పాలమూరు కోల్పోయిన పసిడి బిడ్డలు

ABN , First Publish Date - 2020-06-24T05:52:01+05:30 IST

ఎంతచెడ్డ బతుకు! ఆత్మీయ మిత్రులు అసువులు బాసినా, ఆ విగత జీవుల గుండెలపై బడి రోదించి మనస్సు బరువు దించుకోవడానికి, సంబంధీకులను అక్కున చేర్చుకొని అశ్రునయనాలతో...

పాలమూరు కోల్పోయిన పసిడి బిడ్డలు

ప్రజల శ్రేయస్సుకు అంకితమైన ఇరువురు పాలమూరు బిడ్డలు ఇటీవల కీర్తిశేషులయ్యారు. బహుముఖ ఉద్యమకారుడు, కవి, గాయకుడు, రచయిత అయిన జి.అంపయ్య నడిగడ్డ ప్రాంతం గద్వాల జోగులాంబ జిల్లాగా ఆవిర్భవించేందుకు నిర్వహించిన పోరాటం అవిస్మరణీయమైనది. గుండె శస్త్ర చికిత్సలో కీలకమైన పర్ఫ్యూజన్‌ టెక్నాలజీలో నిపుణుడైన కేశవరం మధుసూదనరావు ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పర్ఫ్యూజన్‌ టెక్నాలజీ’ అన్న కోర్సుకు రూపకల్పనచేసి దానిని ‘నిమ్స్‌’ లో ప్రవేశపెట్టడానికి కృషి చేశారు.


నివాళి : కేశవరం మధుసూదన రావు,  జి. అంపయ్య

ఎంతచెడ్డ బతుకు! ఆత్మీయ మిత్రులు అసువులు బాసినా, ఆ విగత జీవుల గుండెలపై బడి రోదించి మనస్సు బరువు దించుకోవడానికి, సంబంధీకులను అక్కున చేర్చుకొని అశ్రునయనాలతో వారిని ఓదార్చడానికి అవకాశం లేని కరోనా కాలం ఎంత చెడ్డది! ఈ కష్టకాలంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు, తమ శ్రేయస్సుకు పనిచేసే ఇద్దరు మానవీయ కార్యకర్తలను కోల్పోయినప్పుడు ఇలా నాలానే శోకించి ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఆ ఇద్దరిలో ఒకరు ప్రగతిశీల ఉపాధ్యాయ సంఘం (డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్) రాష్ట్ర అధ్యక్షునిగా ఉమ్మడి రాష్ట్రంలోనే ఉపాధ్యాయ లోకానికి సేవలందించిన జి. అంపయ్య. మరొకరు, 1976లో (దక్షిణ భారతదేశపు ప్రముఖ హృద్రోగ నిపుణుడుగా పేరుగాంచిన డా.రాజగోపాలన్ నేతృత్వంలో) హైదరాబాదులో మొట్టమొదటి ఓపెన్ హార్ట్‌సర్జరీని విజయవంతంగా నిర్వహించిన వైద్యబృందంలో సభ్యుడు కేశవరం మధుసూదన రావు. ఈ ఇద్దరూ మానవీయతకు ఆలవాలమయిన పాలమూరు గడ్డపై జన్మించిన బిడ్డలే.


రాష్ట్ర పరిపాలనా రంగం పునర్ వ్యవస్థీకరణలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పాటుచేస్తున్నప్పుడు కారణాంతరాల వల్ల గద్వాల ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించడానికి కేసీఆర్ ప్రభుత్వం తొలుత వెనుకాడింది. ఆ సమయంలో నడిగడ్డ ప్రాంతం వివక్షకు గురయితే సహించేదిలేదని ముందుకు వచ్చి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు అంపయ్య. ఆ దీక్ష ప్రజాసమీకరణకు బహువిధాల తోడ్పడింది. పోలీసులు అరెస్టుచేసి ఆసుపత్రికి తరలించినా తన దీక్ష ఆపే ప్రసక్తి లేదని ప్రకటించిన ధీరుడు అంపయ్య. నడిగడ్డను గద్వాల జోగులాంబ జిల్లాగా ప్రకటించేంత వరకు వివిధ రూపాలలో తన పోరాటాన్ని కొనసాగించిన ఘనత అంపయ్యది. ఉమ్మడి పాలమూరు జిల్లా జనాభా లో అధిక శాతం శ్రామిక జనమే. పాలమూరు అనగానే దేశవిదేశాలలో వెంటనే గుర్తుకు వచ్చేది పాలమూరు లేబర్. చాలా కాలంగా ఆ లేబర్ సమస్య ఎవరికీ పట్టని విషయంగా మిగిలిపోయి ఉండింది. ‘పాలమూరు లేబర్’ నే ప్రధాన అంశంగా ఎంచుకొని 1980 వ దశకం ప్రారంభంలో విప్లవ రచయితల సంఘం గద్వాలలో మహాసభలు నిర్వహించింది. ఆనాడు అంపయ్య విరసం జిల్లా కార్యదర్శి. ఆ సభల నుండే పాలమూరు లేబర్ జాతీయ సమస్యల ఎజెండా లోకి చేరింది. ఆంధ్రప్రాంతానికే పరిమితమయిన ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తెలంగాణలో విస్తరిస్తున్న తొలినాళ్లలోనే ఆ సంస్థను పాలమూరు జిల్లాలో స్థాపించి దాని వ్యవస్థాపక అధ్యక్షునిగా గట్టి పునాదులు వేసి, తదుపరి రాష్ట్ర స్థాయిలో ఏర్పడిన పరిణామాల దృష్ట్యా డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్‌లో చేరి, ఆ సంస్థ రాష్ట్రాధ్యక్షునిగా ఎదిగిన ఉద్యమ చరిత్ర అంపయ్యది. ఆ ఉద్యమ ప్రస్థానంలో భాగంగానే డిటిఎఫ్ తరఫున నిజామాబాద్, మెదక్, కరీంనగర్ శాసనమండలి స్థానం నుండి 2007 లో జరిగిన ఎన్నికలలో ఉపాధ్యాయ ఎంఎల్‌సి గా పోటీ చేశారు. 


గద్వాల జిల్లా కోసం మాత్రమే కాకుండా కృష్ణానది నీళ్లలో న్యాయమైన వాటా కోసం ‘పాలమూరు అధ్యయన వేదిక’ జరుపుతున్న సుదీర్ఘ పోరాటంలో అంపయ్యది విడదీయరాని చరిత్రే! 1969 లో జరిగిన ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న అంపయ్య ‘1969 తెలంగాణ ఉద్యమకారుల సంఘం’లో ఉమ్మడి పాలమూరు జిల్లా కన్వీనర్. ‘స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్, తెలంగాణ’ సీనియర్ ఉపాధ్యక్షుడు. ఈ విధంగా బహుముఖ ఉద్యమకారుడయిన అంపయ్య కవి, గాయకుడు, రచయిత కూడా. ఆయన తన కవితల పుస్తకం ఒకదానిని ప్రజాయుద్ధ నౌక గద్దర్‌కు అంకితమిచ్చాడు. ‘మరో ఝంఝ’ అన్న పుస్తకంలో అచ్చయిన అంపయ్య కవితను ప్రఖ్యాత సాహితీ విమర్శకుడు కె.వి.రమణా రెడ్డి ఆంగ్లంలోకి అనువాదం చేసాడు. విప్లవ కవి శివసాగర్ పాటలను అంపయ్య తన్మయత్వంతో తన గొంతులో పలికిస్తుంటే, శ్రోతలు మంత్రముగ్ధులై వినేవారు.


ఇటీవలి కాలంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లా కోల్పోయిన మరో ఆణిముత్యం కేశవరం మధుసూదన రావు. గుండెకు శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు ఆపరేషన్ చేసే సర్జన్ ఎంత ముఖ్యమో, ఆ సమయంలో గుండెను, ఉపిరితిత్తులను సజీవంగా ఉంచే పర్ఫ్యూజనిస్టు అంతే ముఖ్యం. న్యూ ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ప్రత్యేక శిక్షణ పొంది పర్ఫ్యూజన్‌ రంగానికి హైదరాబాద్‌లో పాదులు నాటినవాడు మధుసూదన్. దేశంలో ఎక్కడా పర్ఫ్యూజన్‌కు రూపురేఖలు లేని దశలో ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పర్ఫ్యూజన్‌ టెక్నాలజీ’ అన్న కోర్సుకు రూపకల్పనచేసి దానికి ప్రభుత్వం నుండి అనుమతులు పొంది, నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్ లో ప్రవేశపెట్టడానికి కృషి చేసిన ప్రముఖుల్లో ముఖ్యులు మధుసూదన్‌ రావు. 


మధుసూదన్ రావు తన యవ్వన కాలం నుండి తెలుగునాట జరిగిన అన్ని ప్రగతిశీల ఉద్యమాలలో చురుకుగా పాల్గొనేవాడు. 1969 తెలంగాణ ఉద్యమంలో మర్రి చెన్నారెడ్డితో విభేదించి పోటీ ప్రజాసమితి నెలకొల్పిన శ్రీధర రెడ్డితో కలిసి పనిచేసిన అభ్యుదయవాది కేశవరం. ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ప్రారంభమయిన తొలిరోజులలో పత్తిపాటి వెంకటేశ్వర్లు కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆయనకు చేదోడువాదోడుగా ఉంటూ సంఘ కార్యకలాపాలలో పాలుపంచుకొనేవాడు. ‘జీవనాడి’ పత్రిక నిలదొక్కుకోవడంలో తనవంతు పాత్ర పోషించాడు. కేన్సర్‌తో ఇటీవలే మననుండి దూరమయిన మధుసూదన్‌రావుకు నివాళులర్పిస్తూ సీనియర్ జర్నలిస్ట్ ఎన్ వేణుగోపాల్ ఉదాహరించినట్టుగా మధు కుడిచేతితో చేసిన సహాయం ఎడమచేతికి తెలియనట్టుగా మిత్రులకు, ఉద్యమాలకు తోడ్పాటునందించేవాడు.


ఈ ఇద్దరి జీవితాలలో చాలా సారూప్యత ఉంది. అం పయ్య సామాజిక కార్యక్రమాలలో తలమునకలయి వివా హం కూడా చేసుకోలేదు కానీ, ఒక పేదింటి అమ్మాయిని పెంచుకొని ఆ అమ్మాయి జీవితంలో వెలుగులు ప్రసరించేలా తగు ఏర్పాట్లు చేసాడు. జి.అంపయ్య, కేశవరం మధుసూదన్ రావు లు కొద్ది కాలం తేడాతోనే మరణించ డం పాలమూరు జిల్లాలో సామాజిక శక్తులకు తీరని లోటు.

రాజేంద్ర బాబు అర్విణి

పాలమూరు అధ్యయన వేదిక

Updated Date - 2020-06-24T05:52:01+05:30 IST