ఆ గోధుమలకు PAK గ్రీన్ సిగ్నల్

ABN , First Publish Date - 2021-11-23T15:43:01+05:30 IST

మానవతా సాయం కింద ఆప్ఘనిస్థాన్‌కు భారత్ అందిస్తున్న 50,000 మెట్రిక్ టన్నుల...

ఆ గోధుమలకు PAK గ్రీన్ సిగ్నల్

ఇస్లామాబాద్: మానవతా సాయం కింద ఆప్ఘనిస్థాన్‌కు భారత్ అందిస్తున్న 50,000 మెట్రిక్ టన్నుల గోధుమల షిప్‌మెంట్‌‌‌కు పాక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్రాన్సిట్ విధివిధాలు పూర్తి చేసిన అనంతరం ఆ సరుకును తమ భూభాగం గుండా ఆప్ఘన్ వెళ్లేందుకు అనుమతిస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. ఇస్లామాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆప్ఘనిస్థాన్ ఇంటర్-మినిస్టీరియల్ కోఆర్డినేషన్ సెల్ (ఏఐసీసీ) తొలి ఎపెక్స్ కమిటీ సమావేశానికి ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షత వహించారు. మానవతా సంక్షోభాన్ని నివారించేందుకు అంతర్జాతీయ సమాజం సమష్టి బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా సమావేశం నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేసింది.


భారత్‌తో విధివిధానాలను ఖరారు చేసిన అనంతరం ఆప్ఘన్‌కు భారత్ ఇవ్వజూపిన 50,000 మెట్రిక్ టన్నుల గోధుమల సాయాన్ని పాకిస్థాన్‌ భూభాగం గుండా వెళ్లేందుకు అనుమతిస్తామని ఈ సందర్భంగా పాక్ ప్రధాని ప్రకటించినట్టు ప్రభుత్వ అధికార రేడియో పాకిస్థాన్ పేర్కొంది. ప్రస్తుతం, ఆప్ఘన్ నుంచి వస్తువులను ఇండియాకు సరఫరా చేసేందుకు మాత్రమే పాక్ అనుమతిస్తోంది. సరిహద్దులు దాటి ఇరువైపులా వ్యాపారానికి అనుమతించడంలేదు. గత నెలలో ఆప్ఘన్‌కు మానవతా సాయంగా 50 వేల మెట్రిక్ టన్నుల గోధువులు ఇవ్వనున్నట్టు ఇండియా ప్రకటించింది. వాఘా బోర్డర్ గుండా షిప్‌మెంట్‌కు అనుమతించాలని పాక్‌కు విజ్ఞప్తి చేసింది. కాగా, ఇండియా నుంచి మానవతా సాయం అందుకునేందుకు తాలిబన్ ప్రభుత్వం అంగీకరించినందున పాకిస్థాన్ గుండా సరకు రవాణాకు పాక్ అనుమతించాలని ఆప్ఘనిస్థాన్ యాక్టింగ్ ఫారెన్ మినిస్టర్ అమీర్‌ఖాన్ ముత్తఖి సైతం పాక్ ప్రధానికి ఇటీవల విజ్ఞప్తి చేశారు. గత ఏడాది కూడా ఆప్ఘన్‌కు భారత్ 75,000 మెట్రిక్ టన్నుల గోధుమలను మానవతా సాయంగా పంపింది.

Updated Date - 2021-11-23T15:43:01+05:30 IST