ఆహ్లాదకరంగా పెనుబల్లి పల్లెప్రకృతివనం

ABN , First Publish Date - 2021-04-18T05:11:21+05:30 IST

పెనుబల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఆహ్లాదకరమైన వాతావరణంలో పల్లెప్రకృతివనాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు తీర్చిదిద్దారు.

ఆహ్లాదకరంగా పెనుబల్లి పల్లెప్రకృతివనం
వనంలో ఏర్పాటుచేసిన వాకింగ్‌ ట్రాక్‌

సుందరంగా తీర్చిదిద్దిన అధికారులు, ప్రజాప్రతినిధులు 

 వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు

పెనుబల్లి, ఏప్రిల్‌ 17: పెనుబల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఆహ్లాదకరమైన వాతావరణంలో పల్లెప్రకృతివనాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు తీర్చిదిద్దారు. సుమారు 15కుంటల స్థలంలో ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన రూ.రెండున్నరలక్షలతో ఈ వనాన్ని ఏర్పాటుచేశారు. చుట్టూ పండ్లు, పూలమొక్కలను నాటడమేకాకుండా సుమారు 200మీటర్ల వాకింగ్‌ ట్రాక్‌ను ఏర్పాటుచేశారు. అలాగే వనం చుట్టూ పెన్సింగ్‌తోపాటు మొక్కలకు నీళ్లు పెట్టేందుకు పైపులైన్లు, అలాగే కూర్చోనేందుకు బల్లలు కూడా ఏర్పాటుచేశారు. దాతల సహకారంతో సర్పంచ్‌ తావునాయక్‌, ఉపసర్పంచ్‌ పానెం నాగేశ్వరరావుతోపాటు కార్యదర్శి భావన వనం ఏర్పాటుకు కృషిచేశారు. వనం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే సండ్రతోపాటు అధికారులు మంత్రముగ్ధులై వనం ఫొటోలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. మండల కేంద్రంలో ఈ తరహా వనాన్ని ఏర్పాటుచేయటంతో దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అనేక గ్రామాల్లో ఇదే తరహాగా ఏర్పాటుచేసేందుకు పలు పంచాయతీల అధికారులు, ప్రజాప్రతినిధులు సన్నాహాలు చేసుకుంటున్నారు. పలువురు దాతల సహకారంతో వనంలో జాతీయ జెండాను ఏర్పాటుచేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వం నుంచి మంజూరైన నిధులను సద్వినియోగం చేసుకొని ఈ తరహా వనాన్ని నిర్మించటంతో తలమానికంగా నిలిచింది.


Updated Date - 2021-04-18T05:11:21+05:30 IST