పాక్ క్రికెటర్ ఫఖర్ జమాన్ జట్టులో రోహిత్‌శర్మ

ABN , First Publish Date - 2020-02-28T03:21:29+05:30 IST

పాక్ క్రికెటర్ ఫఖర్ జమాన్ ప్రకటించిన తన ఆల్‌టైం టీ20 ఎలెవన్ జట్టులో టీమిండియా ‘హిట్‌మ్యాన్’

పాక్ క్రికెటర్ ఫఖర్ జమాన్ జట్టులో రోహిత్‌శర్మ

కరాచీ: పాక్ క్రికెటర్ ఫఖర్ జమాన్ ప్రకటించిన తన ఆల్‌టైం టీ20 ఎలెవన్ జట్టులో టీమిండియా ‘హిట్‌మ్యాన్’ రోహిత్‌శర్మకు స్థానం కల్పించాడు. అదే సమయంలో టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ, మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీలకు మాత్రం చోటు దక్కలేదు. అతడి జట్టులో ఎక్కువమంది ఇంగ్లండ్ క్రికెటర్లు ఉండడం గమనార్హం. ఇండియా, ఆస్ట్రేలియా నుంచి ఇద్దరు చొప్పున ఎంచుకోగా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఒక్కో ఆటగాడిని ఎంచుకున్నాడు. ఫఖర్ జట్టులో ఆశ్చర్యం కనిపించే ఎన్నో అంశాలు ఉన్నా.. విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం, క్రిస్‌గేల్ వంటి ఆటగాళ్లను పక్కన పెట్టడం కంటే మాత్రం కాదు. 


ఓపెనర్లుగా రోహిత్, దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ ‌ను ఎంచుకున్నాడు. ఏబీని ఎంచుకోవడంలో ఆశ్చర్యం లేకపోయినా, అతడి బ్యాటింగ్ స్థానం మాత్రం అందరినీ విస్తుపోయేలా చేసింది. జాసన్ రాయ్‌ను మూడో నంబరు ఆటగాడిగా ఎంచుకున్నాడు. నిజానికి రాయ్ వన్డేల్లో ఇంగ్లండ్ ఓపెనర్. ఇక అతడి జట్టులో ఉన్న ఏకైక పాకిస్థాన్ ఆటగాడు షోయబ్ మాలిక్. అతడిని నాలుగో స్థానానికి పరిమితం చేశాడు. ఎంఎస్ ధోనీకి బదులు ఇంగ్లండ్ కీపర్ జోస్ బట్లర్‌ను ఎంచుకున్నాడు. అలాగే, స్పెషలిస్ట్ ఆల్‌రౌండర్లు అయిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, బెన్‌స్టోక్స్, కీరన్ పొలార్డ్‌లకు చోటిచ్చాడు. వీరు ముగ్గిరికీ 6, 7, 8 స్థానాలు కేటాయించాడు. 


ఆసీస్ ఆటగాడు మిచెల్ స్టార్క్, ఇండియా నుంచి జస్ప్రీత్ బుమ్రాలను పేసర్లుగా తీసుకున్నాడు. ఇక, ఆఫ్ఘనిస్థాన్ స్పెషలిస్ట్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు కూడా తన జట్టులో చోటిచ్చాడు. 


ఫఖర్ జమాన్ ఆల్‌టైం ఎలెవన్: ఏబీ డివిలియర్స్, రోహిత్‌శర్మ, జాసన్ రాయ్, షోయబ్ మాలిక్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, బెన్‌స్టోక్స్, కీరన్ పొలార్డ్, మిచెల్ స్టార్క్, జస్ప్రీత్ బుమ్రా, రషీద్ ఖాన్. 

Updated Date - 2020-02-28T03:21:29+05:30 IST