నిద్రపట్టనివ్వని దుర్గుణాలు

ABN , First Publish Date - 2020-11-20T09:59:09+05:30 IST

పాండవుల వద్ద రాయబారానికి వెళ్లి వచ్చిన సంజయుడు.. ధృతరాష్ట్రునితో, తానప్పటికి అలసిపోయానని, తెల్లవారి సభలో అన్ని విషయాలూ చెబుతానని చెప్పి వెళ్లిపోయాడు.

నిద్రపట్టనివ్వని దుర్గుణాలు

అభియుక్తం బలవతా దుర్బలం హీనసాధనం,

హృతస్వం కామినం, చోర మావిశన్తి రజాగరాః


పాండవుల వద్ద రాయబారానికి వెళ్లి వచ్చిన సంజయుడు.. ధృతరాష్ట్రునితో, తానప్పటికి అలసిపోయానని, తెల్లవారి సభలో అన్ని విషయాలూ చెబుతానని చెప్పి వెళ్లిపోయాడు. దీంతో ఆ రాత్రి ధృతరాష్ట్రునికి నిద్దుర పట్టలేదు. తాను రాజ్యభాగం ఇవ్వడు, అయినా పాండవులు యుద్ధం చేయకూడదు.. ఇదీ సంజయునితో పాండవులకు ధృతరాష్ట్రుడు పంపిన రాయబార సారాంశం. దానికి వారి స్పందనలను బట్టి మహా సంగ్రామ నిర్ణయం జరగాలి. కానీ, వెళ్లొచ్చిన సంజయుడు ఏ విషయం చెప్పకపోవడంతో ధృతరాష్ట్రుని మనస్సు చాలా అలజడిగా ఉంది. ఆ మనో వేదన తీరాలంటే తన మనసెరిగి సేదతీర్చగలిగిన వారు ఇద్దరే ఇద్దరు.. ఒకరు సంజయుడు, మరొకరు విదురుడు. సంజయుడు అలసిపోయానని వెళ్లిపోవడంతో.. విదురుని పిలిపించాడు ధృతరాష్ట్రుడు.


‘‘విదురా.. పాండవుల వద్దకు దూతగా వెళ్లిన సంజయుడు ఇప్పుడే వచ్చి నన్ను తిట్టి, రెండు మూడు మాటలు చెప్పి,రేపు సభలో సవిస్తరంగా చెపుతానని వెళ్లాడు. అక్కడి విషయాలు తెలియక శరీరం నిప్పుల కొలిమిలో పొరలినట్లుగా ఉన్నది. నిద్ర రావట్లేదు. నా మనసు ప్రశాంతతను పొందే మాటలు చెప్పు’’ అని అడిగాడు. నిజానికి ధృతరాష్ట్రుడు తెలుసుకోవాలనుకుంటున్నది పాండవుల బలాబలాలను గురించి, వారి వ్యూహప్రతివ్యూహాల గురించి, తమ సైన్య సంపత్తిని మరింత బలోపేతం చేసుకునే విధానాల గురించే తప్ప.. ఏవో మంచి విషయాలు తెలుసుకునే భావన అతడికి ఏ కోశానా లేదు. అయితే.. ధృతరాష్ట్రుడు ఏ విధంగా అడిగినా విదురుడు మాత్రం నిర్మొహమాటంగా సత్యమే చెప్పాడు. ఆ సత్యాలే తదుపరి కాలంలో విదురనీతిగా సర్వకాలీనాలై నిలిచాయి. ఆ రోజు విదురుడు చెప్పిందే పై శ్లోకం. వ్యాసుడి సంస్కృత శ్లోకాన్ని తిక్కన అద్భుతంగా తెనిగించారిలా..


బలవంతుడు పై నెత్తిన బలహీనుడు, ధనము కోలువడిన యతడు, మ్రుచ్చిల వేచువాడు, కామాకుల చిత్తుడు, నిద్ర లేక కుందుదు రధిపా!


బలం కలిగిన వాడు దండయాత్రకు వచ్చిన వేళ బలం చాలని వాడు, కారణమేదయినా తన వద్ద ఉన్న ధనమంతా కోల్పోయిన వాడు, పరుల సొమ్మును దొంగతనం చేయాలని సమయం కోసం కాచుకు కూర్చున్న వానికి, కామభావనలతో మత్తుడైన వానికి నిద్రపట్టదని దీని అర్థం. ‘‘ఈ విధానంలో నీకు నిద్ర పట్టని కారణం ఏమిటో చెప్పు’’ అని అడుగుతాడు విదురుడు. దానికి ధృతరాష్ట్రుడు.. ‘‘సంజయుడు పాండవుల మనస్సును ఆవిష్కరించకుండానే వెళ్లాడు. పాండవ నిర్ణయంపై లగ్నమైన నా మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది’’ అని చెబుతాడు. ఇతరుల సొమ్ముకు ఆశపడినందునే ధృతరాష్ట్రుడికి నిద్ర పట్టట్లేదని తెలిపే ఘట్టమిది. యుగాలు మారినా నేటికీ వర్తించే నిత్యసత్యాలివి.

- పాలకుర్తి రామమూర్తి

Updated Date - 2020-11-20T09:59:09+05:30 IST