Advertisement
Advertisement
Abn logo
Advertisement

బీసీల వెన్నుముకను జగన్‌రెడ్డి విరిచేశారు: పంచుమర్తి

అమరావతి:  బీసీల అభివృద్ధికి టీడీపీ బాటలు వేస్తే అదే బీసీల వెన్నుముకను జగన్మోహన్‌రెడ్డి విరిచేశారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. మంగళవారం అనురాధ మీడియాతో మాట్లాడుతూ.. ఒక్క చాన్స్ ఇస్తే బీసీలను నాశనం చేస్తా అన్నట్టు వైసీపీ నేతల తీరుందన్నారు. బీసీలకు ఏదో చేసినట్టు అధికార పార్టీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కేటాయించింది టీడీపీనేనని స్పష్టం చేశారు. ఆ 34 శాతం రిజర్వేషన్లను జగన్‌రెడ్డి 24 శాతానికి తగ్గించింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 


రిజర్వేషన్ల కోతతో  16 వేలమంది బీసీలను నాయకత్వానికి దూరం చేశారని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో లక్ష కోట్లు సంక్షేమానికి కేటాయించగా అందులో రూ. 39 వేల కోట్లు బీసీలకే ఖర్చు చేశామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్‌కు చెందిన రూ. 18, 266 వేల కోట్ల నిధులను దారి మళ్లించిందన్నారు. జగన్మోహన్‌రెడ్డి తన చర్యలతో బీసీలను బిచ్చగాళ్లుగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల అభివృద్ధి కోసం టీడీపీ అమలు చేసిన ఆదరణ పథకాన్ని నిలిపేశారన్నారు. చంద్రబాబు హయాంలో చేతివృత్తుల కోసం కొనుగోలు చేసిన పనిముట్లను తుప్పు పట్టించారన్నారు. జగన్‌కి బీసీలంటే ఎందుకు చిన్నచూపని నిలదీశారు. చంద్రబాబు చేసిన రూ.24 వేల కోట్ల రుణమాఫీ పొందిన వారిలో 40 శాతం బీసీలేనని చెప్పారు. జగన్ తన స్వార్ధ ప్రయోజనాల కోసం అమరావతిని చంపేశారని పంచుమర్తి అనురాధ దుయ్యబట్టారు. 

Advertisement
Advertisement