అమ్మకానికి పంచాయతీ స్థలం

ABN , First Publish Date - 2021-10-18T04:01:06+05:30 IST

స్థానిక అధికార పార్టీ నాయకులు సుమారు రెండు కోట్ల రూపాయల విలువ చేసే 286 అంకణాల పంచాయతీ స్థలాన్ని అమ్మేందుకు సర్వం సిద్ధం చేశారు.

అమ్మకానికి పంచాయతీ స్థలం
పంచాయతీ స్థలం ఇదే

 తక్కువ ధరకు అధికార పార్టీ నేతల కొనుగోలు

విలువ సుమారు రూ. 2 కోట్లు

 ప్లానింగ్‌ అనుమతికి నిరాకరణ

 అనధికారికంగా విక్రయించేందుకు రంగం సిద్ధం

పొదలకూరు, ఆక్టోబరు 17 : స్థానిక అధికార పార్టీ నాయకులు సుమారు రెండు కోట్ల రూపాయల విలువ చేసే 286 అంకణాల పంచాయతీ స్థలాన్ని అమ్మేందుకు సర్వం సిద్ధం చేశారు. ఓ వ్యక్తి నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన వారు ప్లాట్లు వేసి అమ్మకాలు చేసేందుకు సమాయత్తమయ్యారు. పంచాయతీ ప్లానింగ్‌ అనుమతి కోసం అధికారులను సంప్రదించారు. వారి   నిరాకరించడంతో అనధికారికంగా విక్రయించేందుకు పూనుకునట్టు సమాచారం.  ఆ నాయకులు ఎక్కడ ఖాళీగా భూమి కనిపించినా అధికార, అర్ధబలాన్ని ప్రదర్శించి సొంతం చేసుకుంటున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. మండలంలో ఈ తరహా కబ్జాలు చాలానే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రైవేటు వ్యక్తులు వేసిన లే అవుట్‌లలో ప్రజాప్రయోజనాల కోసం కేటాయించిన  స్థలాలన్నింటినీ ఇప్పటికే అమ్మేశారు. తాజాగా పట్టణానికి నడిబొడ్డున ప్రజాప్రయోజనాల కోసం కేటాయించిన 286 అంకణాల స్థలంపై వారి కళ్లు పడ్డాయి. ఆ స్థలాన్ని కైవసం చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టణంలోని కన్నా సుధాకర్‌రెడ్డి ఆసుపత్రి ఎదురుగా ఉన్న వీధిలో 1985లో సత్యనారాయణ ట్రేడర్స్‌ పేరున లే అవుట్‌  వేశారు. అందులో సుమారు 130 ప్లాట్లు వేశారు. కొందరు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించారు. ఈ లే అవుట్‌లో 286 అంకణాల స్థలాన్ని ప్రజాప్రయోజనాల కోసం కేటాయించారు. 2019లో లే అవుట్‌తో సంబంధం ఉన్న ఓ వ్యక్తి ఆ స్థలాన్ని ప్లాట్లుగా వేసి అమ్మకానికి పెట్టారు. ఆ లే అవుట్‌లో ప్లాట్లు కొని కాపురం ఉంటున్న సుమారు 50 కుటుంబాల వారు  ఆ సమాచారాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన ఆ స్థలాన్ని పరిశీలించి ప్రజాప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన స్థలాన్ని కాపాడాలని రెవెన్యూ, పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. దినపత్రికల్లో కూడా కథనాలు రావడంతో తహసీల్దారు, సర్వేయర్‌, వీఆర్‌వో, పంచాయతీ సిబ్బంది ఆ లే అవుట్‌ను పరిశీలించారు. లే అవుట్‌ పూర్తి వివరాలను సేకరించారు.  అది పంచాయతీ అన్‌అప్రూవల్డ్‌ లే అవుట్‌ అనీ,  దాని యజమాని చనిపోయారనీ, రికార్డుల్లో ప్రజాప్రయోజనాల కోసం  286 అంకణాల స్థలం కేటాయించారనీ ధ్రువీకరించారు. అనంతరం ఆ స్థలంలో ఇతరులు ప్రవేశించకుండా పంచాయతీ  బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అధికారుల జోక్యంతో రెండేళ్ల వరకు ఆ స్థలం జోలికి ఎవరూ వెళ్లలేదు. 2019లో ఆ స్థలాన్ని అమ్మకానికి పెట్టిన వ్యక్తే  తాజాగా అంకణం సుమారు రూ. 25 వేల చొప్పున 286 అంకణాలను అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులకు అమ్మేసినట్లు విశ్వనీయ సమాచారం. కొనుగోలు చేసిన వారు ఆ స్థలాన్ని రికార్డుల్లో 9 ప్లాట్లుగా విభజించి వేరే నెంబర్లతో ఇతరులకు అంకణం రూ. 70 వేలకు విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పంచాయతీ ప్లానింగ్‌ అనుమతి కోసం పంచాయతీ అధికారుల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. అధికారులు వ్యతిరేకించడంతో ఎలాగైనా ఆ స్థలాన్ని అనధికారికంగా విక్రయించాలని చూస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా, పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి  కబ్జాదారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా సత్యనారాయణ ట్రేడర్స్‌ అప్రూవల్‌ లే అవుట్‌ కాదని, ఆ లే అవుట్‌ యజమాని చనిపోయారని,  ప్రజాప్రయోజన స్థలాన్ని ఫేక్‌ నెంబర్లతో ఎవరు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నా, క్రయ విక్రయాలు చేసినా అవి చెల్లవని, అటువంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఆ స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా చూస్తామని  తెలిపారు.




Updated Date - 2021-10-18T04:01:06+05:30 IST