ఉత్కంఠకు తెర!

ABN , First Publish Date - 2021-01-26T06:52:50+05:30 IST

ఉత్కంఠ వీడింది. పంచాయతీ ఎన్నికలను నిలిపివేయాలని ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల నాయకుల పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది.

ఉత్కంఠకు తెర!

సుప్రీం తీర్పుతో ఎన్నికలకు బాట

స్వల్ప మార్పులతో రీషెడ్యూల్‌

రేపే నోటిఫికేషన్‌ విడుదల.. 

ఫిబ్రవరి 9న తొలి విడత ఎన్నికలు


ఉత్కంఠ వీడింది. పంచాయతీ ఎన్నికలను నిలిపివేయాలని ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల నాయకుల పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. షెడ్యూల్‌ను ఇప్పటికే ప్రకటించిన ఎన్నికల కమిషన్‌ దానిలో కొద్దిపాటి మార్పులు చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం తొలి విడత జరగాల్సిన ఎన్నికలను నాలుగో విడత నిర్వహించనున్నారు.


(ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం)

తొలుత విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం జిల్లాలో నూజివీడు డివిజన్‌లో తొలివిడత ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ సుప్రీం తీర్పు వెలువడటం.. తొలి విడత నామినేషన్ల స్వీకరణకు గడువులోగా కలెక్టర్‌ నుంచి వెలువడాల్సిన నోటిఫికేషన్‌ వెలువడకపోవడంతో తొలి విడత జరగాల్సిన ఎన్నికలను నాలుగో విడతలో నిర్వహించనున్నారు. అలాగే రెండో విడత జరగాల్సిన ఎన్నికలను తొలి విడత, మూడో విడతను రెండో విడత, నాలుగో విడతను మూడో విడత నిర్వహించనున్నారు. ఈ మేరకు మార్పు చేసిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ విడుదల చేశారు. దీని ప్రకారం విజయవాడ డివిజన్‌లో తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడత గుడివాడ, మూడో విడత మచిలీపట్నం, నాలుగో విడత నూజివీడు డివిజన్లలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్‌ మార్పులతో కూడిన షెడ్యూల్‌ను సోమవారం జారీ చేసింది. 


తొలి విడత ఎన్నికలకు 27న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన అనంతరం ఆ నోటిఫికేషన్‌ను అమలు చేస్తూ కలెక్టర్‌ ఇంతియాజ్‌  ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఆ తర్వాతే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ అనివార్యం కావడంతో ఔత్సాహిక అభ్యర్థులు తమ పార్టీల అధినాయకులను కలుసుకునేందుకు తమ అనుచరులతో కలసి వెళ్లి మంతనాలు ప్రారంభించారు. గ్రామాల్లో తమ పట్టు కోల్పోకుండా ఎన్నికల్లో గెలిచేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. నామినేషన్ల స్వీకరణ తర్వాత ప్రచారానికి తక్కువ సమయం ఉండంతో, ఖర్చు తగ్గుతుందని  పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2019 సాధారణ ఎన్నికల ఓటమి తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో తమ సత్తా చాటుకునేందుకు టీడీపీ శ్రేణులు ఉత్సాహంతో ముందడుగు వేస్తున్నాయి. వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో 2019 నాటి గెలుపును కొనసాగించేందుకు ఆ పార్టీ నాయకులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  


 నేటి నుంచి వేగవంతం

జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సోమవారం సాయంత్రం వరకు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. మంగళవారం ఉదయం నుంచి ఎన్నికల విధులపై దృష్టి సారించే అవకాశాలున్నట్టు అధికారులు చెబుతున్నారు. పంచాయతీల రిజర్వేషన్లు గతంలోనే ప్రకటించారు. పంచాయతీలవారీగా ఓటర్ల జాబితాల తయారీ, పోలింగ్‌ స్టేషన్‌ల గుర్తింపు, రిటర్నింగ్‌ అధికారులు, స్టేజ్‌-1, స్టేజ్‌-2, అధికారులు, పోలింగ్‌ అధికారుల నియామకంతో పాటు, బ్యాలెట్‌ పత్రాలు, బాక్సులను సిద్ధం చేశారు.

 

ఫిబ్రవరి 9న తొలివిడత ఎన్నికలు..

జిల్లాలో పంచాయతీ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ఫిబ్రవరి తొమ్మిదో తేదీన విజయవాడ డివిజన్‌, ఫిబ్రవరి 13న గుడివాడ డివిజన్‌, 17న మచిలీపట్నం డివిజన్‌, 21వతేదీన నూజివీడు డివిజన్లలో ఎన్నికలు నిర్వహిస్తారు. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. అనంతరం ఓట్లను లెక్కించి, ఫలితాలను వెల్లడిస్తారు. మొదటి విడత ఎన్నికలకు ఈ నెల 29వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. రెండోదశకు ఫిబ్రవరి 2వతేదీ నుంచి, మూడో దశకు ఫిబ్రవరి 6 నుంచి, నాలుగో దశకు 10వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 

Updated Date - 2021-01-26T06:52:50+05:30 IST