Abn logo
Oct 11 2021 @ 21:35PM

ప్రపంచ క్రికెట్‌ను ఇండియా శాసిస్తోంది.. ఇమ్రాన్‌ఖాన్ సంచలన వ్యాఖ్యలు

ఇస్లామాబాద్: ప్రపంచ క్రికెట్‌ను ఇండియా శాసిస్తోందని, దానికి వ్యతిరేకంగా వెళ్లే సాహసం ఎవరూ చేయలేరని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తోందని అన్నారు. ఆటగాళ్లకు, బోర్డులకు ఇప్పుడు అదే ప్రధానమని అన్నారు. పాకిస్థాన్ పర్యటనను పలు దేశాలు రద్దు చేసుకున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.


పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజా ఇటీవల మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్రమోదీ కనుక తలచుకుంటే పాక్ క్రికెట్ కుప్పకూలుతుందని వ్యాఖ్యానించాడు. పాక్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ నుంచి 50 శాతం నిధులు అందుతున్నాయని, కానీ బీసీసీఐ నుంచి ఐసీసీకి 90 శాతం నిధులు అందుతున్నాయని పేర్కొన్నాడు. ఈ లెక్కన చూసుకుంటే పాక్ క్రికెట్‌ను భారత వ్యాపారవేత్తలు నడిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.


ఈ  నేపథ్యంలో ఆ దేశ ప్రధాని, పాక్ జట్టు మాజీ కెప్టెన్ అయిన ఇమ్రాన్ తాజాగా మాట్లాడుతూ.. ప్రపంచ క్రికెట్ మొత్తాన్ని పొరుగుదేశం నియంత్రిస్తోందని అన్నారు. ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు పాక్ పర్యటనను రద్దు చేసుకోవడంపై ఇమ్రాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండియాకు వ్యతిరేకంగా వెళ్లే సాహసం ఎవరూ చేయబోరని, ఎందుకంటే ఇక్కడ డబ్బుదే ప్రధాన పాత్ర అని పేర్కొన్నారు.  

ఇవి కూడా చదవండిImage Caption