పంచవర్ణాల ‘పరిపూర్ణ’ జీవితం

ABN , First Publish Date - 2022-08-21T06:01:51+05:30 IST

నంబూరి పరిపూర్ణ జీవితం అరుదైనది, అర్థవంతమైనదీ. లిబరల్ సెక్యులర్‌ సోషలిస్ట్ దళిత మహిళా స్రవంతుల ప్రయాణాలకు సంబంధించిన కొన్ని విలువైన అనుభవాల మూట...

పంచవర్ణాల ‘పరిపూర్ణ’ జీవితం

నంబూరి పరిపూర్ణ జీవితం అరుదైనది, అర్థవంతమైనదీ. లిబరల్ సెక్యులర్‌ సోషలిస్ట్ దళిత మహిళా స్రవంతుల ప్రయాణాలకు సంబంధించిన కొన్ని విలువైన అనుభవాల మూట. గూడవల్లి రామబ్రహ్మం నుంచి గుర్రం జాషువా దాకా ఎంతోమందితో వైవిధ్యభరితమైన అనుభవాలున్న వైడ్ కాన్వాస్ ఆమె జీవితం. 


ఆమె ఆత్మకథ చదువుతున్నపుడు భలే అనిపించింది. కొన్ని చోట్ల భళిరా అనిపించింది. చరిత్ర పుస్తకాల్లో మాత్రమే సాధ్యమయ్యే మనిషి మన మధ్యనే ఉన్నట్టు అనిపించింది. 1941లో భక్త ప్రహ్లాద సినిమాలో (ఎస్వీ రంగారావు ఫేమ్ 1967 భక్త ప్రహ్లాద కాదు. 1931 నాటి తొలి టాకీ భక్త ప్రహ్లాద కూడా కాదు. పరిపూర్ణ నటించిన శోభనాచల పిక్చర్స్ వారి భక్త ప్రహ్లాద– 1942లో విడుదలైంది) ప్రహ్లాదుడిగా నటించిన మనిషి ఆమె. జి.వరలక్ష్మి పెద్ద ప్రహ్లాదుడైతే ఈమె చిన్న ప్రహ్లాదుడు. జి. వరలక్ష్మి గోరుముద్దలు తిని పెరిగిన బాల్యం. దామెర్ల రామారావు కళాసృష్టిలో భాగమైన ఆయన భార్య సత్యవాణి పరిపూర్ణ గారికి డ్రాయింగ్ టీచర్.


డిగ్రీ రోజుల్లో నేను దర్శి చెంచయ్య గురించి గదర్ ఉద్యమం గురించి చదివి ఉన్నా. నా వరకు ఆయన చరిత్ర. అట్లాంటి దర్శి చెంచయ్య ఇంట కొంతకాలం ఉండి ఆయన ప్రేమాభిమానాలు పుష్కలంగా పొంది, ఆయన పిల్లలతో పాటుగా చదువుకున్న వ్యక్తి పరిపూర్ణ. దర్శి చెంచయ్యతో పాటు కడలూరు జైల్లో ఉన్న దగ్గరి స్నేహితుడు నంబూరి శ్రీనివాసరావు పరిపూర్ణ అన్నయ్య. ఆమెను చదివిన తర్వాతే చెంచయ్య, జాషువా ఇంత దగ్గరి కాలం వారా అనిపించింది. అట్లాంటి చారిత్రక పాత్రలను రక్తమాంసాలతో రిలేట్ చేసుకునే అవకాశమిచ్చారు పరిపూర్ణ.


పరిపూర్ణ జీవితం దానికదే ప్రత్యేకమైనది. ‘మా నాయన నంబూరి లక్ష్మయ్య, అమ్మ లక్ష్మమ్మలు బతుకుదెరువు కోసం బొమ్ములూరు చేరారు. ఒక గ్రాంటు స్కూలును నెలకొల్పుకున్నారు’ అని రాశారు పరిపూర్ణ. ‘మాలపల్లికి కుడి వైపున సౌత్ ఇండియన్ చర్చి బడి, ఎడమవైపున కేథలిక్ శాఖ బడి. నా చదువు నాలుగవ తరగతి వరకూ చర్చిబడిలో సాగింది’ అని కూడా. ఎప్పటి సంగతులివి. 1930కి ముందు వెనుక సంగతులు. ‘ఆ నాటి బ్రిటీష్ పాలకులు గ్రామాల్లో అక్షరాస్యత కల్పించే సదుద్దేశంతోనేమో బొత్తిగా విద్యా వికాసాలు లేని మాల మాదిగ పల్లెల్లో గ్రాంటు స్కూళ్ల పేర ఎలిమెంటరీ స్కూళ్లు ప్రారంభించారు’ అని నేపథ్యం ఇచ్చారు పరిపూర్ణ. ఈ పరిణామం గురించి కల్యాణ్ రావు తన అంటరాని వసంతంలో సుదీర్ఘంగా వివరించి ఉన్నారు.


అలాగే బ్రహ్మసామాజికుడైన పిఠాపురం రాజా గురించి ‘కులమత ప్రాంతాల ప్రస్తావన అన్నది అసలేమాత్రం ఉండకపోవడంతో పిల్లల మనుగడ ఎలాంటి విభేద వివక్షతలకు తావులేకుండా కొనసాగుతూ ఉండేది. ఈ పిల్లలకు ఏకేశ్వరోపాసన తప్ప కులమతాల గురించి తెలీదు’ అని సానుకూలంగా రాసుకొచ్చారు. బ్రిటీషు వారి పాలనలో ఉండిన కోస్తా తీరం ఆనాడు అనేకానేక ప్రయోగాలకు కార్యశాల. బ్రిటీష్ వారి ఆధునిక చట్టాలు, కిందనుంచి పోరాటాలు పైనుంచి అభ్యుదయ భావాలున్న వారి ప్రయోగాలు నేలను కదలబార్చిన కాలం. బహుశా వ్యవస్థ అంతకుముందున్న దశ నుంచి మరో దశలోకి ప్రయాణిస్తున్న కాలం. 


1931లో సాపేక్షంగా మధ్యతరగతికి చెందిన మాలదాసర్ల కుటుంబంలో పుట్టిన పరిపూర్ణ, తన తాతలు అప్పటికే కవులుగా ప్రసిద్ధి పొంది ఉన్నారని రాశారు. మాల కులంలో ఈ దాసరి శాఖకు సంబంధించిన వైష్ణవ మూలాలను, రామానుజుల ఉద్దేశ్యాలను పూర్తి సానుకూల దృక్పథం నుంచి రాశారు పరిపూర్ణ. ‘మేం కులరీత్యా దళితులం. మతరీత్యా వైష్ణవులం–. సింపుల్‌గా దాసుళ్లు అంటారు మమ్మల్ని. ఈ కుటుంబాల మగవారి వృత్తి పౌరోహిత్యం. పంచాంగం చెప్పడం, ఆయుర్వేద వైద్యం చేయడం అనుబంధ వృత్తులు. ఇరవయ్యో శతాబ్దపు సగకాలం వరకూ పల్లె ప్రాంతాల చిన్నస్థాయి శూద్రకుటుంబాల్లో శుభాశుభ కర్మలన్నింటిని జరిపిస్తూ ఉండినది ఈ దాసరులే. మంగలి, కుమ్మరి, గొల్ల, చాకలి మొదలైన కులాల కర్మాకర్మలన్నీ వీరి చేతులమీదుగానే జరుగుతుండేవి’. దీన్ని భిన్నకోణాలనుంచి అర్థం చేసుకోవచ్చు. దళితుల్లో ఆ కాలంలో వేగవంతమైన ఈ ప్రక్రియ ఎట్లా కొంతమందిని న్యూనత నుంచి బయటపడేసి తమ సమూహంలోనే కులీనులుగా మార్చింది అనేది చూడొచ్చు. బ్రాహ్మణీకరణ అనండి, లేదా అంతరాల సృష్టి అనండి, లేదా ఆధిపత్య సృష్టి అనండి అదెట్లా ఒక సమూహంలో జరుగుతుంది అనేది తెలుసుకోవచ్చు.


ఆమెను చిన్ననాట తన పిల్లలతో పాటే ఉంచి స్కూళ్లలో చేర్పించి చదివించిన దర్శి చెంచయ్య గానీ, ఆమెకు ఆసరాగా నిల్చిన గోవిందన్నయ్య గానీ, మహీధర రామమోహనరావు సోదరులు గానీ వీళ్ళంతా వాడుకలో చెప్పుకుంటే అగ్రవర్ణాలే. 90 ఏళ్లక్రితం మాలదాసర్ల కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయిని, కమ్యూనిస్టు కుటుంబంలో భాగమైన అమ్మాయిని నాటి నాయకులు, సాహితీవేత్తలు అక్కున చేర్చుకున్న దృశ్యం అబ్బురంగా ఉంటుంది. దర్శి చెంచయ్య నుంచి గోవిందన్నయ్య దాకా– ఎవరు వీళ్లంతా... ఆదర్శాల కోసం జీవితాన్ని అర్పించిన వారు. అదే సమయంలో కులపరమైన ఈసడింపు ఆచరణలో చూపిస్తూ నిన్ను చేసుకోకుండా ఫలానా సంబంధం చేసుకుంటే ఫలానా కట్నం మిగిలేది అన్నట్టు పరిపూర్ణ చెప్పిన జీవిత సహచరుడు కూడా కమ్యూనిస్టు నాయకుడే. కాబట్టి కామ్రేడ్లు అనగానే కమ్మారెడ్లు అనే రెటారిక్ గానీ, కమ్యూనిస్టులు కులానికీ అతీతంగా ఉంటారనే ఇంకో రెటారిక్ గానీ నిలబడేవి కావు. వాస్తవం బైనరీల్లో ఉండదు.


కమ్యూనిస్టు ఉద్యమాలలో, అందులో మహిళల్లో కింది నుంచి కింది కులాలనుంచి వచ్చిన వారి ప్రయాణం కఠినంగా ఉండడానికి ఆస్కారమెక్కువ. ఎదురీత ఎక్కువ, బతుకుపోరు ఎక్కువ. మిగిలిన ఆటుపోట్లతో పాటు కుటుంబాన్ని నిలబెట్టడానికి చాలా యాతన పడాల్సి ఉంటుంది. అది పరిపూర్ణ జీవితంలోనే కాదు, తర్వాత వచ్చిన తీవ్రమైన ఉద్యమాల్లో కూడా చూస్తాం. ఉద్యమాల్లో పూర్తిస్థాయిలో ఉన్నపుడు అదేదో వేరే గ్రహంలో ఉన్నట్టుంటుంది. బయటపడాల్సి వస్తే నీటి ఒడ్డున పడ్డ చేప పరిస్థితే. కింది వర్గాల వారికి, కింది కులాల వారికి కేపిటలూ, సోషల్ కేపిటలూ ఉండవు. పరిపూర్ణ దాటేసిన గండాల్ని గుండాల్ని వెనక్కి తిరిగి చూసుకుంటూ రాయడం వల్ల సామాన్యంగా కనిపించొచ్చేమో కానీ ఆ అనుభవాలన్నీ అసామాన్యమైనవి. కమ్యూనిస్టులు పెద్ద యెత్తున సినీ ప్రవేశం చేయడానికి సంబంధించి ఇప్పటికే కొన్ని అంశాలు చర్చలో ఉన్నాయి. దానికి విలువైన చేర్పు పరిపూర్ణ చేశారు. క్రూరాతి క్రూరుడుగా పేరుబడిన పోలీస్ ఆఫీసర్ పళనియప్పన్ బారినుంచి తప్పించుకోవడానికి చాలామంది కమ్యూనిస్టులు చెన్నై బాట పట్టారని రాసుకొచ్చారు. చిత్రహింసలకు, బూటకపు ఎన్‌కౌంటర్లకు పేరుబడిన, నాజీగా ముద్రపడిన పళనియప్పన్ పరిపూర్ణ విషయంలో సాత్వికంగా వ్యవహరించడం ఈ దేశంలో కులం పాత్రను మరో వైపునుంచి పట్టించే ముఖ్యమైన అంశం. ‘రాష్ర్ట వ్యాప్తంగా అట్లా పేరు బడ్డవాడు నా పట్ల అంత దయగా, సాత్వికంగా ఉండడానికి కారణం తనలాగే నేను కూడా షెడ్యూల్డ్ కులాలకు చెందిన దాన్ని కావడం అవ్వచ్చేమో! రెండో కారణం నా పద్దెనిమిదేళ్ల చిన్న వయస్సు కూడా కావచ్చు’. ఈ గడ్డ మీద కులవర్గ ప్రయాణాలు చాలా జటిలమైనవి. 


వ్యక్తిగత జీవితంలో చేదు అనుభవాలున్నప్పటికీ వాటిని చర్చించే పద్ధతికి, రాజకీయాలను చర్చించే పద్ధతికి తేడా పాటించారు పరిపూర్ణ. భర్త గురించి రాస్తున్నప్పుడు కూడా అతని కార్యాచరణ గురించి రాస్తున్నపుడు ఆ తేడా కనిపిస్తుంది. సంయమనం కనిపిస్తుంది. జాషువాతో వాదన కావచ్చు. వైయక్తిక అనుభవాలు కావచ్చు. ఎంత నిక్కచ్చిగా రాయాలనుకున్నా స్వీయచరిత్ర రాస్తున్నపుడు ఎంతో కొంత సబ్జెక్టివిటీ పనిచేస్తుంది కదా, మనల్ని మనం ఫోకస్‌లో పెట్టుకుని రాస్తాం కదా అనిపించొచ్చు. అలాంటి డిస్కౌంట్లు ఎన్ని ఇచ్చుకున్నా పరిపూర్ణ జీవితానుభవాన్ని ఇంచుక కూడా తక్కువ చేయలేవు. అంత దీర్ఘమైన విశాలమైన లోతైన జీవితానుభవం. ఇవ్వన్నీ సరే, ఆమె తన్మయత్వంతో పాడుతుంటే వినడం గొప్ప అనుభవం. అవకాశముంటే మిస్ చేసుకోకండి. 

జి.ఎస్. రామ్మోహన్

Updated Date - 2022-08-21T06:01:51+05:30 IST