పాక్ ఐఎస్ఐ చీఫ్ ఆకస్మిక కాబూల్ పర్యటన!

ABN , First Publish Date - 2021-09-04T22:23:33+05:30 IST

పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్ జనరల్

పాక్ ఐఎస్ఐ చీఫ్ ఆకస్మిక కాబూల్ పర్యటన!

కాబూల్ : పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్ జనరల్ ఫయీజ్ హమీద్ శనివారం అకస్మాత్తుగా ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో పర్యటించారు. ఇద్దరు పాకిస్థానీ అధికారులు ఈ విషయం చెప్పినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. జనరల్ ఫయీజ్ పర్యటనకు కారణాలేమిటో తెలియలేదని పేర్కొంది. తాలిబన్లను ప్రభావితం చేసే బయటి శక్తి పాకిస్థాన్ అనే విషయం తెలిసిందే. 


తాలిబన్ నేతల ప్రధాన కార్యాలయం పాకిస్థాన్‌లోనే ఉంది. శక్తిమంతమైన ఐఎస్ఐతో తాలిబన్లకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. పాకిస్థాన్ నుంచి తాలిబన్లకు సైనిక సాయం అందుతోందని అమెరికా, ఆఫ్ఘనిస్థాన్ గత ప్రభుత్వం ఆరోపించడం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను పాకిస్థాన్ అనేకసార్లు ఖండించింది. 


పంజ్‌షీర్ లోయలో తాలిబన్లు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సమయంలో జనరల్ ఫయీజ్ కాబూల్‌లో పర్యటిస్తున్నారు. ఆయనతోపాటు పాకిస్థానీ అధికారుల బృందం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై ప్రకటన చేయబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. 


ఓ పాకిస్థానీ పాత్రికేయుడిని ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ తెలిపిన సమాచారం ప్రకారం, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ భవిష్యత్తుపై చర్చించేందుకు రావాలని తాలిబన్లు కోరడంతో జనరల్ ఫయీజ్ కాబూల్‌లో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది.


Updated Date - 2021-09-04T22:23:33+05:30 IST