Corona effect: ఒలంపిక్స్‌లో ఈ సారి..

ABN , First Publish Date - 2021-07-16T06:46:20+05:30 IST

ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవానికి హాజరయ్యే అతిథుల సంఖ్యలో భారీగా కోత విధించారు. ఈ నెల 23న జరిగే ఆ వేడుకల్లో కేవలం వెయ్యి మంది వీఐపీలనే అనుమతించనున్నారు. ఇంతకుముందు పదివేల మందికి ఎంట్రీ ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించారు. కానీ, కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ సంఖ్యను తగ్గించారు...

Corona effect: ఒలంపిక్స్‌లో ఈ సారి..

  • ఒలింపిక్స్‌ 7 రోజుల్లో


వెయ్యి మందికే..

ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవానికి హాజరయ్యే అతిథుల సంఖ్యలో భారీగా కోత విధించారు. ఈ నెల 23న జరిగే ఆ వేడుకల్లో కేవలం వెయ్యి మంది వీఐపీలనే అనుమతించనున్నారు. ఇంతకుముందు పదివేల మందికి ఎంట్రీ ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించారు. కానీ, కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ సంఖ్యను తగ్గించారు. 


గ్రూప్‌ ఫొటోలు లేవు

టోక్యోలో ఆటగాళ్లకు పతకాల ప్రదానో త్సవం సందర్భంగా పాటించాల్సిన నియమ నిబంధనలను అంతర్జాతీయ ఒలింపిక్‌  కమిటీ (ఐవోసీ) గురువారం విడుదల చేసింది. తాజా మార్గదర్శకాల్లో అథ్లెట్లు, వ్యాఖ్యాతలు, వలంటీర్లు గ్రూప్‌ ఫొటోలు దిగడం నిషేధం. పోడియం వద్ద తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. భౌతిక దూరం కోసం పోడియంపై నిలబడే ప్లేయర్ల మధ్య అడ్డుగా పలకలను ఉంచనున్నారు. పతకాలను అథ్లెట్లే  మెడలో వేసుకోవాలని ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. 



అథ్లెట్‌కు వైరస్‌

మరో వారం రోజుల్లో ఆరంభంకానున్న ఒలింపిక్స్‌ను కరోనా భయపెడుతోంది. ఓ అథ్లెట్‌, ఐదుగురు పనివాళ్లకు పాజిటివ్‌గా వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. కాగా, బ్రెజిల్‌ జూడో టీమ్‌ బస చేసిన హోటల్‌ సిబ్బందిలో ఎనిమిది మందికి కరోనా సోకినట్టు వార్తలు వచ్చాయి. రష్యా రగ్బీ జట్టు సహాయ సిబ్బందిలో ఒకరికి కూడా కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. 


జాతి వివక్షకు వ్యతిరేకంగా..

జాతి వివక్షకు వ్యతిరేకంగా టోక్యోలో బ్రిటన్‌ మహిళా సాకర్‌ జట్టు మోకాళ్లపై నిలబడి శాంతియుతంగా తమ నిరసనను తెలియజేయనుంది. వివిధ క్రీడల్లో ఏడాదిగా ఇలాంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఒలింపిక్స్‌లో కూడా ఆటగాళ్లు తమ ఉద్దేశాన్ని తెలియజేసేందుకు ఐవోసీ కొంత సడలింపునిచ్చింది. సమాజంలో నెలకొన్న అన్యాయం, అసమానత్వానికి వ్యతిరేకంగా తమ తొలి మ్యాచ్‌కు ముందు బ్రిటన్‌ సభ్యులు మైదానంలో మోకాళ్లపై నిలబడనున్నారు. 


Updated Date - 2021-07-16T06:46:20+05:30 IST