Good Taliban కోసమే చర్చలు: పాక్ మంత్రి

ABN , First Publish Date - 2021-10-03T20:36:15+05:30 IST

మంచి తాలిబన్ కోసమే నిషేధిత తెహరీక్-ఈ-తాలిబన్

Good Taliban కోసమే చర్చలు: పాక్ మంత్రి

ఇస్లామాబాద్ : మంచి తాలిబన్ కోసమే నిషేధిత తెహరీక్-ఈ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాద సంస్థతో చర్చలు జరుపుతున్నామని పాకిస్థాన్ ఇంటీరియర్ మంత్రి షేక్ రషీద్ చెప్పారు. టీటీపీతో చర్చల గురించి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించడంతో రాజకీయ నేతలు, ఉగ్రవాద బాధితులు తీవ్ర విమర్శలు గుప్పించిన నేపథ్యంలో రషీద్ స్పందించారు. 


టర్కీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని టీఆర్‌టీ వరల్డ్ న్యూస్ చానల్‌కు పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ల సహాయంతో టీటీపీతో తన ప్రభుత్వం చర్చలు జరుపుతోందని చెప్పారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 


టీటీపీని పాకిస్థానీ తాలిబన్ అని కూడా అంటారు. ఇది ఆఫ్ఘన్-పాకిస్థాన్ సరిహద్దుల కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ ఉగ్రవాద సంస్థతో చర్చలను షేక్ రషీద్ సమర్థించారు. తాము ఇచ్చిన ఆఫర్ పాకిస్థాన్‌లో రక్తపాతానికి బాధ్యులైన ఉగ్రవాదులకు కాదన్నారు. ఎవరు మంచివాళ్లో, ఎవరు చెడ్డవాళ్ళో తమకు తెలుసునని చెప్పారు. ఈ విషయం తమకు తెలియదని అనుకునేవాళ్ళు పొరబడినట్లేనని, వారికి బుద్ధి లేదని అన్నారు. చర్చల ఆఫర్ కేవలం మంచి తాలిబన్ల కోసమేనన్నారు. దీని కోసం చర్చలు అత్యున్నత స్థాయిలో జరుగుతున్నాయని చెప్పారు. శాంతియుతంగా జీవించడం కోసం లొంగిపోయినవారితో పోరాడటం సరైనది కాదన్నారు. తాము ఎవరికీ లొంగిపోవడం లేదన్నారు. ఈ ప్రక్రియ ప్రారంభ దశలో ఉందని చెప్పారు. ఈ దశలో ఎవరూ అంతిమ నిర్ణయాలకు రావలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. 



Updated Date - 2021-10-03T20:36:15+05:30 IST