టిక్‌టాక్‌పై నిషేధాన్ని మరోమారు ఎత్తేసిన పాకిస్థాన్

ABN , First Publish Date - 2021-11-20T21:53:06+05:30 IST

చైనీస్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌పై నిషేధం విధించడం, ఎత్తివేయడం పాకిస్థాన్‌కు పరిపాటిగా మారింది.

టిక్‌టాక్‌పై నిషేధాన్ని మరోమారు ఎత్తేసిన పాకిస్థాన్

ఇస్లామాబాద్: చైనీస్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌పై నిషేధం విధించడం, ఎత్తివేయడం పాకిస్థాన్‌కు పరిపాటిగా మారింది. అసభ్య కంటెంట్ పేరుతో ఇప్పటికే నాలుగుసార్లు నిషేధం విధించిన పాక్ ఆ తర్వాత ఎత్తివేసింది. తాజాగా నిషేధాన్ని ఎత్తివేయడం గత 15 నెలల్లో ఇది నాలుగోసారి కావడం గమనార్హం.


పాకిస్థాన్ యువతను విశేషంగా ఆకట్టుకున్న టిక్‌టాక్‌పై తొలుత గతేడాది అక్టోబరులో నిషేధం విధించింది. యాప్‌లో అనైతిక, అశ్లీల, అసభ్య కంటెంట్ ఎక్కువైపోతున్నట్టు ఆరోపణలు రావడంతో పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ (పీటీఏ) ఈ చర్యలు తీసుకుంది.


తాజాగా నిషేధం ఎత్తివేతపై పీటీఏ మాట్లాడుతూ.. చట్టవ్యతిరేక కంటెంట్‌ను యాప్‌లో అప్‌లోడ్ చేసేవారిని బ్లాక్ చేస్తామని ప్రభుత్వానికి టిక్‌టాక్ స్పష్టమైన హామీ ఇచ్చినట్టు తెలిపింది. చైనా బైట్‌డ్యాన్స్‌కు చెందిన టిక్‌టాక్‌కు పాకిస్థాన్‌లో 39 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. చట్టవ్యతిరేక కంటెంట్‌ను నియంత్రించే చర్యలు తీసుకోవాలని టిక్‌టాక్‌ను ఆదేశించినట్టు పేర్కొంది. 

Updated Date - 2021-11-20T21:53:06+05:30 IST