600 కోట్ల పెట్టుబడి.. 600 ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో మరో జపాన్ కంపెనీ తన ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేస్తోంది. విద్యుత్ ఉపకరణాల తయారీ కోసం పానాసోనిక్ కార్పొరేషన్ అనుబంధ కంపెనీ ‘పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్’ కంపెనీ ఈ కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం సోమవారం భూమి పూజ కార్యక్రమం జరిగినట్టు కంపెనీ తెలిపింది. రెండు దశల్లో నిర్మించే ఈ ప్లాంట్ తొలి దశ వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తుంది. దాదాపు 600 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే ఈ ప్లాంట్ కోసం కంపెనీ రూ.600 కోట్లు ఖర్చు చేయబోతోంది. ఇందులో తొలి దశ కోసం రూ.294.7 కోట్లు వెచ్చించనుంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఏర్పడుతున్న వ్యాపార అవకాశాల్ని దృష్టిలో ఉంచుకుని శ్రీసిటీలో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు కంపెనీ ఎండీ టెట్సుయసు కవమొటో తెలిపారు.పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్‌కి భారత్‌లో ఇది ఎనిమిదో ఉత్పత్తి యూనిట్.