ముగిసిన పంచాయతీ పోరు

ABN , First Publish Date - 2021-02-23T06:19:55+05:30 IST

పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మొత్తం నాలుగుదశల్లో ఈ ఎన్నికలను నిర్వహించారు.

ముగిసిన పంచాయతీ పోరు

నాలుగు దశల్లో నిర్వహణ 

206 ఏకగ్రీవం, 804చోట్ల ఎన్నికలు

82.99శాతం పోలింగ్‌ 

ఓటుహక్కు వినియోగించుకున్న 14,21,44 మంది

స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతం

ఊపిరిపీల్చుకున్న యంత్రాంగం

ఒంగోలు, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి) : పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మొత్తం నాలుగుదశల్లో ఈ ఎన్నికలను నిర్వహించారు. చివరి విడత ఎన్నికలు ఆదివారం జరగ్గా లెక్కింపు ప్రక్రియ సోమవారం తెల్లవారుజాముకు పూర్తయింది. అధికార పార్టీ మార్క్‌ బెదిరింపు వ్యవహారాలు ఎన్నికలపై కనిపించాయి. అయితే స్వల్ప ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. జిల్లాలో  మొత్తం 56 మండలాల్లో 1,046 పంచాయతీలు ఉన్నాయి. కోర్టు ఆదేశాలు ఇతరత్రా వివిధ కారణాలతో 35  చోట్ల ఎన్నికలు నిలిచిపోయాయి. కందుకూరు మండలం నరిశెట్టివా రిపాలెంలో నామినేషన్ల అనంతరం గ్రామస్థులు సామూహి కంగా ఎన్నికలు బహిష్కరించి అభ్యర్థులంతా ఉపసంహ రించుకోవడంతో ఎన్నిక ఆగిపోయింది. ఇక చీరాల మండలం మినహా మిగిలిన 55మండలాల్లోని 1,010 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు. వాటిలో 206చోట్ల సర్పంచ్‌లు ఏకగ్రీవం కాగా, మిగిలిన 804చోట్ల ఎన్నికలు జరిగాయి. 


భారీ పోలింగ్‌.. 

ఎన్నికలు జరిగిన 804 పంచాయతీల్లో మొత్తం 17,17,315 మంది ఓటర్లు ఉండగా 14,21,44 (82.99శాతం) మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. తొలివిడత 14 మండలాల్లో ఏకగ్రీవాలుపోను 192 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా 80.47శాతం పోలింగ్‌ నమోదైంది. రెండో విడత ఎన్నికలు జరిగిన 14 మండలాల్లో 208 పంచాయతీల్లో 86.60శాతం, మూడో విడత 15 మండలాల్లోని 236 పంచాయతీల్లో 82.42శాతం, చివరి విడత  12 మండలాల్లోని 168 పంచాయతీల్లో 82.04శాతం ఓటింగ్‌ జరిగింది. వలస ఓటర్లు కూడా తరలివచ్చి ఓటు వేశారు.


ప్రశాంతంగా ఎన్నికలు

జిల్లాలో ఈసారి పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగానే జరిగాయి. పెద్దసంఖ్యలో సమస్యాత్మక, తీవ్ర సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉండగా తగుస్థాయిలోనే భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పోలింగ్‌ నిర్వహించారు. అదేసమయంలో మారిన పరిస్థితులు, ప్రజల్లో చైతన్యం ఇతరత్రా కారణాలతో అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఘర్షణలకు దూరంగానే ఉన్నారు. అక్కడ క్కడా అధికారపార్టీ ఒత్తిళ్లు, దౌర్జన్యపూరిత వైఖరితో  కొన్నిచోట్ల ఉద్రిక్తతలు మినహా ప్రశాంతంగానే సాగాయి. దీంతో యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. అదే సమయంలో ఏకగ్రీవాల కన్నా ప్రజాస్వామ్య స్ఫూర్తితో పోటీలకే అభ్యర్థులు మొగ్గు చూపగా పెద్దసంఖ్యలో ఓటర్లు పోలింగ్‌లో పాల్గొని మద్దతు తెలిపారు. అయితే చాలాచోట్ల ఓట్ల కొనుగోలు భారీగా జరగడం, కొన్ని చోట్ల ఓటు రూ.10వేల నుంచి 15వేల వరకు పలకడం విచారకరం.



పంచాయతీ ఎన్నికల వివరాలివి

జిల్లాలో మొత్తం పంచాయతీలు : 1,046

వివిధ కారణాలతో ఎన్నికలు నిలిచినవి: 35

ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చినవి: 1,011

ఒక్క నామినేషన్‌ కూడా లేక ఎన్నిక ఆగినవి : 1 (నరిశెట్టివారిపాలెం)

సర్పంచ్‌లు ఏకగ్రీవమైన పంచాయతీలు: 206

ఎన్నికలు జరిగిన పంచాయతీలు: 804

వాటిలో ఓటర్ల సంఖ్య: 17,17,315

ఓటింగ్‌లో పాల్గొన్న వారు : 14,21,444

పోలింగ్‌ నమోదు: 82.99శాతం 


Updated Date - 2021-02-23T06:19:55+05:30 IST