పంచాయతీలకు కాసులే కాసులు!

ABN , First Publish Date - 2021-02-19T05:12:49+05:30 IST

పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని అన్ని గ్రామ పంచాయతీలకు నిధులు సమకూరాయి.

పంచాయతీలకు కాసులే కాసులు!

ఇంటి, నీటి పన్నులతోపాటు నామినేషన్ల ఫీజులు

పంచాయతీ స్థాయిని బట్టి ఆదాయం

రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు

జిల్లావ్యాప్తంగా రూ.కోట్లలో రాబడి


సంగం, ఫిబ్రవరి 18: పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని అన్ని గ్రామ పంచాయతీలకు నిధులు సమకూరాయి. ఇప్పటివరకు సాధారణ నిధులు కూడా లేక కునారిల్లుతున్న పంచాయతీలకు ఎన్నికల సందర్భంగా రాబడి వచ్చింది. పన్ను బకాయిలు ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ఇప్పటివరకు అనేక మంది గ్రామాల్లో ఏళ్ల తరబడి పన్నులు చెల్లించలేదు. ఒక్కొక్కరు రూ.వేలల్లోనే బకాయిలు ఉన్నారు. అయితే ఇప్పుడు ఎస్‌ఈసీ ప్రకటనతో వారికి చిక్కొచ్చి పడింది. దీంతో బకాయిలు చెల్లించి ఆ రశీదులు చేత పట్టుకుని నామినేషన్‌ దాఖలు చేశారు. పన్ను బకాయిలతోపాటు నామినేషన్ల ద్వారా కూడా పంచాయతీలకు ఆదాయం సమకూరింది. ఆ విధంగా ఇంటి పన్నులు, నీటిపన్నులతోపాటు వివిధ రకాల పన్నుల చెల్లింపులు, నామినేషన్ల ద్వారా పంచాయతీలకు సుమారు రూ.6 కోట్ల నుంచి 7 కోట్ల వరకు వచ్చినట్లు సమాచారం.


ముందే చెల్లింపులు

ఒక్కో పంచాయతీలో సర్పంచ్‌ పదవితోపాటు వార్డు సభ్యుల పదవులకు 30 నుంచి 35 మంది పోటీ చేశారు. అయితే సర్పంచ్‌, వార్డు పదవులకు పోటీ చేసే అభ్యర్థులు ఇప్పటివరకు పంచాయతీకి ఉన్న బకాయిలను చెల్లించలేదు. దీంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇలాంటి బకాయిలన్నీ చెల్లించేశారు. ఆ విధంగా ప్రతి పంచాయతీకి సరాసరిన రూ.50 వేల నుంచి రూ. 2 లక్షల వరకూ ఆదాయం సమకూరినట్లు సమాచారం. ఇంకోవైపు పోటీ చేయాలని ఆసక్తి ఉన్నవారు కూడా ముందుగా పంచాయతీల్లో ఎలాంటి పన్నులు లేకుండా చెల్లింపులు జరిపేశారు. జిల్లా వ్యాప్తంగా 941 పంచాయతీలు ఉండగా 5 మినహా మిగిలిన పంచాయతీల్లో ఇప్పటికే మూడు విడతల ఎన్నికలు ముగిశాయి. ఈ నెల 21 న నాల్గవ విడత ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికలు జరిగిన, జరుగుతున్న పంచాయతీల్లో సర్పంచు పదవులకు, వార్డు సభ్యులకు వేలల్లో దరఖాస్తులు చేశారు. అయితే వీరంతా ఉన్న పన్ను బకాయిలను ఆయా అభ్యర్థులు చెల్లించారా అంటే కానే కాదు. చాలావరకు వారితో నామినేషన్లను వేయించిన పార్టీ నాయకులే చెల్లించారు. ఒక పార్టీ మద్దతుదారులకు ఆ గ్రామ నాయకులే చెల్లించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన 936 పంచాయతీల్లో 936 సర్పంచు పదవులకు సుమారు మూడువేల మంది. 9326 వార్డులకు సుమారు 15 వేల మంది నామినేషన్ల చేశారు. వీరంతా చెల్లించిన పన్ను బకాయిలతోపాటు నామినేషన్ల ఫీజుల రూపంలో పంచాయతీలకు జిల్లావ్యాప్తంగా సుమారు రూ.6-7 కోట్ల మేర ఆదాయం సమకూరింది. దీంతో పారిశుధ్య పనులు నిర్వహించేందుకు చీపురు కూడా కొనేందుకు కూడా చిల్లిగవ్వ లేని పంచాయతీలకు అటు ఇంటిపన్ను, ఇటు నామినేషన్ల కారణంగా బకాయిలు వసూలు కావడం కొంత ఊరటనివ్వనుంది.  

Updated Date - 2021-02-19T05:12:49+05:30 IST