్రతామండలిలో భారత్‌ బాధకు ప్రాధాన్యం ఇవ్వనప్పటికీ, మరిన్ని ఆర్థిక కష్టాల్లోకి జారిపోకుండా ఉండటానికి పాకిస్థాన్‌ ఉగ్రవాదంపై పోరులో తన సచ్ఛీలతను ఎంతోకొంత రుజువుచేసుకోవలసి వస్తున్నది. లఖ్వీ, మసూద్‌ అజర్‌ వంటి వారు జైళ్ళలో ఉన్నా అక్కడనుంచే లక్షలాది రూపాయలు ఖర్చుచేయగలరు. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు, నేరస్థులు బ్రిటన్‌లో అత్యంత విలువైన ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటున్నారనీ, ఖరీదైన ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారని నెలక్రితమే బ్రిటన్‌ ఆర్థిక, హోంశాఖల సంయుక్త నివేదిక ప్రకటించింది. అక్రమంగా సేకరించిన ఈ నిధులు అడ్డుతోవలో అటూ ఇటూ ప్రవహిస్తూ ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్నాయన్నది సారాంశం. లఖ్వీ, హఫీజ్‌ సయీద్‌, మసూద్‌ అజర్‌ వంటి పేరుమోసిన ఉగ్రవాదుల విషయంలో పాకిస్థాన్‌ చూపుతున్న ఈ చొరవ దాని ఆర్థికభవిష్యత్తుకు అవసరం. ఆర్థికంగా ఎంతో దెబ్బతిని ఉన్న ప్రస్తుత స్థితిలో, బ్లాక్‌లిస్టులోకి కనుక జారిపోతే విదేశీ ఆర్థికసాయాలు, అప్పుల విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఎప్పటికప్పుడు ఏవో కంటితుడుపు చర్యలతో, టర్కీ, మలేషియా, చైనా తదితర దేశాల సహకారంతో ఎఫ్‌ఏటీఎఫ్‌ బారినుంచి పాకిస్థాన్‌ తప్పించుకుంటూనే ఉంది. భారత విదేశాంగమంత్రి భద్రతామండలి ప్రసంగంలో పరోక్షంగా హెచ్చరించినట్టుగా, మిత్రదేశాలనుంచి ఈ రకమైన సహకారం అందుతున్నంత కాలం ఉగ్రవాదంపై పాకిస్థాన్‌నుంచి అసలైన యుద్ధాన్ని ఆశించలేం.

Updated Date - 2021-01-19T09:49:18+05:30 IST