పుస్తకాల్లేని గ్రంథాలయం!

ABN , First Publish Date - 2022-01-24T04:35:02+05:30 IST

అది పేరుకే గ్రంథాలయం.. ఒక్క అధికారి తప్ప ఏ ఒక్కరూ ఆ గ్రంథాలయానికి వెళ్లరు.

పుస్తకాల్లేని గ్రంథాలయం!
వెళ్లే దారేది : మేడపైన ఉన్న గ్రంథాలయం

నిరుపయోగంగా పాలకొల్లు గ్రంథాలయం
వ్యాపారులు దారివ్వరు..పాఠకులు రారు


పాలకొల్లుఅర్బన్‌, జనవరి 23 : అది పేరుకే గ్రంథాలయం.. ఒక్క అధికారి తప్ప ఏ ఒక్కరూ ఆ గ్రంథాలయానికి వెళ్లరు. ఎందుకంటే ఆ గ్రంథాలయానికి వెళ్లడానికి దారి లేదు.. చదువుకుందామంటే పుస్తకాలు ఉండవు. ఇదేదో మారుమూల పల్లెలో గ్రంథాలయం కాదు.. ప్రస్తుత జడ్పీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ నియోజకవర్గ కన్వీ నర్‌గా ఉన్న పాలకొల్లు పట్టణంలోని గ్రంథాలయం దుస్థితి. పట్టణంలో మునిసిపల్‌ గ్రంఽథాలయం బస్టాండ్‌ సమీపంలో ఉండేది. 15 ఏళ్ళ కిందట గ్రంథాలయం ఉన్న చోట కొత్తగా కాంప్లెక్‌ నిర్మించి పైభాగంలో గ్రంఽథాలయ నిర్వహణకు 4 గదులు కేటాయించారు. అయితే కింద భాగంలో షాపులకు అద్దెకు ఇవ్వడంతో  గ్రంఽథాల యానికి వెళ్ళడానికి మార్గం లేకుండా పోయింది.. ఇక గ్రంథాలయంలో ఏవిధమైన  పుస్తకాలైనా ఉంటాయా అంటే అదీ లేదు.. దినపత్రికలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఆ దినపత్రికల కోసం అంతదూరం వెళ్లాలా అని పాఠకులు సైతం ఆ గ్రంఽథాలయం వైపు వెళ్లడం మానేశారు.మునిసిపల్‌ ఉద్యోగి లైబ్రేరియన్‌గా పనిచేస్తున్నారు.  ఆయన ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకూ మాత్రమే గ్రంథాలయాన్ని తెరిచి ఉంచుతారు. సాయంత్రం పూట తెరవరు. ఆదివారం, సెలవు దినాల్లో అసలు తెరవరు. ఒకపూట మాత్రమే విదులు  నిర్వహిస్తారు.. మిగిలిన సమయంలో ఏమి చేస్తారో తెలియదు.ఇప్పటికైనా మునిసిపల్‌ అధికారులు, పాలకులు స్పందించి గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయాలని పాఠకులు పలువురు కోరుతున్నారు. దీనిపై వివరణకు కమిషనర్‌ను సంప్రదించగా అందుబాటులో లేరు.

Updated Date - 2022-01-24T04:35:02+05:30 IST