ముస్లింల వ్యాపారాలపై Economic boycott.. Manesar పంచాయతీ పిలుపు

ABN , First Publish Date - 2022-07-04T00:10:15+05:30 IST

ముస్లింల వ్యాపారాలపై ఆర్థిక బహిష్కరణకు హర్యానాలోని మనెసార్‌‌లో ఆదివారం జరిగిన ఒక పంచాయతీలో..

ముస్లింల వ్యాపారాలపై Economic boycott.. Manesar పంచాయతీ పిలుపు

మనెసార్: ముస్లింల వ్యాపారాలపై ఆర్థిక బహిష్కరణకు హర్యానాలోని మనెసార్‌‌లో ఆదివారం జరిగిన ఒక పంచాయతీలో పిలుపునిచ్చారు. స్థానిక ఆలయంలో జరిగిన పంచాయతీలో హిందూ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు ఈ పిలుపునిచ్చాయి. ఆయా గ్రామాల్లో ఈ బాయ్‌కాట్ నిర్ణయాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని స్థానికి ప్రభుత్వ యంత్రాగానికి వీరు విజ్ఞప్తి చేశారు. బజ్‌రంగ్‌ దళ్, విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ)కి చెందిన సభ్యులతో సహా 200 మందికి పైగా ఈ పంచాయతీలో పాల్గొన్నారు. మనెసార్, ధరుహెరా, గురుగావ్ ప్రాంతాలకు చెందిన పలువురు ఇందులో పాల్గొన్నారు.


అక్రమంగా నివసిస్తున్న వలసదారులను వెనక్కి పంపించాలని కూడా డ్యూటీ మెజిస్ట్రేట్‌కు ఒక విజ్ఞాపన పత్రాన్ని పంచాయతీ సభ్యులు అందజేశారు. అక్రమవలసదారుల వ్యవహారంపై తక్షణం దర్యాప్తు జరిపి, వారిని వెనక్కిపంపించాలని, మతమార్పిడుల వ్యవహారంలో వీరికి ప్రమేయం ఉందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ మెమొరాండంలో వారు విజ్ఞప్తి చేశారు.


మనెసార్ వీహెచ్‌పీ ప్రధాన కార్యదర్శి దేవేందర్ సింగ్ ఈ పంచాయతీని ఉద్దేశించి మాట్లాడుతూ, దేశంలో వేళ్లూనుకుంటున్న  మతోన్మాద, జీహాదీ శక్తులకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలోని హిందూ సమాజం గళం విప్పాలని కోరారు. ''హిందువులను చంపుతున్నారు. అనేక మంది రోహింగ్యాలు, బంగ్లాదేశీలు, చివరకు పాకిస్థానీయులు తమ ఐడెంటిటీని దాచిపెడుతూ గురుగావ్, మనెసార్‌లో అక్రమంగా నివశిస్తున్నారు. పలులు రకాల వ్యాపారాలు చేసుకుంటున్నారు. దీనిపై దర్యాప్తు జరిపి అక్రమ డాక్యుమెంట్లు కలిగిన వారిని గుర్తించేందుకు ప్రభుత్వ యంత్రాంగానికి వారం రోజులు గడువు ఇస్తున్నాం. సరైన చర్య తీసుకోని పక్షంలో హిందూ సమాజమే తగిన చర్యలకు దిగుతుంది. మరో పంచాయతీని భారీ స్థాయిలో నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తాం'' అని అన్నారు. మనెసార్‌లోని ముస్లింలు తమ కుట్రలో భాగంగా హిందూ దేవతల పేర్లు పెట్టుకుని జ్యూస్ దుకాణాలు, సెలూన్లు నడుతున్నారని పలువురు వక్తలు ఈ సందర్భంగా ఆరోపించారు. వీరిపై ఆర్థిక బహిష్కరణ జరగాలని, ఇదొక్కటే పరిష్కారమని అన్నారు. ఇందుకోసం గ్రామగ్రామాన కమిటీలు ఏర్పాటు చేయాలని, మనెసార్ నుంచి ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేశామని దేవేందర్ సింగ్ చెప్పారు.

Updated Date - 2022-07-04T00:10:15+05:30 IST