Abn logo
Feb 1 2020 @ 22:11PM

సైకిల్ షాపులో.. కారు మెకానిక్‌గా పనిచేసి.. ప్రపంచ ప్రఖ్యాత గాయకుడిగా..

మెహ్ దీ హసన్.. గానానికి ప్రాణం - ప్రాణం ఉన్న‌ గానం.

గానం‌ అన్నది మెఱుగుపడుతూ వెళ్లి ఒక ఉన్నత‌ స్థితిలో‌ ఉండిపోతే అది మెహ్ దీ హసన్ గానం‌‌ అవుతుంది. ఉర్దూ గజల్ గాయకులుగా ప్రపంచ ప్రఖ్యాతిపొందిన మెహ్ దీ హసన్ పుట్టిన రోజు ఇవాళ. ఆ మెహ్ దీ‌ హసన్ గుఱించి తెలుసుకుందాం రండి..

 

మెహ్ దీ హసన్ పాకిస్తాన్ దేశపు గాయకులు. ముఖ్యంగా‌ గౙల్ గాయకులు. రేడియో కరాచీలో నిలయ ఠుమ్రీ గాయకులై ఆపై ఆ దేశపు చలన చిత్రగాయకులై ఆపై ఉర్దూ గౙల్‌ గాయకులై గౙల్ గానాన్ని విశ్వవ్యాప్తం‌ చేశారు. ఒక‌ ఉదాత్తమైన గాయకులుగా వినుతికెక్కారు. గౙల్ గానాన్ని పాకిస్తాన్ నుంచి లండన్ రొయల్ అల్బట్ హాల్ (Royal Albert Hall)కు తీసుకువెళ్లారు.

మెహ్ దీ‌ హసన్, జూలై 18 , 1927లో‌ రాజస్థాన్‌లోని లున అనే ఊళ్లో‌ ఒక సంగీత కళాకారుల కుటుంబంలో పుట్టారు. వీరి కుటుంబం కలావంత్ అన్న సంగీత కళాకారులకు సంబంధించిన తెగ. తండ్రి ఆజీమ్ ఖాన్. మెహ్ దీ హసన్‌కు తండ్రి గురువు కూడా. ఆజీమ్ ఖాన్ జైపూర్ రాజు ఆస్థాన గాయకులు. ధ్రుపద్, ఖయాల్, ఠుమ్రీ, దాద్రా‌ వంటి హిందూస్థానీ సంగీత సంప్రదాయాలను మెహ్ దీ హసన్ తమ 8వ ఏటనుంచి అభ్యసించారు. తమ‌ 20వ ఏట అప్పుడు‌ ఏర్పడ్డ పాకిస్తాన్‌కు వెళ్లిపోయారు. అక్కడ ఒక సైకిల్ కొట్లోనూ, కార్ మెకానిక్‌గానూ పొట్టకూటి కోసం పనిచేశారు. ఎవరూ చూడని సమయాల్లో ఏ చెట్టు పైనో కూర్చుని‌ పాడుకునే వారట. తరువాత రేడియో గాయకులై ఆపై‌‌ చలనచిత్ర గాయకులై ఆపై గౙల్ గాయకులై చరిత్ర సృష్టించారు. మెహ్ దీ హసన్ ఖాన్ గౙల్‌ షెహన్ షాహ్‌గా కాలంలో నిలిచి ఉంటారు.

ప్రముఖ హిందీ చలన చిత్ర గాయకులు మన్నాదె ఒకసారి పి.బి.శ్రీనివాస్‌తో... ‘మనం మనల్నీ, వేఱే వాళ్లనూ గాయకులనుకుంటున్నాం... కానీ గాయకుడంటే ఆ మెహ్ దీ హసన్... అతడి గానాన్ని వినండి’.. అని‌ అన్నారట. అదీ మెహ్ దీ హసన్ గొప్పతనం.‌ మన్నాదె‌ వంటి‌‌‌ ఉత్తమ‌ గాయకులే ‘గాయకుడంటే మెహ్ దీ హసన్’ అనడం‌ మనకు మెహ్ దీ‌ హసన్‌ ఎంతటి, ఎలాంటి గాయకులో‌ తెలియజేస్తోంది. ఒక సందర్భంలో లత మంగేశ్కర్ ‘మీ గొంతులో దేవుడు‌ పలుకుతున్నాడు’ అని‌ మెహ్ దీ‌ హసన్‌తో అన్నారు. ఒకసారి పి.బి.శ్రీనివాస్ మన వైణిక విద్వాంసులు ఈమని‌ శంకర‌శాస్త్రికి మెహ్ దీ హసన్ గౙళ్ల రికార్డ్ వినిపించారు. శంకరశాస్త్రి ఆ‌ గౙళ్లను విన్నప్పుడు ఏమీ మాట్లాడలేదట. కొన్ని రోజుల తరువాత శంకరశాస్త్రి ‘ఇవాళ నా మనసేం బాలేదు, ఆ రోజు నాకు వినిపించిన ఆ పాకిస్తానీ గాయకుడి పాటలు పెట్టు’ అని అన్నారట. అదీ మెహ్ దీ హసన్ గొప్పతనం.‌ శంకర‌శాస్త్రి అంతటి సంగీత వేత్తకు మానసిక‌ ఆనందం కోసం మెహ్ దీ హసన్ గానం కావాల్సి‌ వచ్చింది!


మెహ్ దీ హసన్ గానం ఆనందరసం! ఎందఱో అద్భుతమైన‌ గాయకులున్నారు కానీ ఆనంద‌రసం అద్భుతం కన్నా మిన్న. మెహ్ దీ‌ హసన్ ఇతర గాయకుల కన్నా మిన్న.

Balance, musical gap, relief-note, note-perfection ఈ నాలుగు ప్రత్యేకమైన, విశేషమైన అంశాలు మెహ్‌ దీ హసన్ గానంలో ఉంటాయి. మెహ్ దీ హసన్ నాదం స్వరంలో ఒదిగే విధానం అనితరసాధ్యం. మఱెవరికీ అంతగా అందని విద్య అది. శ్రుతికి అభివ్యక్తి మెహ్ దీ హసన్ నాదం. ‘వారి నాదం పెట్టుకుని తంబూరాను శ్రుతి‌ చేసుకోవచ్చు’ అంటారు.

 

మెహ్ దీ‌ హసన్ ది a rounded even warm bari tone with verve. A great timbre and a clear tone quality with resonance. ఖయాల్, ఠుమ్రీ గాన విధానాలను ఉర్దూ‌ గౙల్ గానానికి ప్రాతిపదికగా చేసుకున్న తొలిదశ‌ గాయకులు మెహ్ దీ హసన్‌‌. Mood and emotion‌‌ and superfine intonation and word-throw లతో గౙల్ గానం‌ చేశారు మెహ్ దీ‌ హసన్.

 

ప్రముఖ వైఅలిన్ (violin) విద్వాంసులు లాల్ గుడి జయరామన్ ఒకసారి ఇలా అన్నారు... ‘ఒక‌ సంగీత కళాకారుడిగా నేను నా మనసును ఎందఱికో‌ ఇచ్చాను కానీ మెహ్ దీ హసన్ దగ్గఱ నా మనసును పాఱేసుకున్నాను’.. మన శాస్త్రీయ సంగీత‌ గాయకులు ఎందఱినో ఎఱిగిన సాంప్రదాయిక కర్ణాటక సంగీత విద్వాంసులైన లాల్‌గుడి జయరామన్ మెహ్ దీ హసన్‌ను ఈ విధంగా ప్రశంసించడం సాధారణమైన విషయం‌‌ కాదు. ఇలా ఎందఱో సంగీత వేత్తల‌ హృదయాల్ని‌ చూరగొన్న మహా గాయకులు మెహ్ దీ హసన్.

మెహ్ దీ హసన్ తన మీద‌ తలత్ మహ్ మూద్ ప్రభావం ఉందని బహిరంగంగానే చెప్పుకున్నారు.‌ తొలి రోజుల్లో ఒక కచేరిలో తలత్ మహ్ మూద్‌ను అనుకరించి పాడితే శ్రోతలు 14,000 రూపాయల నగదు విరిజిమ్మారని మెహ్ దీ హసన్ స్వయంగా చెప్పారు. సామాన్యంగా మొదలైన మెహ్ దీ హసన్ గానం అసమాన్యమై, అద్వితీయమై కొనసాగింది. గౙల్‌ గానం‌ అన్నది వీరి వల్ల వన్నె తెచ్చుకుంది. ఎంతో వాసికెక్కింది. ఎప్పటికీ అనన్యమై నెలకొని ఉంటుంది.

 

మన‌దేశంలో‌ ఎందఱికో మెహ్‌దీ‌హసన్ అభిమాన గాయకులు.‌ దర్శకులు బాపు వీరి అభిమాని. బాపు తమ తూర్పువెళ్లే రైలు సినిమాలో ‘రఫ్ తా రఫ్‌ తా’ అన్న మెహ్ దీ హసన్ గౙల్ లాంటి పాట కావాలని "చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా" పాటను చేయించుకున్నారు. ముత్యాలముగ్గు‌ సినిమాలో ‘ఏదో‌ ఏదో‌ అన్నది‌‌ ఈ మసక‌ మసక‌ వెలుతురు’ పాట మెహ్‌దీహసన్ గౙల్ ‘బాత్ కర్ నీ ముఝె ముశ్కిల్ కభీ ఐసితో నథీ’ లాంటిదే. ‌ఇళయరాజా‌ కడవుళ్అమైత్తమేడై అన్న తమిళ సినిమాలో‌ ‘తెన్రలే నీ‌ పేసు’ అనే పాటను‌ ‘నగవా...’ అని మొదలయ్యే ఓ మెహ్ దీ హసన్ గౙల్ స్ఫూర్తితో చేశారు. పాకిస్తాన్‌లో‌ మెహ్ దీ హసన్ ఒక‌గొప్ప సినిమా గాయకులు కూడా.‌ మెహ్ దీ హసన్ ‘నవాజిష్ కరమ్ షుకిరియా’ అంటూ ఎ.హమీద్ సంగీతంలో, బృందావన సారంగి రాగంలో మేఓ‌నహీన్ ‌‌అన్న పాకిస్తానీ సినిమాలో పాడిన పాట మన దేశంలోనూ చాలా జనాదరణ పొందింది. నటులు‌ కమల్ హాసన్ ఈ పాటను పదేపదే పాడుకుంటూంటారు.‌

 

కవిరత్న కాళిదాస(1983) అనే కన్నడ సినిమాలో సంగీత దర్శకులు ఎం. రంగారావు ఈ పాట పల్లవిని యథాథంగా తీసుకుని ఓ మంచి పాట చేశారు. ‘సదా కణ్ణలి ప్రణయద కవితె హాడువే’ అంటూ రాజ్ కుమార్, వాణిజయరాంలు చక్కగా పాడారు. విచిత్రమైన‌ విషయం‌ ఏమిటంటే... పెండ్యాల సంగీతం‌ చేసిన ‘నీలి మేఘాలలో గాలి కెరటాలలో’ పాటను 1966లో హిందీ మేరాసాయా సినిమాలో మదన్మోహన్ వాడారు. లత మంగేశ్కర్ పాడిన ‘నేనో మె బద్ రా’ పాట అది. అదే బాణిని 1972లో పర్ దేశీ అనే పాకిస్తానీ సినిమాలో ‘పాయల్ ఝనన్ ఝన్ కే నగ్మా బన్ కే’ అంటూ మెహ్ దీ హసన్ పాడారు!‌

1977లో హైదరాబాద్, మద్రాస్, బాంబెలలో మెహ్ దీ హసన్ గౙల్ కచేరీలు జరిగాయి.‌ 1994లో మన దేశంలో మద్రాస్ తో సహా కొన్ని నగరాల్లో వారి కచేరీలు జరిగాయి.

 

మెహ్ దీ హసన్ ‘కైసీ చుపాఉన్ రాజె గం’, "రంజి షి స హే", "దేఖ్ తో దిల్" , "పత్తా పత్తా బూటా బూటా", " ఆయే కుచ్ అబ్ర్ కుచ్ షరాబ్ ఆయే", "క్యా‌ బలా ముఝ్ కో", ‌" షో‌లాతా జల్ భుజా",‌ "గులో మె రంగ్ భరే", " గుల్షన్ గుల్షన్ షోలా-ఎ-గుల్ కి", "ఓకె హర్ ఎహ్దె ముహబత్ ముకర్తా జాయే", " జిందగీ మేతొ సభీ ప్యార్ కియా", "క్యా టూటాహే అందర్ అందద్", " పరీ షా‌ హోకె మేరీ", యూనమిల్ ముఝే కఫా హో జేసే" వంటి ఎన్నో, ఎన్నెన్నో గొప్ప గొప్ప‌ గౙళ్ల గానం చేశారు. ద్రుపద్, ఖయాల్, ఠుమ్రీ లు పాడారు. పంజాబీ, రాజస్థానీ‌ జానపద సంగీతం పాడారు. పంజాబీ సూఫీ హీర్ లను పాడారు. వారి ఉర్దూ ఉచ్చారణ చాలా బావుంటుంది. ఉర్దూ‌కే అందం ఆ ఉచ్చారణ.

 

పాశ్చాత్య సంగీతంలో ‘eloborate aesthetic embellishment’ అని ‌సంగీతంలోని‌‌ ఉచ్చస్థితిని అంటారు. అది‌ ప్రాచ్య‌ సంగీతంలో‌ మెహ్ దీ‌ హసన్ దగ్గఱ నిండుగా ఉంది.

 

13-6-2012 లో‌ తమ శారీరాన్ని‌ లోకానికి ఇచ్చేసి శరీరంగా వెళ్లిపోయారు‌ మెహ్ దీ‌ హసన్.

 

మెహ్ దీ హసన్ గానానికి ప్రాణం. ప్రాణం ఉన్న గానం.


రోచిష్మాన్

9444012279

[email protected]

Advertisement
Advertisement
Advertisement