పాక్‌ క్రికెట్‌కు కరోనా సెగ

ABN , First Publish Date - 2020-06-24T06:50:53+05:30 IST

పాకిస్థాన్‌ క్రికెట్‌లో కరోనా కలకలం రేపుతోంది. సోమవారం ముగ్గురు క్రికెటర్లు పాజిటివ్‌గా తేలగా.. తాజాగా మరో ఏడుగురికి కొవిడ్‌-19 సోకినట్టు పాక్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ప్రకటించింది.

పాక్‌ క్రికెట్‌కు కరోనా సెగ

తాజాగా మరో ఏడుగురికి..

జాబితాలో హఫీజ్‌, వాహబ్‌ రియాజ్‌


కరాచీ: పాకిస్థాన్‌ క్రికెట్‌లో కరోనా కలకలం రేపుతోంది. సోమవారం ముగ్గురు క్రికెటర్లు పాజిటివ్‌గా తేలగా.. తాజాగా మరో ఏడుగురికి కొవిడ్‌-19 సోకినట్టు పాక్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ప్రకటించింది. ఇందులో వెటరన్‌ ఆటగాళ్లు మహ్మద్‌ హఫీజ్‌, పేసర్‌ వాహబ్‌ రియాజ్‌ కూడా ఉన్నారు. దీంతో కరోనా పాజిటివ్‌ ఆటగాళ్ల సంఖ్య మొత్తం పదికి చేరింది. ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లాల్సిన 29 మంది ఆటగాళ్లకు ముందు జాగ్రత్తగా పీసీబీ ఆదివారం రావల్పిండిలో కరోనా టెస్టులు జరిపింది. దీంట్లో హైదర్‌ అలీ, హరీస్‌ రౌఫ్‌, షాదాబ్‌ ఖాన్‌లకు సోమవారం కరోనా సోకినట్టు తేలింది. తాజాగా ఈ జాబితాలో హఫీజ్‌, రియాజ్‌తో పాటు ఫఖర్‌ జమాన్‌, కషీఫ్‌ భట్టి, మహ్మద్‌ హస్నైన్‌, మహ్మద్‌ రిజ్వాన్‌, ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా చేరారు. వీరితో పాటు టీమ్‌ మసార్‌ (మసాజ్‌ చేసే వ్యక్తి) మలంగ్‌ అలీ కూడా ఉన్నాడు. వీరంతా 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లనున్నట్టు పీసీబీ తెలిపింది. నిజానికి టెస్టుల ముందు వరకు కూడా వీరిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. అలాగే స్టార్‌ ఆల్‌రౌండర్‌ షోయబ్‌ మాలిక్‌, బౌలింగ్‌ కోచ్‌ వకార్‌ యూనిస్‌, ఫిజియో థెరపిస్ట్‌ క్లిఫ్‌ డెకాన్‌ల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటికే పాక్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రీది కూడా కరోనా బారిన పడి క్వారంటైన్‌లో ఉంటున్నాడు.


28నే ప్రయాణం: ఇంగ్లండ్‌తో సిరీస్‌ యథావిధిగా కొ నసాగుతుందని పీసీబీ సీఈవో వసీంఖాన్‌ స్పష్టం చేశాడు. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 28న ప్రత్యేక విమానంలో తమజట్టు ఇంగ్లండ్‌కు వెళ్తుందన్నాడు.


‘పాక్‌ టూర్‌ను కరోనా ఆపలేదు’

లండన్‌: పాకిస్థాన్‌ జట్టులో ఏకంగా పది మంది ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌ తేలడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఆ జట్టులో ఎంతమందికి కరోనా సోకినా వారి పర్యటన ఆగదని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ ఆష్లే గైల్స్‌ స్పష్టం చేశాడు.

Updated Date - 2020-06-24T06:50:53+05:30 IST