తెలుగు వర్శిటీకి పాల్కురికి పేరు

ABN , First Publish Date - 2021-01-27T06:54:10+05:30 IST

తెలుగు విశ్వవిద్యాలయానికి కొత్త పేరు తిరిగి వార్తలలోనికి వచ్చింది. ఈ మధ్య సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి సందర్భంగా కేటీఆర్, ఇతర నాయకులు...

తెలుగు వర్శిటీకి పాల్కురికి పేరు

తెలుగు విశ్వవిద్యాలయానికి కొత్త పేరు తిరిగి వార్తలలోనికి వచ్చింది. ఈ మధ్య సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి సందర్భంగా కేటీఆర్, ఇతర నాయకులు పాల్గొన్న సభలో ఈ ప్రస్తావన కొందరు నాయకులు తెచ్చారు. దానికి కేటీఆర్ సూటిగా సమాధానం ఇచ్చినట్లు వార్త రాలేదు. అయితే తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని దానికి సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించినట్లుగా వార్త వచ్చింది. దీన్ని పురస్కరించుకొని ఒక చర్చ అవసరం. 


సురవరం ప్రతాపరెడ్డి నిస్సందేహంగా అమూల్యమైన సేవ చేశారు. నాటి నిజాం పాలనలో అసలు తెలంగాణలో కవులు ఉన్నారా అని కొందరు కనుబొమ్మలు ఎగుర వేసిన సందర్భంలో గోల్కొండ పత్రికలో తెలంగాణ కోసం ఒక అస్తిత్వ సమరాన్ని చేసిన మహనీయుడు, సాహితీవేత్త, పరిశోధకుడు పాత్రికేయుడు సురవరం. తెలంగాణ కవుల చరిత్రకు ఆయనే బీజం వేశాడు. తెలంగాణ అస్తిత్వానికి ఆత్మ గౌరవానికి ఆయన చేసిన సాహిత్య సేవ గట్టి బలాన్ని ఇచ్చింది. అది నేటికీ ఏ నాటికీ మరువ లేనిది. ఆయన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ గ్రంథం ఆయన పరిశోధనా పటిమకు తార్కాణం. ఆయన పేరును ఒక పెద్ద విద్యాసంస్థకు లేదా ఒక విశ్వవిద్యాలయానికి పెట్టి గౌరవించడంలో రెండో అభిప్రాయం ఉండవలసిన అవసరం లేదు. తెలుగు భాషకు ఎంతో సేవచేసిన, చేస్తున్న మన హైదరాబాదులోనే ఉన్న తెలుగు అకాడమీకి సురవరం వారి పేరు పెట్టవచ్చు. లేదా మరొక విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టవచ్చు. కాని తెలుగు విశ్వవిద్యాలయానికి ఇంతకన్నా అత్యధికంగా శతాబ్దాల తరబడి నిలిచి ఉన్న మహాకవి పేరు పెట్టడమే సముచితంగా ఉంటుంది. 


ఆంధ్ర వారు రాజమహేంద్రవరంలో కొత్తగా ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయానికి ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం అని పేరు పెట్టారు. అదే విధంగా కడపలో విశ్వవిద్యాలయం కొత్తగా ఏర్పాటు చేసినప్పుడు అక్కడి ప్రాంతం వాడైన మహాకవి యోగివేమన పేరుపెట్టారు. ఈ రెండూ చాలా గొప్ప నిర్ణయాలు అని తప్పక చెప్పాలి. తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాషా సాహిత్యాలకు అందునా నేడు తెలంగాణ సాంస్కృతిక చారిత్రక నేపథ్యంతో కొన్ని శతాబ్దాల వరకూ పనిచేయవలసిన సంస్థ. ఇలాంటి సంస్థకు కొన్ని శతాబ్దాలుగా సాహిత్య రంగంలో నిలిచి ఉన్న తెలంగాణ చరిత్రకు వెలుగు దివ్వెగా ఉన్న మహాకవి, తెలుగులో స్వతంత్ర కావ్యం రాసిన ఆదికవి పాల్కురికి సోమనాథుడి పేరు పెట్టడం ఎంతైనా సమంజసంగా ఉంటుంది. లేకుంటే ఆ స్థాయి మహాకవి తెలుగు వారి చారిత్రక సంతకం మన నేలకే వెలుగు దివిటీ బమ్మెర పోతన పేరునైనా తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టాలి. పాల్కురికి కేవలం మహాకవి మాత్రమే కాదు. సర్వ కులాల బడుగు వర్గాల భక్తుల జీవిత భక్తి చరిత్రలు రాసిన సామాజిక చింతనాపరుడు సర్వసమతా ధర్మ ప్రతిష్ఠకు పాటు పడిన మహా సంస్కర్త. కాబట్టి పాల్కురికి సోమనాథుని పేరు తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టడమే చాలా సమంజసంగా ఉంటుంది. బమ్మెర పోతన పేరు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఇంతకాలం తర్వాత కూడా ఒక విశ్వవిద్యాలయానికి పెట్టక పోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. నల్గొండలో విశ్వవిద్యాలయం వచ్చినప్పుడు బమ్మెర పోతన పేరు పెట్టాలని నేను ప్రస్తావించాను. కాని ప్రయోజనం లేకపోయింది. 


తెలంగాణ ప్రభుత్వం నేటికైనా ఈ విషయం పైన దృష్టి సారించాలని మన గడ్డకు చిరకీర్తియైన పాల్కురికి సోమనాథుడు, బమ్మెర పోతనల పేర్లు విశ్వవిద్యాలయాలకు పెట్టాలని నేను ప్రతిపాదిస్తున్నాను. సురవరం వారి పేరు కూడా ఒక పెద్ద భాషా సాహిత్య సంస్థకు పెట్టాలి. తెలుగు విశ్వవిద్యాలయ స్థాపన నేపథ్యాన్ని క్లుప్తంగా గమనించినా ఈ విషయ ప్రాధాన్యం మనకు అర్థం అవుతుంది. 


ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 1985లో తెలుగు భాషా సాహిత్యాలు సర్వ ముఖాలుగా ఉన్న సంస్కృతీ వికాసానికి ఉద్దేశించిన తెలుగు విశ్వవిద్యాలయం. నేటికి మూడు దశాబ్దాలు దాటింది. తెలంగాణ నాది, రాయలసీమ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది అని పలికిన ఆవేశ పూరితుడైన కళాకారుడు ఎన్టీయార్ మూడు తెలుగు ప్రాంతాలలో తెలుగు విశ్వవిద్యాలయం ఉండాలనే బలమైన కాంక్షతో శ్రీశైలం, రాజమండ్రి, హైదరాబాదులో విశ్వవిద్యాలయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుదీర్ఘ కాలం జీవించవలసిన విశ్వవిద్యాలయానికి మాత్రం ఇది ఇంకా బాల్యావస్థ కావచ్చు. 


దరిమిలా తెలుగు విశ్వవిద్యాలయం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంగా పేరు మార్చుకుంది తెలుగు రాష్ట్రావిర్భావం కోసం అసువులర్పించిన మహనీయుని పేరు పెట్టుకోవడం ఆనాడు మంచి ఆహ్వానిత చర్చగా మిగిలింది. ఇతరేతర కారణాలతో ప్రాంతీయ అసమానతలకు గురైన తెలుగు జాతి అంతకు ముందున్న రెండు రాష్ట్రాల స్థితికి వెనక్కు వెళ్ళి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలుగు విశ్వవిద్యాలయం కూడా రెండుగా విడిపోయే పరిస్థితి వచ్చింది. 10వ షెడ్యూలులోనికి చేరి ఇది ఉమ్మడి జాబితాలో ఉన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయం హైదరాబాదులోను వరంగల్‌లోను ఉన్న ప్రాంగణాలు తమవే అని తెగేసి చెప్పింది. దీని ప్రధాన పాలన విభాగం హైదరాబాదులో ఉన్న కారణాన ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రాంగణాలకు వారు వేరే పరిపాలన వ్యవస్థని ఏర్పాటు చేసుకొని దాన్ని మరొక తెలుగు విశ్వవిద్యాలయంగా వ్యవస్థీకరణ చేసుకోవలసి ఉంది. అది ఇంకా పూర్తిగా జరగలేదు.


ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయానికి కొత్త బాధ్యతలు ఏర్పడ్డాయి. అది తెలంగాణ సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు, జానపదం, నాటక రంగం ఇలా బహుముఖాలుగా ఉన్న అధ్యయనాలను చేపట్టి పరిశోధనలు చేయవలసి ఉంది. ఆయా విషయాలపై పుస్తక ప్రచురణలను తేవలసి ఉంది. వినూత్నమైన కోర్సులను వివిధ విద్యలను అందించవలసి ఉంది. తెలంగాణకు తెలుగు విశ్వవిద్యాలయం ప్రత్యేకంగా ఏర్పడిన నేపథ్యంలో పేరు మార్పు తప్పని అవసరమే. 


అయితే నల్గొండలో వచ్చిన ఒక విశ్వవిద్యాలయానికి పోతన పేరు పెట్టాలని అప్పట్లో అనుకున్నప్పుడు ఒక వర్గం ప్రజలనుండి వ్యతిరేకత వచ్చింది. అది అంత పట్టించుకోవలసిన వాదం కాదు. కారణం, నాటి సామాజిక పరిస్థితులలో ప్రజల నమ్మకాల వ్యవస్థలపైన ఆధారపడి చేసిన ఆలోచనలు అందులో ఉంటాయి. బమ్మెర పోతనని కీర్తించినంత మాత్రాన భాగవతంలో ఉన్న నేటికి సరిపడని సామాజిక విలువలని పాటించమని అర్థం కాదు. పోతన గొప్పతనం దీనివల్ల కించిత్తు కూడా తగ్గదు. మహాభాగవత రచనలోని భాషాపరమైన సాహిత్యపరమైన విలువలు నేటికీ తరిగేవి కావు. ఈ నేటి కాలపు విమర్శలవల్ల నష్టం లేదు. బమ్మెర పోతన పేరు తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టడంలో ఏ మాత్రం తప్పు లేదు. 


ఇక ప్రతాపరెడ్డి వంటి ఉన్నత పరిశోధకుడి పేరును ఒక ఉన్నత పరిశోధన సంస్థకు పెట్టవచ్చు. తెలంగాణలో అత్యున్నత పరిశోధన సంస్థ ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్స్ లైబ్రరీ అండ్ రీసెర్చి సెంటర్ ఉంది దానికి ప్రతాపరెడ్డి పేరు పెట్టవచ్చు. లేదా కొత్తగా వచ్చిన మరొక విశ్వవిద్యాలయానికి కూడా పెట్టవచ్చు. తెలుగు విశ్వవిద్యాలయానికి పాల్కురికి సోమన, బమ్మెర పోతన తెలుగు విశ్వవిద్యాలయం అనడం కన్నా మంచి పేర్లు ఉంటాయని నేను అనుకోను. తెలంగాణ వ్యక్తిగా తెలుగు పరిశోధకుడుగా నేనీ ప్రతిపాదన చేస్తున్నాను. దీన్ని తెలంగాణ ప్రభుత్వం వారు ఆమోదించాలని కూడా వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను.

ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి

ద్రావిడ విశ్వవిద్యాలయం

Updated Date - 2021-01-27T06:54:10+05:30 IST