పంచ భ్రమలు

ABN , First Publish Date - 2020-06-26T07:52:17+05:30 IST

మాయ ప్రభావం వల్ల జనించిన అజ్ఞానంతో వస్తువుల నిజస్వరూపాలను గుర్తించలేక వేరే విధంగా భావించడమే భ్రమ.

పంచ భ్రమలు

మాయ ప్రభావం వల్ల జనించిన అజ్ఞానంతో వస్తువుల నిజస్వరూపాలను గుర్తించలేక వేరే విధంగా భావించడమే భ్రమ. ఆత్మ విచారణలో భ్రమలు ఐదు రకాలు. వాటిని పంచ భ్రమలు అంటారు. శాస్త్ర దృష్టితో నిశితంగా పరిశీలించి భ్రమలను నివృత్తి చేసుకోవాలి. అలా చేస్తే ఆత్మతత్వ విద్య సంపూర్ణంగా సాధించబడుతుంది. 


జీవుడు, ఈశ్వరుడు (దేవుడు) భిన్న రూపాలనుకోవడం మొట్టమొదటి భ్రమ. బింబ ప్రతిబింబాలకు భేదం కనపడినట్టుగానే.. అజ్ఞానంలో ఉన్నవారికి ఈశ్వర రూపం కన్నా, దాని ప్రతిబింబమైన జీవరూపం వేరుగా కనిపిస్తుంది. అందువల్ల జీవేశ్వరులు ఏకరూపులు కారనిపిస్తుంది. కాబట్టిభ్రాంతి రూపాన్ని మిథ్యగా నిశ్చయించుకోవాలి. అందుకే ఛాందోగ్యోపనిషత్తులో ‘‘తత్వమసి’’ అని చెప్పబడింది. ఈ పదం జీవేశ్వరుల ఏకత్వాన్ని బోధించి, భేద భ్రమను తొలగిస్తూ ఉంది. 


ఇక, స్వస్వరూపమైన ఆత్మ.. కర్తృత్వాదులు కలిగి ఉన్నదనడాన్ని కర్తృత్వ భ్రమ అంటారు. ‘‘నేను చూస్తున్నా, వింటున్నా, అనుభవిస్తున్నా’’ అనే బుద్ధి ఉండడం వల్ల.. కర్తృత్వ భోక్తృత్వాలను ఆత్మ కలిగి ఉన్నట్లనిపిస్తుంది. కానీ! అది నిజం కాదు. శుద్ధస్ఫటికం తెలుపు రంగును, ఎర్రనివస్త్రం ఎరుపురంగును కలిగి ఉంటాయి. ఆ వస్త్రానికి సమీపంలో స్ఫటికాన్ని ఉంచితే అది కూడా ఎర్రగా కనబడుతుంది. నిజానికి స్ఫటికం ఎర్రనిది కాదు. వస్త్రం వల్ల అలా కనిపిస్తోంది. అంటే అది భ్రాంతి. ఆత్మ విషయంలో కూడా అంతే. ఆత్మ అయిన తాను కర్తృత్వ, భోక్తృత్వరహితమని స్ఫటిక, వస్త్రముల పరిశీలన ద్వారా ఎవరికివారు తెలుసుకోవాలి. ఇలా తెలుసుకొన్న తరువాత ఆత్మలో కర్తృత్వ భోక్తృత్వాలు ఉన్నాయనేభ్రాంతి తొలగిపోతుంది.


ఆత్మ అయిన తాను స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలనబడే మూడు శరీరాలతో సంబంధం కలిగి ఉన్నాననుకోవడం మూడో భ్రమ. దానినే సంగమ భ్రమ అంటారు. జీవుడు సంఘాది రూపమైన ఉపాధి కలవాడైనందున వాటిలో కూడా ప్రకాశిస్తాడు. కానీ అశాశ్వతాలైన దేహాలు, జనన, మరణాలు.. ఆత్మను స్పృశించలేవు. ‘అసంగోహ్యం పురుషః’ అనే బృహదారణ్యోపనిషత్తు ప్రయోగం ప్రకారం ఆత్మకు సంగమం నిషేధింపబడింది. అందువల్ల శరీరత్రయంతో కూడి ఉన్నప్పటికీ ఆత్మ అయిన తాను అసంగమమై ఉన్నాడని తెలుస్తుంది.


‘‘జగత్కారణ రూపస్య వికారిత్వం చతుర్థకం’’ అనే శ్లోక వాక్యం ప్రకారం.. ఈశ్వరుడే ఈ జగత్తుకు కారణం. అలాగని.. పాల వికారం పెరుగైనట్టు ఈశ్వరుడు కూడా ఈ జగత్తుగా వికారిత్వం చెందినట్టు  కాదు. దీనికి ఉపనిషత్తు చెప్పిన సమాధానం.. ‘కనక రుచక దర్శనేన వికారిత్వ భ్రమో నివృత్తః’.. అని! బంగారంతో తయారుచేసిన ఆభరణంలో ఉండేది బంగారమే. ఆభరణం లేక ముందూ బంగారం ఉంది. ఆభరణం కరిగించాక కూడా బంగారం ఉంది. ఆభరణమనేది దాని నామం మాత్రమే. అలాగే, ఈశ్వరుడే ఈ నామరూపాత్మకమైన జగత్తులా కనిపిస్తున్నాడు తప్ప జగత్తులా వికారిత్వం చెందలేదు. ఇక, చివరిది.. ఈ జగత్తంతా సత్యమేనన్న భ్రమ. ఇది రజ్జు-సర్ప (తాడు-పాము) భ్రాంతి లాంటిది. ఉన్నది తాడేనని (శుద్ధ చైతన్యం).. పాము (జగత్తు) కాదని తెలుసుకుంటే ఆ భ్రమ తొలగిపోతుంది.



- విద్వాన్‌ వల్లూరు చిన్నయ్య, 99483 48918

Updated Date - 2020-06-26T07:52:17+05:30 IST