కుల్‌భూషణ్ జాదవ్ కేసులో ముగ్గురు న్యాయవాదులను నియమించిన పాక్ హైకోర్టు

ABN , First Publish Date - 2020-08-04T22:43:04+05:30 IST

భారత నావికా దళం మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ కేసులో సహాయపడేందుకు

కుల్‌భూషణ్ జాదవ్ కేసులో ముగ్గురు న్యాయవాదులను నియమించిన పాక్ హైకోర్టు

ఇస్లామాబాద్ : భారత నావికా దళం మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ కేసులో సహాయపడేందుకు ముగ్గురు న్యాయవాదులను ఇస్లామాబాద్ హైకోర్టు నియమించింది. మరణ శిక్షను ఎదుర్కొంటున్న జాదవ్‌ తరపున వాదించేందుకు న్యాయవాదిని నియమించడానికి మరొక అవకాశాన్ని భారత దేశానికి ఇవ్వాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 


జాదవ్ గూఢచర్యం చేస్తున్నట్లు ఆరోపిస్తూ పాకిస్థాన్ మిలిటరీ కోర్టు ఆయనకు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో, ఈ నేర నిర్థారణను, మరణ శిక్షను పునఃసమీక్షించాలని పాకిస్థాన్‌ను 2019 జూలైలో ఆదేశించింది. మరణ శిక్షపై పాకిస్థాన్ కోర్టులో అపీలు చేయడానికి నిర్ణీత గడువు ముగిసిపోయింది. ఈ గడువు ముగియడానికి ముందే భారత ప్రభుత్వం అనేకసార్లు పాకిస్థాన్ ప్రభుత్వాన్ని సంప్రదించి, జాదవ్ తరపున అపీలు చేసేందుకు కాన్సులర్ యాక్సెస్ కల్పించాలని కోరింది. కానీ గడువు ముగిసే సమయంలో మాత్రమే నామమాత్రంగా కాన్సులర్ యాక్సెస్ మంజూరు చేసింది. 


పాకిస్థాన్ మిలిటరీ కోర్టు జాదవ్‌కు మరణ శిక్షను 2017 ఏప్రిల్‌లో విధించింది. గూఢచర్యం, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు రుజువైందని తెలిపింది. 


ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అథర్ మినల్లా, జస్టిస్ మియాంగుల్ హసన్ ఔరంగజేబ్ ధర్మాసనం ఈ కేసులో సహాయపడేందుకు ముగ్గురు న్యాయవాదులను సోమవారం నియమించింది. 


సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు అయిన అబిద్ హసన్ మంటో, హమీద్ ఖాన్‌లను, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్, మాజీ పాకిస్థాన్ అటార్నీ జనరల్ మగ్దూం అలీ ఖాన్‌ను అమికస్ క్యూరీగా నియమించింది. పిటిషన్ దాఖలు చేసేందుకు జాదవ్‌కు , భారత ప్రభుత్వానికి సమంజసమైన అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపింది. తమ ఆదేశాలను భారత ప్రభుత్వానికి తెలియజేయాలని ఆదేశించింది. 


పాకిస్థాన్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌లో, మిలిటరీ కోర్టు తనకు విధించిన శిక్షను పునఃసమీక్షించాలని కోరుతూ దరఖాస్తు చేసేందుకు జాదవ్ తిరస్కరించినట్లు తెలిపింది. 


Updated Date - 2020-08-04T22:43:04+05:30 IST