Abn logo
Sep 25 2021 @ 17:17PM

పాక్ ప్రధాని ఇమ్రాన్‌ను ఏకిపడేసిన తాలిబన్లు

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి రావడానికి తనవంతు కృషి చేసిన పాకిస్థాన్‌కు తాలిబన్లు షాకిచ్చారు. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను తోలుబొమ్మ (పప్పెట్)గా అభివర్ణించారు. ఇమ్రాన్ ప్రజల ద్వారా ఎన్నికవలేదని తాలిబన్ అధికార ప్రతినిధి ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఆఫ్ఘనిస్థాన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. 


తాలిబన్ అధికార ప్రతినిధి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇమ్రాన్‌ఖాన్ ‘ఎలక్టెడ్’ ప్రధాని కాదని, ‘సెలక్టెడ్’ ప్రధాని అని అభివర్ణించారు. ఆయనో తోలుబొమ్మ అని విమర్శించారు. ఆఫ్ఘనిస్థాన్ వ్యవహారాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దని, తాము కూడా ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని అన్నారు. ఇమ్రాన్‌ఖాన్ బుధవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘పప్పెట్’ ప్రభుత్వంతో ఆఫ్ఘనిస్థాన్ స్థిరంగా మనుగడ సాగించలేదని అన్నారు. బదులుగా తాలిబన్ ప్రతినిధి ఈ వ్యాఖ్యలు చేశారు.  


‘‘ఆఫ్ఘనిస్థాన్‌లో కలుపుకుని పోయే ప్రభుత్వం ఉండాలని ఇమ్రాన్ కోరుకుంటున్నారు. ఇప్పుడు పాకిస్థాన్ ఎన్నో కష్టాల్లో చిక్కుకుంది. మరెన్నో సమస్యలు ఎదుర్కొంటోంది. ఇమ్రాన్ ఎన్నికల్లో గెలుపొందలేదు. పాక్ ప్రజల సమ్మతితో ఆయన ప్రధాని కాలేదు’’ అని తాలిబన్ ప్రతినిధి విరుచుకుపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం పాక్ అర్మీ చేతిలో తోలుబొమ్మ అని అక్కడి ప్రజలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆ దేశంలోని అన్ని వర్గాలకు పూర్తిస్థాయిలో ప్రాథమిక హక్కులు లేవని, ప్రస్తుత ప్రభుత్వంలో పాక్‌లోని అన్ని వర్గాలు సంతోషంగా లేవని అన్నారు. అందుకనే వారు ఈ ప్రభుత్వాన్ని ఆర్మీ చేతిలో ఉన్న తోలుబొమ్మ ప్రభుత్వంగా చెబుతున్నారని అన్నారు.  

ఇవి కూడా చదవండిImage Caption