పాకిస్తాన్‌ ప్రీమియర్‌లీగ్‌నూ వదలని బుకీలు

ABN , First Publish Date - 2021-06-23T17:57:18+05:30 IST

భారత దేశానికి సంబంధించిన అంతర్జాతీయ క్రికెట్‌ కాదు... కనీసం మన దేశంలో జరిగే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచ్‌లూ కావు... పాకిస్తాన్‌ దేశంలో జరుగుతున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌

పాకిస్తాన్‌ ప్రీమియర్‌లీగ్‌నూ వదలని బుకీలు

బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠా అరెస్టు

ప్రధాన నిర్వాహకుడు పరారీలో.. రూ.20.5లక్షల నగదు, సామగ్రి స్వాధీనం

మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌


హైదరాబాద్‌ సిటీ: భారత దేశానికి సంబంధించిన అంతర్జాతీయ క్రికెట్‌ కాదు... కనీసం మన దేశంలో జరిగే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచ్‌లూ కావు... పాకిస్తాన్‌ దేశంలో జరుగుతున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎ్‌సఎల్‌) మ్యాచ్‌లను కూడా బెట్టింగ్‌ రాయుళ్లు వదల్లేదు. అక్కడ జరుగుతున్న మ్యాచ్‌లకు ఇక్కడ నిజాంపేట్‌లో అడ్డా ఏర్పాటు చేసుకున్న బుకీలు దర్జాగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ నెల 8న ప్రారంభమైన సూపర్‌లీగ్‌ మ్యాచ్‌లు 24 వరకు కొనసాగుతాయి. వాటిలో ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ముందుగానే ప్లాన్‌ చేసుకున్న బెట్టింగ్‌ నిర్వాహకులు ఆ మ్యాచ్‌ల సందర్భంగా కూడా బుకీలు... పంటర్లను ఏర్పాటు చేసుకుని దందా కానిచ్చేస్తున్నారు. అంతకు మించి ప్లాన్‌ చేసిన మాదాపూర్‌ ఎస్‌ఓటీ అధికారులు దాడులు నిర్వహించి బెట్టింగ్‌ దందా చేస్తున్న ఐదుగురు బుకీలను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిర్వాహకుడి కోసం గాలిస్తున్నారు. వారి నుంచి రూ.20.5లక్షల నగదుతో పాటు మొత్తం రూ.23.8లక్షల సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 


బెట్టింగ్‌లపై డేగకన్ను

ఇండియాలో జరిగినా.. పాకిస్తాన్‌లో జరిగినా.. బెట్టింగ్‌ రాయుళ్లపై గట్టి నిఘా పెడుతున్నామని సీపీ సజ్జనార్‌ తెలిపారు. నిషేధిత ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై దృష్టి సారించిన మాదాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. బాచుపల్లి పీఎస్‌ పరిధిలోని నిజాంపేట్‌లోని భండారీ లే అవుట్‌, పావని రెసిడెన్సీలో పీఎ్‌సఎల్‌కు సంబంధించి ముల్తాన్‌ సుల్తాన్స్‌తో ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ మధ్య మ్యాచ్‌ సందర్భంగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ సాగుతోందని నిర్ధారించుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ సందీప్‌ నేతృత్వంలో మాదాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఐదుగురు బుకీలను అదుపులోకి తీసుకున్నారు. వారి  నుంచి రూ.20.5లక్షల నగదు, బెట్టింగ్‌ బోర్డు, ల్యాప్‌టాప్‌, 33 మొబైల్‌ఫోన్లు, టీవీ, రౌటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు చిక్కినప్పటికీ... ప్రధాన బుకీ ఈస్ట్‌గోదావరి జిల్లాకు చెందిన సోమన్న మాత్రం పరారీలోనే ఉన్నాడు. 


చిక్కిన ఇతర బుకీలు

చిక్కిన వారిలో నిర్వాహకుడైన వెస్ట్‌గోదావరి జిల్లా భీమవరం నివాసి గుంటూరి సత్య పవన్‌కుమార్‌ (32), బెట్టింగ్‌ ఆపరేటర్‌ భీమవరం టౌన్‌ వాసి ఉద్దర రాజు సతీష్‌ రాజు (41), ఇతర బెట్టింగ్‌ ఆపరేటర్లు కృష్ణా జిల్లా మచిలీపట్నం నివాసి సీహెచ్‌ త్రినాథ్‌(29), నూజివీడు నివాసి నందిపాము భాస్కర్‌(31), ఆకివీడు టౌన్‌ వాసి జక్కపూడి ప్రసాద్‌(25)లు ఉన్నారు. ప్రధాన నిర్వాహకుడు సోమన్న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకుని బెట్టింగ్‌ దందాలో అరితేరాడు. మరో ఇద్దరు నిందితులు సత్య పవన్‌కుమార్‌, సతీ్‌షరాజు కలిసి సోమన్న దగ్గరి నుంచి మెయిన్‌లైన్‌ అనుమతులు తీసుకుని హైదరాబాద్‌లో కమ్యూనికేటర్‌ బోర్డ్‌, ల్యాప్‌టా్‌పల సాయంతో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. త్రినాథ్‌, భాస్కర్‌, ప్రసాద్‌ను నియమించుకుని వారి ద్వారా పంటర్లను రప్పించడం.. కలెక్షన్లు తీసుకుంటున్నారు. 


హవాలా ద్వారా డబ్బులు

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లు లైవ్‌ లైన్‌ గురు, క్రికెట్‌ మజా, లోటస్‌, బెట్‌-365, బెట్‌ఫెయిర్‌ ద్వారా పంటర్లు ఆన్‌లైన్‌లో వీక్షించగలుగుతున్నారు. క్యాష్‌ ద్వారా జరిగే చెల్లింపులతో పాటు హవాలా, ఇతర మార్గాల ద్వారా చెల్లింపులు జరుగుతున్నట్టు గుర్తించామని సీపీ సజ్జనార్‌ వెల్లడించారు. ఎంతో మంది యువకులు వీరి మాయలో పడి డబ్బులు పోగొట్టుకున్నారని. బెట్టింగ్‌ నిషేధమని సీపీ హెచ్చరించారు.  ఎస్‌ఓటీ డీసీపీ జి.సందీ్‌పను, మాదాపూర్‌ ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ శివప్రసాద్‌తో పాటు వారి టీంను సీపీ అభినందించారు. బుకీల మాయమాటల వలలో యువత పడొద్దన్నారు. ట్యూషన్‌ ఫీజుల పేరిట తల్లి దండ్రుల వద్ద డబ్బులు తీసుకుంటున్న విద్యార్థులు బెట్టింగ్‌ వైపు ఆకర్షితులు కావడం విచారకరమని.. తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. 

Updated Date - 2021-06-23T17:57:18+05:30 IST