పంచాయతీ ఖర్చు రూ.200 కోట్లు!?

ABN , First Publish Date - 2021-02-25T06:29:52+05:30 IST

పంచాయతీ ఎన్నికల్లో ముందెన్నడూ లేనంతగా ఈసారి అభ్యర్థులు భారీగా ఖర్చుచేశారు.

పంచాయతీ ఖర్చు రూ.200 కోట్లు!?

పోలింగ్‌ ముందు రోజు విచ్చలవిడిగా పంపకం

రూ.500 నుంచి రూ.3000 వరకూ

నగర శివారునున్న ఒక పంచాయతీలో ఓటుకు రూ.10,000

చివరి విడతలో ఎన్నికలు జరిగిన ఒక మండలంలో రూ. 30 కోట్లు వ్యయం

రూ.కోటి నుంచి రూ.2 కోట్లు ఖర్చుచేసిన అభ్యర్థులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


పంచాయతీ ఎన్నికల్లో ముందెన్నడూ లేనంతగా ఈసారి అభ్యర్థులు భారీగా ఖర్చుచేశారు. జిల్లాలో అభ్యర్థుల ఖర్చు రూ.200 కోట్లు దాటి వుంటుందని ప్రధాన పార్టీల నేతలు అంచనా వేస్తున్నారు. నాలుగు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. తొలి, మలి విడతల్లో ఎన్నికలు జరిగిన అనకాపల్లి, నర్సీపట్నం డివిజన్‌ల పరిధిలోని కొన్ని పంచాయతీల్లో అభ్యర్థులుగా విపరీతంగా ఖర్చుపెట్టారు. ఆ తరువాత పాడేరు డివిజన్‌కు వస్తే...మండల కేంద్రాలు, మేజర్‌ పంచాయతీల్లో ఖర్చు బాగానే పెట్టారు. ఇక, చివరి విడత విశాఖ డివిజన్‌లో వున్నది ఆరు మండలాలే అయినప్పటికీ మొదటి మూడు విడతలకు మించి అభ్యర్థులు ఖర్చు చేశారు. ఒక్క మండలంలోని అభ్యర్థులే సుమారు రూ.30 కోట్లు వరకు పంపకాలు చేసినట్టు చెబుతున్నారు. ఈ పర్యాయం ఓటర్లకు దాదాపు అన్నిచోట్ల రూ.500 నుంచి మూడు వేల రూపాయల వరకు పంచారు. అయితే నగర శివారునున్న కొన్ని పంచాయతీల్లో పోలింగ్‌ ముందు రోజు రాత్రి ఓటుకు పది వేల రూపాయలు వరకు ఇచ్చారు. కొన్నిచోట్ల కుటుంబాలను గంపగుత్తగా కొనుగోలు చేశారు. ఎన్నికల వ్యయం తాము ముందు వేసుకున్న అంచనాకు మించినప్పటికీ చివరి నిమిషంలో తాడోపేడో అంటూ కొందరు మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేశారు. 


జిల్లాలోని ఎలమంచిలి నియోజకవర్గంలోని కొన్ని మండలాలు, పాయకరావుపేట పరిసర  మండలాల్లో కొందరి అభ్యర్థుల ఖర్చు రూ.20 నుంచి 50 లక్షల రూపాయల వరకు అయిందని అంచనా వేస్తున్నారు. విశాఖ నగర పరిసరాల్లో గల మండలాల్లో ఖర్చు ఇంకా పెరిగిందంటున్నారు. ముఖ్యంగా నగరానికి ఆనుకుని వున్న ఆనందపురం మండలంలో ఖర్చు రూ.30 కోట్లు వరకు వుంటుందని అధికార పార్టీ నేత ఒకరు వెల్లడించారు. ఈ మండలంలోని మూడు పంచాయతీల్లో ఒక్కొక్క అభ్యర్థి రూ.కోటి నుంచి రెండు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు. రియల్‌ వ్యాపారులు ఈ ఎన్నికలలో కీలకపాత్ర పోషించారు. పంచాయతీల్లో లేఅవుట్‌ల అనుమతి కావాలంటే సర్పంచ్‌ కీలకం. అందుకోసమే తమకు అనుకూలురైనవారు సర్పంచ్‌లయ్యేందుకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు భారీగా సొమ్ములు వెచ్చించారని అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. 


సర్పంచ్‌ ఎన్నికపై రూ.ఐదు కోట్ల బెట్టింగ్‌


 ఆనందపురం మండలంలోని ఒక పంచాయతీలో సర్పంచ్‌ ఎన్నికపై ఐదు కోట్ల రూపాయల వరకు బెట్టింగ్‌ జరిగింది. సర్పంచ్‌ పదవికి అధికార పార్టీ మద్దతుదారుడు పోటీ చేయగా...అదే పార్టీకి చెందిన రెబల్‌ పోటీపడ్డారు. ఇరువురి అభ్యర్థులకు ఇద్దరు అధికార పార్టీ నేతలు ఆశీస్సులు ఉన్నాయి. దీంతో ఇద్దరూ ఖర్చుకు వెనుకాడలేదు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికపై ఐదుకోట్ల రూపాయల వరకు బెట్టింగ్‌ జరిగిందని ప్రచారం సాగుతుంది. అయితే ఐదు కోట్ల కంటే ఎక్కువగా జరిగిందని ఆనందపురం మండలానికి చెందిన నేత ఒకరు వ్యాఖ్యానించారు. పోటీ చేసిన అభ్యర్థుల ఇంటి పేర్లు వేరైనా పేర్లు ఒకటే కావడం గమనార్హం. కాగా గ్రామంపై పట్టు కోసం జరిగిన ఎన్నికలలో అఽధికార పార్టీ మద్దతుదారుడే గెలిచాడు. 

Updated Date - 2021-02-25T06:29:52+05:30 IST