ఏకగ్రీవాలకు.. షాక్‌!

ABN , First Publish Date - 2021-02-06T05:38:55+05:30 IST

జిల్లాలో జరిగిన 337 పంచాయతీలు, 3,442 వార్డులకు ఎన్నిక జరగాల్సి ఉంటే, పంచాయతీల్లో 67 పంచాయతీలు, వార్డుల్లో 1,337 ఏకగ్రీవమయ్యాయి.

ఏకగ్రీవాలకు..  షాక్‌!

జిల్లాలో జరిగిన ఏకగ్రీవాల నిలుపుదల

చెప్పేవరకు అధికారిక ప్రకటన వద్దన్న ఎన్నికల సంఘం

ఎన్నికైన అభ్యర్థుల్లో గుబులు

ఏకగ్రీవాలపై ప్రత్యేక అధికారుల విచారణ

  


 మీ పంచాయతీ ఏకగ్రీవం ఎలా అయింది? మీరే స్వచ్ఛందంగా నామినేషన్‌ ఉపసంహరించుకున్నారా! లేక ఎవరైనా బలవంతం చేశారా? కారణాలు నిర్మొహమాటంగా చెప్పండి. మీరు చెప్పే వివరాలు గోప్యంగానే ఉంచుతాం. ఎక్కడా భయపడాల్సిన పనిలేదంటూ.. ప్రత్యేక కలెక్టర్‌లు, జిల్లాస్థాయి అధికారుల బృందం ఆరా తీస్తోంది. ఆకస్మింగా గ్రామాలకు చేరుకున్న స్పెషల్‌ కలెక్టర్లు, జేసీ స్థాయి అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఆకస్మిక విచారణ గ్రామాల్లో వాడివేడి చర్చలకు తెరతీస్తోంది.

 

గెలుస్తామో, ఓడిపోతామో అనేది తర్వాత... మంచి అవకాశం ఉన్నా బలవంతంగా ఏకగ్రీవం చేయించుకున్నాం. అలా కాకుండా ఎన్నికలకే వెళితే బాగుండేదేమో! అనవసరంగా రూ.లక్షలు ఖర్చుచేసి గెలిచామనిపించుకున్నాం. రేపటి రోజున ఎన్నికల సంఘం ఏ నిర్ణయం ప్రకటిస్తుందో! మన భవితవ్యం ఏమవుతుందో!... ఇదీ ప్రస్తుతం జిల్లాలో ఏకగ్రీవమైన స్థానాల్లో గెలిచిన అభ్యర్థుల పరిస్థితి. 

 

తెనాలి, గుంటూరు, ఫిబ్రవరి 05, (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జరిగిన 337 పంచాయతీలు, 3,442 వార్డులకు ఎన్నిక జరగాల్సి ఉంటే, పంచాయతీల్లో 67 పంచాయతీలు, వార్డుల్లో 1,337 ఏకగ్రీవమయ్యాయి. అయితే వీటిలో కొన్ని మాత్రమే స్వచ్ఛందంగా ఏకగ్రీవం చేసుకుంటే, 80శాతం పంచాయతీలు, వార్డులు అనేక బెదిరింపులు, తాయిలాలతోనే బలవంతపు ఏకగ్రీవాలు చేశారని ఆరోపణ. ఎన్నికల సంఘం జిల్లాలో ఇప్పటివరకు జరిగిన ఏకగ్రీవాలపై అధికారిక ప్రకటన చేయరాదని ఆదేశించింది. ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ ఉన్నారు. ఏకగ్రీవమైన 67 సర్పంచ్‌ అభ్యర్థుల్లో 63 మంది అధికారపార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులే కావటం విశేషం. మిగిలిన నలుగురిలో ఇద్దరు తెలుగుదేశం మద్దతిచ్చినవారయితే, మిగిలిన ఇద్దరు స్వతంత్రులే. అధికార పార్టీ మద్దతు అభ్యర్థులు 63 మందిలో కొన్ని ప్రాంతాల్లో జరిగిన ఏకగ్రీవాలపై ఫిర్యాదులు ఇప్పటికే ఎన్నికల సంఘానికి చేరాయి. చుండూరు, వలివేరు వంటి గ్రామాలు, అమృతలూరు, వేమూరు వంటి మరికొన్ని మండలాల్లో నెలకొన్న పరిస్థితులపై ఫిర్యాదులు ఎక్కువగా రావటంవల్లే ఎన్నికల సంఘం వీటి నిలుపుదలకు నిర్ణయం తీసుకుని ఉంటుందని గ్రామస్తులు అభిప్రాయపడుతుంటే, అధికార పార్టీ నేతలు మాత్రం కావాలనే ఏకగ్రీవాలను కానివ్వకుండా అడ్డుకుంటున్నారని విమర్శలకు దిగుతున్నారు. 


గత ఎన్నికల్లో 17.82 శాతం

 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 348 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానానికి ఎన్నిక జరిగితే వీటిలో అప్పట్లో 62 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అంటే అది 17.82 శాతం జరిగినట్టు. అయితే ఇప్పడు జరుగుతున్న తొలి విడత తెనాలి డివిజన్‌ పంచాయతీల ఎన్నికల్లో 337 పంచాయతీలకే ఎన్నిక జరుగుతోంది. వీటిలో 67 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే ఏకగ్రీవ శాతం మాత్రం 19.88గా ఉంది. గత ఎన్నికలకు, ఈ ఎన్నికలకు మధ్య ఏకగ్రీవాల శాతాల మద్య రెండు శాతం వ్యత్యాసం ఉంది. అటు వార్డుల్లోనూ 2013 ఎన్నికల్లో 3,568 వార్డులకు ఎన్నిక జరిగింది. దీనిలో 1,449 వార్డులు అప్పట్లో ఏకగ్రీవం అయ్యాయి. అంటే 40.61 శాతం ఏకగ్రీవం అయినట్టు. ఇప్పుటి ఎన్నికల్లో 3,442 వార్డులకు ఎన్నిక జరుగుతుంటే, 1,337 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 38.84 శాతం ఏకగ్రీవాలయినట్టు లెక్క. అయితే  వార్డుల విషయంలనూ కొంత లోపాయికారిగా జరిగినా, ఎక్కువశాతం స్థానిక పరిస్థితుల కారణంగానే ఏకగ్రీవాలు అయ్యాయనేది రాజకీయ నేతల మాటే. ఈ 67 ఏకగ్రీవ పంచాయతీల్లో వార్డులతో సహా ఏకగ్రీవం అయిన పంచాయతీలు కేవలం 25 మాత్రమే. మిగిలిన వాటిలో సర్పంచ్‌ ఏకగ్రీవం అయినా, వార్డులకు యధావిదిగానే ఎన్నికలు జరుగుతున్నాయి.  

 

ఏకగ్రీవాలపై నివేదిక!

 తెనాలి, నరసరావుపేట సబ్‌ కలెక్టర్లతో జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ అత్యవసరంగా భేటీ అయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం వారిద్దరిని ఆయన తన కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడారు. అంతకుముందే జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఏకగ్రీవాల విషయంలో ఎలాంటి తుదినిర్ణయాన్ని ప్రకటించొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషన్‌ ఆదేశించారు. దీంతో సబ్‌ కలెక్టర్లతో కలెక్టర్‌ సమావేశం ప్రాధాన్యం సంతరించుకొంది. ముఖ్యంగా తెనాలి డివిజన్‌లో జరిగిన 67 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం కావడంపై సబ్‌ కలెక్టర్‌ నుంచి నివేదిక కోరినట్లు తెలిసింది.  


హుటాహుటిన గ్రామాలకు ప్రత్యేకాధికారులు

 వెనువెంటనే చుండూరు, అమృతలూరు, భట్టిప్రోలు, వేమూరు, బాపట్ల, పొన్నూరు, కొల్లిపర, కొల్లూరు, రేపల్లె నియోజకవర్గంలోని మరికొన్ని మండలాల్లో శుక్రవారం సాయంత్రం ప్రత్యేక అధికారులు వచ్చారు. ప్రధానంగా ఏకగ్రీవమైన పంచాయతీలకు వెళ్లి, అక్కడ ఏకగ్రీవమైన అభ్యర్థులను, నామినేషన్‌ ఉపసంహరించుకున్న అభ్యర్థులను కలసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. చుండూరు మంలంలో సర్వశిక్షాఅభియాన్‌ సీఈవో వెంకటప్పయ్య పర్యటించారు. ఇక్కడ ఏకగ్రీవ పంచాయతీలో ఆరా తీశారు. చుండూరు పంచాయతీకి సంబంధించి తనను నామినేషన్‌ వెయనివ్వకుండా ఎస్‌ఐ బెదిరించారని బాలకోటిరెడ్డి అనే యువకుడు రెండురోజుల క్రితం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీని కూడా కలసి ఫిర్యాదు అందించారు. అతను శుక్రవారం ప్రత్యేక అధికారులు వచ్చిన సమయంలో అజ్ఞాతంలోనే ఉండటంతో వారిని కలవలేకపోయారు. అయితే ఆ బెదిరింపుల వ్యవహారంపై శుక్రవారం కూడా తెలుగుదేశం నాయకులు ఎన్నికల సంఘానికి మరోసారి ఫిర్యదు చేశారు. ఇదిట్లా ఉంటే, అధికారులు కలసిన సమయంలో కొందరు అభ్యర్థులు తమకు అన్యాయం జరిగిందని, తప్పనిసరి పరిస్థితుల్లో విరమించుకోవలసి వచ్చిందని వివరించారని సమాచారం. ప్రస్తుతం ఎన్నికల సంఘం అండగా నిలిచినా, తర్వాత ప్రభుత్వం, వారి ఆధీనంలో పనిచేసే అధికారులు ఉంటారు కనుక భవిష్యత్‌ ఆలోచించి మీకేమీ చెప్పులేకపోతున్నామని మరికొందరు వెనకడుగు వేసినట్టు చెబుతున్నారు. ఇదే తీరులో నేతలుకూడా కొందరు బెదిరించారని, అందువల్ల మాట్లాడలేమని తేల్చిచెప్పినట్టు సమాచారం.  పొన్నూరులో అత్యధికంగా పది పంచాయతీలు, రేపల్లె, పి.వి.పాలెం, కాకుమానులో ఆరు చొప్పున, బాపట్ల, కొల్లిపరల్లో ఐదు వంతున, కర్లపాలెం, నగరం, నిజాంపట్నం మండలాల్లో నాలుగు పంచాయతీల చొప్పున ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. అయితే అధిక పంచాయతీలు ఏకగ్రీవమైన మండలాలపై ఈ అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారని, దీనికి తగ్గట్టుగానే విచారణకు సంబంధించి అంశాలనుకూడా నమోదు చేసినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే, పంచాయతీరాజ్‌ అధికారులకు కూడా అభ్యర్థులు, విరమించిన ప్రత్యర్థుల వివరాలు పంపాలని ఆదేశాలొచ్చినట్టు సమాచారం.  

Updated Date - 2021-02-06T05:38:55+05:30 IST