2025 చాంపియన్స్ ట్రోఫీకి పాక్ ఆతిథ్యం.. 1996 తర్వాత తొలిసారి

ABN , First Publish Date - 2021-11-17T01:40:37+05:30 IST

దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఓ ఐసీసీ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వబోతోంది.

2025 చాంపియన్స్ ట్రోఫీకి పాక్ ఆతిథ్యం.. 1996 తర్వాత తొలిసారి

దుబాయ్: దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఓ ఐసీసీ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఫిబ్రవరి 2025 చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ బాధ్యతలను ఐసీసీ నేడు పాకిస్థాన్‌కు అప్పగించింది. జూన్ 2024 టీ20 ప్రపంచకప్‌ను అమెరికా, వెస్టిండీస్ కలిసి నిర్వహించనున్నాయి. ఉత్తర అమెరికాకు ఇదే తొలి గ్లోబల్ ఈవెంట్ కావడం గమనార్హం.


ఐసీసీ ప్రకటన ప్రకారం.. 2026 టీ20 ప్రపంచకప్‌, 2029 చాంపియన్స్ ట్రోఫీ, 2031 వన్డే ప్రపంచకప్‌‌లకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2026 టీ20 ప్రపంచకప్‌ను శ్రీలంకతోనూ, 2031 వన్డే ప్రపంచకప్‌ను బంగ్లాదేశ్‌తోనూ కలిసి నిర్వహిస్తుంది. ఇంగ్లండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్ దేశాలకు 2030లో టీ20 వరల్డ్ కప్ నిర్వహించే అవకాశం దక్కింది. 


పాకిస్థాన్ చివరిసారి 1996లో ఇండియా, శ్రీలంకతో కలిసి ప్రపంచకప్‌ను నిర్వహించింది. లాహోర్‌లో 2009లో శ్రీలంక జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత పాకిస్థాన్ మరే అంతర్జతీయ టోర్నీని నిర్వహించలేకపోయింది. కాగా, తొలిసారి నమీబియాకు కూడా ఐసీసీ ప్రపంచకప్ నిర్వహించే బాధ్యత దక్కింది. 2027 వన్డే ప్రపంచకప్ పోటీలు దక్షిణాఫ్రికా, జింబాబ్వేతో పాటు నమీబియాలోనూ జరగనున్నాయి. 2028 టీ20 వరల్డ్ కప్‌కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆతిథ్యమివ్వనున్నాయి.


ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఐర్లాండ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, స్కాట్లాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే దేశాలు మేజర్ ఐసీసీ టోర్నీలకు ఆతిథ్యం ఇచ్చాయి. మళ్లీ వచ్చే దశాబ్దంలో వీటికి అవకాశం దక్కనుంది.     

Updated Date - 2021-11-17T01:40:37+05:30 IST