ఆ కేటగిరీ ప్రవాసుల Work Permit వివాదం.. PAM Director General పై వేటు!

ABN , First Publish Date - 2021-10-17T13:40:51+05:30 IST

డైరెక్టర్ జనరల్ ఆఫ్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) అహ్మద్ అల్ మౌసాను మంత్రి పదవి నుంచి తొలగించారు.

ఆ కేటగిరీ ప్రవాసుల Work Permit వివాదం.. PAM Director General పై వేటు!

కువైత్ సిటీ: డైరెక్టర్ జనరల్ ఆఫ్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) అహ్మద్ అల్ మౌసాను మంత్రి పదవి నుంచి తొలగించారు. ప్రవాసుల వర్క్ పర్మిట్ల రెన్యూవల్‌కు సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అయిన నేపథ్యంలో దర్యాప్తు కమిటి ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది ఆగస్టులో యూనివర్శిటీ డిగ్రీ లేని 60ఏళ్లకు పైబడిన ప్రవాసులకు వర్క్ పర్మిట్ల రెన్యూవల్‌ను నిలిపివేస్తూ డైరెక్టర్ జనరల్ నిర్ణయం తీసుకున్నారు. అయితే, గత వారం ఫత్వా, లెజిస్లేషన్ కమిటీ ఈ నిర్ణయం చట్టవిరుద్ధమని పేర్కొంది. ఈ కేటగిరీ ప్రవాసులకు వర్క్ పర్మిట్‌లను జారీ చేయడం నిషేధించడానికి ఎలాంటి చట్టపరమైన ఆధారం లేదని స్పష్టం చేసింది.


2020 ఆగస్టులో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ డైరెక్టర్ జారీ చేసిన నిర్ణయం చట్టబద్ధంగా ఉనికిలో లేదని, అసలు పీఏఎం డైరెక్టర్‌కు ఈ నిర్ణయం తీసుకునే అధికారం కూడా లేదని వెల్లడించింది. వర్క్ పర్మిట్ల జారీకి సంబంధించి ప్రత్యేకమైన నియమాలు, విధానాలు ఉన్నాయని పేర్కొంది. 60 ఏళ్లకు పైబడిన, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసులకు వర్క్ పర్మిట్ల జారీని నిలిపివేయడం చట్టబద్ధంగా చెల్లదని, వెంటనే ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని ఆదేశించింది. దీంతో ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకున్న పీఏఎం డైరెక్టర్ జనరల్‌పై వేటు పడింది. 


ఇక డైరెక్టర్ జనరల్ తీసుకున్న ఈ నిర్ణయంతో వేలాది మంది ప్రవాసులు తమ వర్క్ పర్మిట్లు రెన్యూవల్ కాకపోవడంతో కువైత్ నుంచి వెళ్లిపోయారు. ఈ నిబంధన అమలు చేసిన మొదటి ఆరు నెలల్లో సుమారు 4వేలకు పైగా మంది ప్రవాసులు కువైత్ వదిలి వెళ్లినట్లు సమాచారం. ఇదిలాఉంటే.. త్వరలోనే 60 ఏళ్లకు పైబడిన, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసులకు వర్క్ పర్మిట్ల పునరుద్ధరణ ప్రారంభం కానుందని సమాచారం. కాగా, 2017లో తీసుకువచ్చిన కువైటైజేషన్‌ పాలసీలో భాగంగానే కువైత్ ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లలో విదేశీయులను తగ్గించి దేశ పౌరులకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఏకైక లక్ష్యంతో తీసుకొచ్చిందే కువైటైజేషన్‌ పాలసీ.    

Updated Date - 2021-10-17T13:40:51+05:30 IST